రాయ‌పాటి ఊగిస‌లాట‌… ఈ కొత్త ప్రచారం క‌థేంటో?

రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సీనియ‌ర్ పార్లమెంటేరియ‌న్‌… ఐదు ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితంలో కాంగ్రెస్‌లో ఉన్నా.. టీడీపీలో ఉన్నా కూడా ఆయ‌న మాట నెగ్గించుకునేవారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్ లాంటి [more]

Update: 2020-10-08 00:30 GMT

రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సీనియ‌ర్ పార్లమెంటేరియ‌న్‌… ఐదు ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితంలో కాంగ్రెస్‌లో ఉన్నా.. టీడీపీలో ఉన్నా కూడా ఆయ‌న మాట నెగ్గించుకునేవారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్ లాంటి బ‌ల‌మైన నేత‌లే ఆయ‌న‌కు సీటు ఇవ్వకూడ‌ద‌ని ప‌ట్టుబ‌ట్టినా సోనియాగాంధీ ద‌గ్గర లాబీయింగ్ చేసుకుని మ‌రీ సీటు తెచ్చుకుని రాయ‌పాటి సాంబ‌శివ‌రావు గెలిచారు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నిర్వీర్యం అవుతుంద‌న్న విష‌యం ముందే గ్రహించి టీడీపీలోకి జంప్ చేసేశారు. పార్టీ మారినా… త‌న గుంటూరు సీటు వ‌దిలి న‌ర‌సారావుపేట నుంచి పోటీ చేసినారాయ‌పాటి సాంబ‌శివ‌రావు గెలుపున‌కు తిరుగులేకుండా పోయింది.

దశాబ్దాల పాటు….

ద‌శాబ్దాల పాటు గుంటూరు జిల్లాలో తిరుగులేని రాజ‌కీయం చేసిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కెరీర్ ప‌రంగా ప్రస్తుతం చ‌ర‌మాంక ద‌శ‌లో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో న‌ర‌సారావుపేట నుంచి పోటీ చేసి ఓడిన ఆయ‌న‌కు ఆ ఎన్నిక‌లే చివ‌రి ఎన్నిక‌లు కానున్నాయి. అయితే రాయ‌పాటికి మాత్రం త‌న వార‌సుడు / త‌న కుటుంబం మాత్రం రాజ‌కీయంగా మ‌రి కొన్నేళ్ల పాటు వెలుగు వెల‌గాల‌న్న బ‌ల‌మైన ఆకాంక్ష అయితే ఉంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే వార‌సుడికి స‌త్తెన‌పల్లి అసెంబ్లీ సీటు కావాల‌ని బాబుపై ఒత్తిడి తెచ్చారు. అయితే కోడెల న‌ర‌సారావుపేట‌కు వెళ్లేందుకు ఇష్టప‌డ‌క‌పోవ‌డంతో పాటు స‌త్తెన‌ప‌ల్లిలోనే పోటీ చేస్తాన‌ని చెప్పడంతో పాటు త‌న సీటుపై క‌న్నేసిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావుపై చిర్రుబుర్రులాడారు.

తాను కోరిన సీటును…..

గ‌తాన్ని వ‌దిలేస్తే ప్రస్తుతం చంద్రబాబు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుటుంబాన్ని ఎంత మాత్రం ప‌ట్టించుకున్న ప‌రిస్థితి లేదు. అటు రాష్ట్ర వ్యాప్తంగాను, ఇటు గుంటూరు జిల్లాలో నేత‌లు లేని నియోజ‌క‌వ‌ర్గాలకు ప‌లువురు ఇన్చార్జ్‌ల‌ను నియ‌మిస్తున్నా రాయ‌పాటి ఫ్యామిలీ ( వార‌సుడు రంగారావు)ను మాత్రం ప‌ట్టించుకున్న ప‌రిస్థితి లేదు. గుంటూరులోనే బాపట్లలో వేగేశ‌న న‌రేంద్రవ‌ర్మ, ప్రత్తిపాడు మాకినేని పెద‌ర‌త్తయ్య, మాచ‌ర్లలో చ‌ల‌మారెడ్డికి ప‌గ్గాలు ఇచ్చిన చంద్రబాబు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కోరుతున్న స‌త్తెన‌ప‌ల్లి సీటు విష‌యం మాత్రం ప‌క్కన పెట్టేస్తున్నారు. విచిత్రం ఏంటంటే రాయ‌పాటి కుటుంబానికి మంచి ప‌ట్టున్న గుంటూరు న‌గ‌రంలోని గుంటూరు వెస్ట్ సీటు ఖాళీ అయినా ( ఇక్కడ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి పార్టీకి దూర‌మ‌య్యారు) ఈ సీటును క‌మ్మ వ‌ర్గానికే చెందిన కోవెల‌మూడి ర‌వీంద్రకు ఇచ్చారు.

పదిహేను నెలలవుతున్నా….

జిల్లాలో ఎన్నో స‌ర్దుబాట్లు చేస్తోన్న బాబు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఫ్యామిలీ కోరుతోన్న స‌త్తెన‌ప‌ల్లి సీటు పగ్గాలు మాత్రం వాళ్లకు ఇవ్వడం లేదు. స్థానికంగా స‌త్తెన‌ప‌ల్లి శ్రేణులు కూడా రాయ‌పాటి వార‌సుడు రంగారావును క‌ల‌వ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు స్వీక‌రించాల‌ని కోరుతున్నా బాబు మాత్రం వీరిని క‌రుణించ‌డం లేదు. ఎన్నిక‌లు ముగిసి యేడాదిన్నర అవుతున్నా త‌మ‌ను బాబు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఫ్యామిలీలో అస‌హ‌నం కట్టలు తెంచుకుంద‌న్న టాక్ గుంటూరు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

వైసీపీ నుంచి ఆఫ‌ర్లంటూ….

ఈ నేప‌థ్యంలోనే గుంటూరు రాజ‌కీయాల్లో ఓ స‌రికొత్త ప్రచారం కూడా స్టార్ట్ అయ్యింది. రాయ‌పాటి ఫ్యామిలీకి బీజేపీతో పాటు వైఎస్సార్‌సీపీ నుంచి ఆఫ‌ర్లు వెళుతున్నాయ‌ట‌. కొద్ది రోజుల క్రిత‌మే రామ్‌మాధ‌వ్ స్వయంగా రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఇంటికి వెళ్లడంతో ఆయ‌న్ను బీజేపీలోకి ఆహ్వానించార‌న్న వార్తలు వ‌చ్చాయి. ఇప్పుడు కూడా రాయ‌పాటి ఫ్యామిలీ కండువా మార్చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి సీటు రాయ‌పాటి వార‌సుడికే ఇస్తామ‌ని వైఎస్సార్‌సీపీ ఆఫ‌ర్ ఇచ్చింద‌న్న టాక్ అయితే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది నిజ‌మా ? కాదా ? అన్నది ప‌క్క‌న పెడితే దీనిపై రాయ‌పాటి ఫ్యామిలీ మాత్రం ఎక్కడా నోరు మెద‌ప‌డం లేదు. అయితే బాబుపై మాత్రం ఆ ఫ్యామిలీ తీవ్ర అస‌హ‌నంతోనే ఉంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News