టీడీపీ ఓటమికి కారణం తెలియదుట

తప్పు ఎక్కడ ఉందో తెలిస్తే ఒప్పు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అసలు తప్పే జరగలేదని భావిస్తే ఇక సరిచేసుకునేందుకు దారేది. తెలుగుదేశం పార్టీలో ఇపుడు జరుగుతున్నది ఇదే. [more]

Update: 2019-06-15 14:30 GMT

తప్పు ఎక్కడ ఉందో తెలిస్తే ఒప్పు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అసలు తప్పే జరగలేదని భావిస్తే ఇక సరిచేసుకునేందుకు దారేది. తెలుగుదేశం పార్టీలో ఇపుడు జరుగుతున్నది ఇదే. గత ఎన్నికల్లో పరాజయానికి కారణాలు తెలుసట. తాజా ఓటమికి మాత్రం కారణమే లేదట. తెలుగుదేశం వల్లభుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా తాపీగా చెబుతున్న మాట ఇది. పోలింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఫలితాలు వచ్చేంతవరకూ మన‌నే గెలుస్తున్నామని లీడర్లను, క్యాడర్ని మభ్యపెట్టిన చంద్రబాబు ఇపుడైనా వాస్తవాలు చెబితే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా పార్టీలో, సర్కార్ లో ఎక్కడా పొరపాటు జరగలేదనే అధినాయకుడు మాట్లాడుతున్నారు. దాంతో మిగిలిన వారు కూడా ధైర్యం చేసి ఇదీ తప్పు అని చెప్పలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో వరసపెట్టి ఎన్ని సమీక్షలు పెట్టినా ప్రయోజనం ఉంటుందా.

అసలు భయం అదేనా:

నేను తప్పు చేశాను అని నిర్భయంగా నాయకుడు ఒప్పుకుంటే ఆ నిజాయతీ నిలువెత్తు పెట్టుబడిగా కార్యకర్తలు ఉరకలు వేస్తారు. టీడీపీలో మాత్రం సీన్ రివర్స్. తప్పు ఏం చేశాం మేము అంటున్నారు చంద్రబాబు. పీకల్లోతు అప్పుల్లో ఏపీని దించేయడం తప్పు కాదు, ఒకే సామాజికవర్గానికి పెద్ద పీట వేయడం, ప్రతిపక్షం గొంతు నొక్కడం, అసెంబ్లీని సొంత పార్టీ ఆఫీస్ మాదిరిగా నడపడం, ప్రభుత్వ పధకాలు అస్మదీయులకే పంచడం, జన్మ భూమి కమిటీల లూటీలు, ఇసుక మాఫియా, నీటి పారుదల ప్రాజెక్టులలో అవినీతి ఇవన్నీ కూడా టీడీపీకి మైనస్ అయ్యాయని మీడియా ఘోషిస్తున్నా దాని మీద చర్చించేందుకు అధినాయకత్వం ముందుకు రావడం లేదు. అంతా బాగుంది, జనమే తప్పు చేశారు తప్ప మమం ఓడిపోలేదు అంటూ కల్లబొల్లి కబుర్లు చెబితే పార్టీకి మంచి రోజులు వస్తాయా. ఈ ప్రశ్న నిబద్ధత కలిగిన నాయకుల్లో ఉంది. కానీ పెద్ద నాయకులు మాత్రం వేరేలా మాట్లాడితే ఇక టీడీపీకి భవిష్యత్తు ఎలా ఆశిస్తారు.

అయితే ఇక్కడ చంద్రబాబు రాజకీయ చాణక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలానా కారణం వల్ల ఓడామని చెబితే అందరు కాకపోయినా కొందరైనా నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. అసలే తమ్ముళ్ళు పక్క చూపులు చూస్తున్నారన్న సమాచారం ఉంది. ఈ తలనొప్పి ఎందుకనే నిజాలు తెలిసినా దాస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాస్త పుంజుకుంటే మళ్ళీ పార్టీని ట్రాక్ లోకి పెట్టుకోవచ్చు అన్న ముందస్తు ఆలోచనతోనే మనం ఓడిపోలేదని జోల పాట పాడుతున్నారనుకోవాలి.

నాలుగు సార్లు ఓటమి:

అధినేత చంద్రబాబు నాలుగు సార్లు ఓడిపోయామని, అయిదు సార్లు గెలిచామని లెక్కలు వల్లిస్తున్నారు. గెలిచిన అయిదుసార్లలో మూడు సార్లు అన్న నందమూరి జమానాలో దక్కిన విజయాలు, అవి అలాంటి ఇలాంటి విజయాలు కావు. లాండ్ స్లైడ్ విక్టరీలవి. చంద్రబాబు 1999లో ఒకసారి, 2014లో మరోసారి పార్టీని గెలిపించారు. అదీ వాజ్ పేయి, మోడీ దయ వల్ల. ఇవి నిష్టుర సత్యాలు. ఈ రెండు సార్లు కూడా పార్టీకు అద్భుత విజయాలు నమోదు కాలేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే అన్న గారి తరువాత చంద్రబాబు ఇన్నాళ్ళూ టీడీపీ బండి లాక్కొచ్చారు. అపుడు వయసులో ఉన్నారు. ఇపుడు డెబ్బై పడిలో పడ్డ బాబు ఓ వైపు ఉంటే నాయకత్వ లేమితో టీడీపీ సతమవుతోంది. ఇది కదా అసలు కారణం. అయినా మేము గెలిచేస్తామని అధినాయకుడు చెబుతూంటేనే దిక్కులు చూస్తున్న తమ్ముళ్ళకు మరింత బెంగ పుడుతోంది మరి.

Tags:    

Similar News