రెండు ఫ్యామిలీల పరువు తీశారే…!!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి… కీలక శాఖలకు మంత్రి… భావి ముఖ్యమంత్రిగా టీడీపీ శ్రేణులు భావించిన నారా లోకేష్ కు మొదటి ఎన్నికల్లోనే ఘోర పరాభవం [more]

Update: 2019-05-25 02:30 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి… కీలక శాఖలకు మంత్రి… భావి ముఖ్యమంత్రిగా టీడీపీ శ్రేణులు భావించిన నారా లోకేష్ కు మొదటి ఎన్నికల్లోనే ఘోర పరాభవం ఎరుదైంది. రాష్ట్రవ్యాప్తంగా వీచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో నారా లోకేష్ ఓటమి పాలవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రమంతా దారుణంగా ఓడిపోవడానికి తోడు తమ భావి నాయకుడు లోకేష్ ఓటమితో వారి బాధ రెట్టింపైంది. ఏరికోరి మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకుని పోటీ చేసిన లోకేష్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చిత్తు చేయడంతో లోకేష్ రాజకీయ భవిష్యత్ కు గట్టి దెబ్బ తగిలింది.

అతివిశ్వాసానికి వెళ్లిన లోకేష్

మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టున్నా ఎక్కువగా ఈ సీటును ఆ పార్టీ పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు కేటాయిస్తూ వస్తోంది. దీంతో 1985 తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేరు. మొదట నారా లోకేష్ పోటీ చేయాలనుకున్నప్పుడు ఆయనకు సేఫ్ సీట్లుగా భీమిలి, విశాఖపట్నం నార్త్, పెదకూరపాడు వంటి నియోజకవర్గాలను పరిశీలించారు. అయితే, 30 ఏళ్లుగా టీడీపీ జెండా ఎగరని మంగళగిరిలో పోటీ చేసి పసుపు జెండా ఎగరేస్తానని ధీమాతో లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. రాజధాని ప్రాంతంలోని నియోజకవర్గం కావడం కూడా ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం. అంతకుముందు వైసీపీ ఇక్కడ ఆర్కేను కాకుండా ఇతరులకు టిక్కెట్ ఇవ్వాలని భావించింది. అయితే, లోకేష్ పోటీ చేస్తారని తెలిశాక ఆర్కే అయితేనే బలమైన పోటీ ఇస్తారనే అంచనాతో ఆయననే మళ్లీ దింపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టీ మంగళగిరి నియోజకవర్గంపై పడింది.

ఆర్కేకు కలిసివచ్చిన ఈక్వేషన్స్

రెండు పార్టీలకూ ప్రతిష్టాత్మక నియోజకవర్గం కావడంతో ఇక్కడ డబ్బు ప్రవాహం కూడా ఎక్కువగా జరిగింది. అయితే, ఎన్నికల వేళ డబ్బు ఇచ్చిన వారి కంటే తమకు ముందునుంచీ అండగా ఉంటున్న ఆర్కే వైపే ప్రజలు మొగ్గు చూపారు. ఆర్కే రూ.4కే భోజనం పెట్టడం, రూ.10కే వారానికి సరిపడా కూరగాయలు ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ప్రజలకు ఆయన నిత్యం అందుబాటులో ఉంటారు. ఇక, మంగళగిరిలో బీసీలు, ముఖ్యంగా చేనేత సామాజకవర్గం ప్రజలు ఎక్కువ. ఈ టిక్కెట్ ను ఆ సామాజకవర్గం వారికే ఇస్తామని చంద్రబాబు గతంలో మాట ఇచ్చి తర్వాత లోకేష్ ను బరిలో దించడం కూడా మైనస్ అయ్యింది. ఎన్నికల వేళ టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. ఈ ఒక్కసారే తాను పోటీ చేస్తానని, వచ్చే ఎన్నికల్లో చేనేత వర్గానికి ఈ టిక్కెట్ వదిలేస్తానని ఆర్కే చెప్పారు. ఇవన్నీ ఆర్కేకు బాగా కలిసివచ్చి ఆయన సుమారు 5 వేల మెజారిటీతో విజయం సాధించారు. లోకేష్ ఓటమికి అతివిశ్వాసమే కారణమని.. మంగళగిరి కాకుండా మరేదైనా సేఫ్ సీట్ ఎంచుకుంటే బాగుండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. నారా లోకేష్ ఇటు నందమూరి ఫ్యామిలీ, అటు నారా ఫ్యామిలీ పరువు తీశారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News