రాయ‌పాటి అమీతుమీ..రీజ‌నేంటి..?

టీడీపీ అధినేత చంద్రబాబుతో అమీతుమీకి మాజీ ఎంపీ..సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సిద్ధమ‌య్యారా ? త‌న వార‌సుడి విష‌యంలో ఏదో ఒక‌టి తేల్చుకునేందుకు ఆయ‌న [more]

Update: 2020-11-03 03:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుతో అమీతుమీకి మాజీ ఎంపీ..సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సిద్ధమ‌య్యారా ? త‌న వార‌సుడి విష‌యంలో ఏదో ఒక‌టి తేల్చుకునేందుకు ఆయ‌న దూకుడుగా ముందుకు సాగుతున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌న కుమారుడు రాయ‌పాటి రంగారావు విష‌యంలో సాంబ‌శివ‌రావు గ‌త కొన్నేళ్లుగా మ‌ద‌‌న‌ప‌డుతున్నారు. తాను రాజ‌కీయంగా సీనియ‌ర్ అయి ఉండి కూడా కుమారుడికి స‌రైన వేదిక క‌ల్పించ‌లేక పోతున్నాన‌నే ఆందోళ‌న రాయ‌పాటి సాంబ‌శివ‌రావులో క‌నిపిస్తోంది.

కుమారుడి కోసం…..

గ‌తంలో కాంగ్రెస్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఒక‌సారి రాజ్యస‌భ‌కు కూడా ఎంపిక య్యారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్‌తో విభేదించి.. టీడీపీ సైకిల్ ఎక్కారు. ఈ క్రమంలోనే 2014లో న‌ర‌సారావు పేట నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక‌, వ‌యోవృద్ధుడు కావ‌డంతో వ్యవ‌హార‌మంతా త‌న కుమారుడు రంగారావుకే అప్పగించారు. ఈ క్రమంలోనే స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం త‌న కుమారుడికి ఇప్పించుకునేందుకు అప్పట్లోనే ప్రయ‌త్నించారు. దీంతో అప్పటి స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే, దివంగ‌త కోడెల శివ‌ప్రసాద‌రావుతోనూ విభేదాలు వ‌చ్చాయి.

సస్పెన్స్ కొనసాగిస్తుండటంతో…..

అయిన‌ప్పటికీ ముందుకు సాగారు. అయితే, ఈ విష‌యంలో చంద్రబాబు ఎటూ తేల్చలేదు. స‌త్తెన‌ప‌ల్లిలో కోడెల వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డంతో ఎప్పటికైనా దీనిని ఆయ‌న కుమారుడు శివ‌రామ‌కృష్ణకు ఇవ్వాల‌నేది బాబు వ్యూహంగా ఉంది. కోడెల కుటుంబాన్ని ఇప్పటికిప్పుడే ప‌క్కన పెట్టేస్తే జిల్లాలో బ‌లంగా ఉన్న ఆయ‌న వ‌ర్గం పార్టీకి దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌న్న విష‌యం గ్రహించిన చంద్రబాబు స‌త్తెన‌ప‌ల్లి సీటు విష‌యంలో స‌స్పెన్స్ కొన‌సాగిస్తున్నారు.

పెదకూరపాడు కోసం…..

దీంతో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఇప్పుడు పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఇక్కడ టీడీపీకి కీల‌కంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌.. గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టడం, అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవ‌డంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న కుమారుడు రంగారావుకు ఇప్పించు కునేందుకు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ప్రయ‌త్నిస్తున్నార‌ట‌. వాస్తవానికి కొమ్మాల‌పాటి గ‌త ఎన్నిక‌ల‌కు ముందే గుంటూరు ప‌శ్చిమ‌కు మారాల‌ని అనుకున్నారు. అయితే కొమ్మాల‌పాటి పెద‌కూర‌పాడులో వ‌రుస‌గా రెండుసార్లు గెల‌వ‌డంతో చివ‌ర‌కు ఆయ‌న్నే అక్కడ కంటిన్యూ చేశారు.

బలమైన వర్గం ఉండటంతో….

పెద‌కూర‌పాడు రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకి సొంత ఊరు కావ‌డం, ఇక్కడే వారి సొంత ఊరు ఉంగుటూరు కూడా ఉండ‌డం, పూర్తిగా ఇది గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం వంటి ప‌రిణామాలు క‌లిసి వ‌స్తున్నాయ‌ని రాయ‌పాటి ఫ్యామిలీ లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతోఎలాగూ.. కొమ్మాల‌పాటి నియోజ‌క‌వ‌ర్గం మారుతున్నారు క‌నుక‌, వైసీపీ స‌హా అన్న పార్టీలూ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నందున ఈ సీటు త‌మ‌కు ఇవ్వాల‌నేది రాయ‌పాటి డిమాండ్‌గా ఉంద‌ని స‌మాచారం. పైగా రాయ‌పాటి కుటుంబానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్దాలుగా బ‌ల‌మైన వ‌ర్గం ఉంది.

ఏమాత్రం తగ్గకూడదని…..

గ‌తంలో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు గుంటూరు ఎంపీగా ఉన్నప్పుడు పెద‌కూర‌పాడు గుంటూరు లోక్‌స‌భ‌లోనే ఉండేది. ఆ త‌ర్వాత ఆయ‌న న‌ర‌సారావుపేట‌కు మారిన‌ప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌సారావుపేట లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలోకి మార‌డంతో రాయ‌పాటి త‌న వ‌ర్గాన్ని మెయింటైన్ చేసుకుంటూ వ‌స్తున్నారు. స‌త్తెన‌ప‌ల్లి సీటు విష‌యంలో చంద్రబాబు ఎటూ తేల్చక‌పోవ‌డంతో ఇప్పుడు పెద‌కూర‌పాడు సీటు విష‌యంలో మాత్రం రాయ‌పాటి వెన‌క్కు త‌గ్గేందుకు ఇష్టప‌డ‌డం లేద‌ట‌. ఈ సీటు రంగారావుకు కేటాయించేలా చంద్రబాబు ఒప్పుకొని తీరాల‌నేలా ఆయ‌న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. మ‌రి బాబు నిర్ణయం ఎలా ఉంటుందో ? చూడాలి.

Tags:    

Similar News