బిక్కమొహం వేశారా?

ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలది దాదాపు మూడు దశాబ్దాల అనుబంధం. గుజరాత్ రాజకీయాలతో ప్రారంభమైన వారి అనుబంధ కేంద్ర రాజకీయాల్లో నేటికీ కొనసాగుతోంది. వారికి విజయవంతమైన [more]

Update: 2020-02-13 16:30 GMT

ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలది దాదాపు మూడు దశాబ్దాల అనుబంధం. గుజరాత్ రాజకీయాలతో ప్రారంభమైన వారి అనుబంధ కేంద్ర రాజకీయాల్లో నేటికీ కొనసాగుతోంది. వారికి విజయవంతమైన జోడీగా పేరుంది. 2014లో జాతీయ స్థాయలోనూ ఇద్దరూ సత్తా చాటారు. అప్పటి నుంచి 2018 వరకూ అనేక అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ కమలాన్ని దాదాపు ఆసేతు హిమాచలం విస్తరించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ వారి జోడి బీజేపీకి అప్రతిహత విజయాన్ని సాధించిపెట్టింది. కానీ అప్పటి నుంచే వారికి అసలు పరీక్ష మొదలయింది. ఆ తర్వాత జరిగిన మహారాష‌‌్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. రేపటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.ః

పౌరసత్వ చట్ట సవరణపై….

పార్టీ విషయాలను పక్కన పెడితే ప్రభుత్వ పరంగా కూడా ఇటీవల కాలంలో వారికి చిక్కులు, చికాకులు ఎదురవుతున్నాయి. మోదీ ఆలోచనలను అమిత్ సా సమర్థవంతంగా ఆచరణలో పెడతారన్న పేరుంది. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో రామలక్ష్మణులు, కృష్ణార్జునులు మాదిరిగా కలసికట్టుగా ఉంటారన్న పేరుంది. ఉన్నతస్థాయిలో మోదీ చేసే ఆలోచనలను అమిత్ షా క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసి పార్టీకి, ప్రభుత్వానికి సత్ఫలితాలను రాబడతారన్న పేరు అమిత్ షాకు ఉంది. దీనిని వారి రాజకీయ ప్రత్యర్థులు కూడా తోసిపుచ్చలేరు. కానీ ఇటీవల కాలంలో వారికి ప్రభుత్వ పరంగా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సిటిజెన్ షిప్ ఎమెండ్ మెంట్ యాక్టు (సీఏఏ) జాతీయ పౌర పట్టిక (ఎన్సార్సీ) విషయంలో మోదీ, అమిత్ షాల అంచనాలు, ఆలోచనలు పూర్తిగా విఫలమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించే 370, 35a అధికరణల రద్దు, ట్రిపుల్ తలాక్, రామజన్మభూమి కేసులో సుప్రీంకోర్టు అనుకూల తీర్పుతో మోదీ, షా ద్వయానికి ఇక తిరుగులేదని అందరూ భావించారు. వారు కూడా అదే ఉద్దేశ్యంలో ఉన్నారు. ఈ ఊపులో తీసుకున్న సీఏఏ, ఎన్సార్సీ, ఎన్ పిఆర్, నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.

విపక్షాలను ఏకం చేసి….

చీలికలు, పేలికలుగా ఉన్న విపక్షాలను ఏకం చేసేందుకు ఈ నిర్ణయాలు దోహదపడ్డాయి. నేటికీ దేశవ్యాప్తంగా నిరసనలు వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీఏఏ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉద్రిక్తతను సృష్టిస్తుంది. సీఏఏపై దాఖలైన 143 కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. 2014కు ముందు బంగ్లాదేశ్, ఆఫ్ఫనిస్తాన్, పాకిస్థాన్ ల నుంచి వలస వచ్చిన ఆరు మతాలకు (హిందూ, సిక్కు, జైన్, పార్సీ, క్రైస్తవులు) చెందిన భారత పౌరసత్వం కల్పించాలన్ని ప్రభుత్వ లక్ష్యం. దాని నుంచి ముస్లింలను మినహాయించారు. పై మూడు దేశాలు ముస్లిం దేశాలు కాబట్టి మినహాయించారు. ఇందుకోసం 1956 నాటి భారతీయ పౌరసత్వ చట్టానికి ఇటీవల సర్కార్ సవరణలను చేసింది. దీనిని పార్లమెంటు ఆమోదించింది. మొదట్లో టీడీపీ, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, జేడీయు వంటి పార్టీలు మద్దతిచ్చాయి. ఇప్పుడు స్వరం మార్చాయి.

కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే….

సీఏఏ చట్టాన్ని అమలు చేయబోమని కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ అసెంబ్లీలు తీర్మానించాయి. మిగిలిన బీజేపీయేతర రాష్ట్రాలు కూడా ఈ దిశగా వెళ్లనున్నాయి. బీజేపీ సంకీర్ణ సర్కారుగల బీహార్ కూడా సీఏఏను వ్యతిరేకిస్తుంది. బీజేపీ అనుకూల తమిళనాడు, ఒడిశా వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. ఈ చట్టం ద్వారా ముస్లిమేతర ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవచ్చన్నది బీజేపీ అంచనా. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనలను చూస్తుంటే ఈ విషయంలో మోదీ, అమిత్ షా మంత్రాంగం విఫలమయినట్లే కనపడుతుంది. వారు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ, ఎంత భరోసా కల్పించినప్పటికీ ప్రజలు విశ్వసించలేక పోతున్నారు. ముఖ్యంగా క్రైస్తవులు అధికంగా గల ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, యూపీ, కేరళ, తెలంగాణ వంటి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమ అవకాశాలను ఈ నిర్ణయం దెబ్బ తీస్తుందన్న భయం పార్టీలో లేకపోలేదు. మరో వివాదాస్పద చట్టం ఎన్సార్సీ. ఈ చట్టం కిందకు అసోంలో నిర్వహించిన అక్రమ వలసదారుల గుర్తింపు కొత్త ఇబ్బందులను కొనితెచ్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. రాష్ట్రంలో 19 లక్షల మేరకు బంగ్లాదేశ్ అక్రమవలసదారులను గుర్తించారు. వీరిలో హిందువులు ఎక్కువగా ఉండటంతో బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అక్రమ వలసదారుల్లో ఎక్కువ మంది ముస్లింలే ఉంటారని అంచనా వేసిన బీజేపీకి చివరకు భంగపాటు ఎదురయింది. దీంతో అక్రమ వలసదారులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు చట్టపరమైన అన్ని అవకాశాలు కల్పిస్తామని చెబుతోంది. తాజాగా తీసుకువచ్చిన జాతీయ జనాభా పట్టిక కూడా వివాదాస్పదమయింది. 2014లో కేసీఆర్ తలపెట్టిన సమగ్ర సర్వే రీతిలో ఎన్పీఆర్ వివాదాస్పదమయింది. మొత్తానికి సీఏఏ, ఎన్సార్సీ, ఎన్పీఆర్ర విషయంలో తమ అంచనాలు తప్పడంతో మోదీ, అమిత్ షాలు బిక్క మొహం వేశారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News