వైసీపీలో పంచ పాండవులు.. టీడీపీలో పంచ పాండవులు

కడప జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ? ఏ పార్టీ రాయచోటి కోటపై జెండా ఎగరవేస్తుంది ? రాయచోటి రారాజుగా [more]

Update: 2019-02-11 13:30 GMT

కడప జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ? ఏ పార్టీ రాయచోటి కోటపై జెండా ఎగరవేస్తుంది ? రాయచోటి రారాజుగా ఎవరు నిలుస్తారో ? అన్న చర్చలు జోరుగా ప్రారంభం అయ్యాయి. రాయచోటి నుంచి రెండు ప్రధాన పార్టీల తరపున టిక్కెట్‌ రేసులో ఏకంగా ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు. దీంతో అటు టీడీపీ సీటు కోసం పంచ పాండవులు ఇటు వైసీపీ సీటు కోసం పంచ పాండవులు పోటీ పడుతున్నారన్న సెటైర్లు నియోజకవర్గంలో జోరుగా ట్రెండ్‌ అవుతున్నాయి. టీడీపీ టిక్కెట్‌ రేసులో మాజీ ఎమ్మెల్యే, రాయచోటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రమేష్‌ కుమార్‌ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఈయనతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి ప్రసాద్‌బాబు టీడీపీ టిక్కెట్‌ బలిజ సామాజికవర్గం కోటాలో తనకు కేటాయించాలని అధినేతను కోరారు.

రాయచోటి నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గంతో పాటు మైనార్టి ఓటర్లు కీలకం. అయితే ఇక్కడ నుంచి రెడ్డి సామాజికవర్గంవారు గత ఎన్నికల్లో వరసగా విజయాలు సాధిస్తున్నారు. ఓటర్ల పరంగా చూస్తే మైనార్టీలు, బలిజలు అభ్యర్థుల గెలుపు ఓటముల్లో నిర్ణయాత్మకమైన శక్తిగా ఉన్నారు. ఇక వైసీపీలో తనకు న్యాయం జరగలేదని గతంలో పలు మార్లు టిక్కెట్‌ ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదన్న కారణంతో వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి బావమరిది మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకా నాధరెడ్డి సైతం ఇటీవల చంద్రబాబును కలిసి పార్టీలో చేరేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఆయన పార్టీలో చేరితే తనకు రాయచోటి నుంచి టీడీపీ టిక్కెట్‌ కావాలన్న కండీషన్‌ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక రాయచోటి నుంచి వరసగా మూడు సార్లు గెలిచి (ఒక సారి కాంగ్రెస్‌, రెండు సార్లు వైసీపీ) సిట్టింగ్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తనకే టిక్కెట్‌ వస్తుందన్న ఆశతో ఆయన ఇప్పటికే గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

మరో వైపు మాజీ ఎమ్మెల్యే కుమారుడు అయిన మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి కూడా తనకే ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. తన కుటుంబ నేపథ్యంతో తాను ఖ‌చ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్న తనకు రాయచోటి టిక్కెట్‌ ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్‌ను అడిగినట్టు తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. వైసీపీ అధినేత జగన్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంటే నడుస్తున్నా ఇటీవల వారిద్దరి మధ్య‌ గ్యాప్‌ వచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో వైసీపీ, జగన్‌ తరపున బలమైన వాయిస్‌ వినిపిస్తు మీడియాలో ముందున్న ఆయన ఇటీవల క్రమక్రమంగా పార్టీలో వెనక్కి వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలన్నీ జగనకు ఆయన మధ్య‌ గ్యాప్‌ ఉందన్న ప్రచారానికి ఊతమిని ఇచ్చేలా ఉన్నాయి. అదే టైమ్‌లో ఒకానొక దశలో జగన్‌ శ్రీకాంత్‌ రెడ్డికి సీటు ఇవ్వరన్న బలమైన వాద‌న కూడా రాయచోటిలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్‌ రెడ్డి వైసీపీ టిక్కెట్‌ రేసులో ముందున్నా ఆయనకు బీఫామ్‌ వచ్చేంత వరకు కాస్త టెన్షన్‌ అయితే ఉంది. 2008లో జరిగిన నియోజకవర్గాల పున‌ర్విభజనలో భాగంగా లెక్కిరెడ్డిపల్లి నియోజకవర్గాన్ని రద్దు చేసి రాయచోటిలో కలపడంతో అప్పటి వరకు లెక్కిరెడ్డిపల్లి నియోజకవర్గంలో పోటీ పడుతూ వచ్చిన గడికోట, రెడ్డెప్పగారి మాజీ మంత్రి రాజగోపాల్‌ రెడ్డి కుటుంబాలు ఇక్కడ పోటీ పడుతూ వస్తున్నాయి.

ఇక శ్రీకాంత్‌ రెడ్డి వరుసగా మూడు సార్లు గెలిచినా రాయచోటి పట్టణంతో పాటు నియోజకవర్గంలో అనేక సమస్యలు తిష్ఠ వేశాయి. రాయచోటిలో ఇప్పటికి తీవ్రమైన నిటి ఎద్దడి నెలకొంది. 2009లో ఆయన గెలిచిన రెండేళ్లకే వైసీపీలోకి జంప్‌ చెయ్యడంతో అప్పటి నుంచి దాదాపు ఎనిమిది ఏళ్ల పాటు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు. దీంతో ఆప్పుడు ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండడంతో అనుకున్న మేర నిధులు సాధించలేకపోయారు. దీంతో రాయచోటి అభివృద్ధి పరంగా వెనకబడిపోయిందన్న విమర్శ ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తిరిగి శ్రీకాంత్‌ రెడ్డినే నాలుగో సారి గెలిపిస్తారా లేదా మార్పు కోరుకుంటారా ? అన్నది చూడాల్సి ఉంది. 2లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో 50 వేల వరకు ఉన్న మైనార్టీ ఓటర్లు నిర్ణయాత్మకశక్తిగా ఉన్నారు. అదే టైమ్‌లో బలిజ సామాజికవర్గ ఓట్లు సైతం ఇక్కడ కీలకం కానున్నాయి.

Tags:    

Similar News