టీడీపీ నేత‌.. రావి కోరిక సాకార‌మ‌య్యేనా…?

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కృష్ణాజిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గ మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌టేశ్వర‌రావు.. చిర‌కాల కోరిక నెర‌వేరేనా ? ఆయ‌న క‌లగంటున్న అసెంబ్లీలోకి అడుగుపెట్టాల‌నే కోరిక ఇప్పట్లో [more]

Update: 2020-09-07 05:00 GMT

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కృష్ణాజిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గ మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌టేశ్వర‌రావు.. చిర‌కాల కోరిక నెర‌వేరేనా ? ఆయ‌న క‌లగంటున్న అసెంబ్లీలోకి అడుగుపెట్టాల‌నే కోరిక ఇప్పట్లో సాకారం అవుతుందా ? ఇప్పుడు గుడివాడ టీడీపీలో ఈ విష‌యంపైనే జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. రావి ఫ్యామిలీకి రాజ‌కీయంగా చాలా హిస్టరీ ఉంది. గుడివాడ‌లో ఈ కుటుంబానికి మంచి పేరు కూడా ఉంది. వెంక‌టేశ్వర‌రావు తండ్రి రావి శోభ‌నాద్రి చౌద‌రి రెండు సార్లు గెలిచారు. ఆయ‌న వేసిన పునాదులపై ఆయ‌న కుమారుడు రావి హ‌ర‌గోపాల్ అంటే.. వెంక‌టేశ్వర‌రావు అన్న కూడా విజ‌యం సాధించారు.

నాని ఎగరేసుకు పోవడంతో…

నియోజ‌క‌వ‌ర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేప‌ట్టి.. త‌మ‌కంటే.. ప్రత్యేక‌త‌ను చాటుకున్నారు. ఈ క్రమంలోనే రావి వెంక‌టేశ్వర‌రావు కుటుంబానికి ప్రత్యేక మ‌ద్దతు కూడా ఇక్కడ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో అన్న హ‌ర‌గోపాల్ హ‌ఠాన్మర‌ణంతో రావి వెంక‌టేశ్వర‌రావు.. రాజకీయాల్లోకి వ‌చ్చారు. 2000 సంవ‌త్సరంలో వ‌చ్చిన ఉప పోరులో విజ‌యం సాధించారు. గుడివాడ నుంచి తండ్రి, ఇద్దరు కొడుకులు టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యే అయిన చ‌రిత్ర ఈ కుటుంబానికే ద‌క్కింది. ఇక‌, 2004 సార్వత్రిక ఎన్నిక‌ల్లోనూ త‌న‌కేటికెట్ ఇస్తార‌ని ఆయ‌న భావించారు. అయితే, జూనియ‌ర్ ఎన్టీఆర్ జోక్యం, ఒత్తిడి కార‌ణంగా ఈ టికెట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు కొడాలి నానికి కేటాయించారు.

దేవినేని అడ్డుతగలడంతో….

దీంతో తొలిసారి రావి వెంక‌టేశ్వర‌రావుకు ప‌రాభ‌వం ఎదురైంది. అక్కడ నుంచి నాని గుడివాడ రాజ‌కీయాల్లో పాతుకుపోయాడు. ఈ నేప‌థ్యంలోనే 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్లిన రావి వెంక‌టేశ్వర‌రావు గుడివాడ నుంచి పోటీ చేసి ఓట‌మి చెందారు. ఇక‌, 2014లో కొడాలి వైసీపీలోకి వెళ్లడంతో రావి వెంక‌టేశ్వర‌రావు మ‌ళ్లీ సైకిల్ ఎక్కారు.. అయితే, ఓడిపోయారు. ఇక‌, గ‌త ఏడాది ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ.. మారిన స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో చంద్రబాబు విజ‌య‌వాడ‌కు చెందిన దేవినేని అవినాష్‌కు ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఫ‌లితంగా రావి వెంక‌టేశ్వర‌రావు ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి.

చొచ్చుకు వెళ్లలేకపోతుండటం….

2014 ఎన్నిక‌ల్లో ఓడినా పార్టీ కోసం ఐదేళ్ల పాటు క‌ష్టప‌డినా బాబు చివ‌ర్లో విజ‌య‌వాడ నుంచి అవినాష్‌ను తీసుకువ‌చ్చి ఇక్కడ పోటీ చేయించారు. అవినాష్ ఎన్నిక‌ల్లో ఓడిన వెంట‌నే వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోవ‌డంతో మ‌ళ్లీ బాబు తిరిగి గుడివాడ టీడీపీ ప‌గ్గాలు రావి వెంక‌టేశ్వర‌రావుకే అప్పగించారు. పార్టీ కోసం ఆయ‌న త‌న వంతుగా క‌ష్టప‌డుతున్నా ప‌రిస్థితి ఏ మాత్రం స్థానికంగా లేదు. మంత్రి కొడాలి దూకుడుతో నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అన్న మాటే వినిపించ‌డం లేదు. నాని దూకుడుతో టీడీపీలో కొంద‌రు ద్వితీయ శ్రేణి నేత‌లు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. ఇక ఉన్నవాళ్లు స్తబ్దుగా ఉంటున్నారు. రావి వెంక‌టేశ్వర‌రావు నానిలా ప్రజ‌ల్లోకి చొచ్చుకుపోలేక‌పోవ‌డంతో పాటు ఆర్థిక విష‌యాల్లో మ‌రీ లోభిగా వ్యవ‌హ‌రిస్తార‌న్న అప‌వాదే ఆయ‌న‌కు ఎప్పుడూ మైన‌స్ అవుతంది. ఈ క్రమంలోనే రెండోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాల‌న్న రావి ఆశ‌లు నెర‌వేర‌తాయా ? అన్నది పెద్ద సందేహంగానే క‌నిపిస్తోంది.

Tags:    

Similar News