పరిటాలకు పరేషాన్ ఎందుకు..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హాట్ సీట్లలో ఒకటిగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గాన్ని రెండు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పరిటాల రవీంద్ర వారసుడిగా మొదటిసారి [more]

Update: 2019-05-03 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హాట్ సీట్లలో ఒకటిగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గాన్ని రెండు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పరిటాల రవీంద్ర వారసుడిగా మొదటిసారి ఈ ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేశారు. మంత్రి పరిటాల సునీత తన కుమారుడి కోసం తన సీటును త్యాగం చేసి మరీ కుమారుడికి సీటు ఇప్పించుకున్నారు. మొదటి ఎన్నికల్లో కచ్చితంగా కుమారుడిని గెలిపించుకొని ఆయన రాజకీయ జీవితానికి గట్టి పునాధి వేయాలని పరిటాల సునీత పనిచేశారు. మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మరోసారి పోటీ చేశారు. ఆయన గత రెండు ఎన్నికల్లో పరిటాల సునీతపై 7 వేలు, 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి కచ్చితంగా విజయం సాధించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. దీంతో రాప్తాడులో హోరాహోరీ పోరు జరిగింది.

హోరాహోరీగా సాగిన ఎన్నికలు

ఫ్యాక్షన్ ప్రభావం ఎక్కువగా ఉండే రాప్తాడు నియోజకవర్గం 2009లో ఏర్పడగా రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రెడ్డిపై పరిటాల సునీత విజయం సాధించారు. ఈసారి రెండు పార్టీల అభ్యర్థులు, నాయకులు రాప్తాడులో తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శించారు. ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగాయి. ఎన్నికలకు ముందునుంచే అనేక బెదిరింపులు, గొడవలు జరిగాయి. ప్రకాశ్ రెడ్డి స్వగ్రామానికి వచ్చిన పరిటాల సునీతను ప్రకాశ్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ప్రకాశ్ రెడ్డి వర్గీయులపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. పరిటాల శ్రీరామ్ కు ఓట్లేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ నేతలు బహిరంగంగానే ప్రజలను హెచ్చరించిన సంఘటనలూ ఉన్నాయి. పోలింగ్ రోజు సైతం ఇక్కడ పలు గొడవలు జరిగాయి. పోలింగ్ పూర్తయ్యి 20 రోజులు గడుస్తున్నా ఇంకా రాప్తాడులో రెండు పార్టీల కార్యకర్తల మధ్య దాడులు జరుగుతునే ఉన్నాయి. అంటే ఇక్కడ ఎంత ఉద్రిక్తల మధ్య ఎన్నిక జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

సమానంగా ఉన్న ఇద్దరి బలాలు

మంత్రిగా పరిటాల సునీత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేశారు. నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా సాగునీరు వచ్చిందనే క్రెడిట్ కూడా ఆమెకే దక్కింది. సహజంగానే ఇక్కడ పరిటాల కుటుంబానికి బాగా పట్టుంది. దీంతో ఈసారి కూడా తమదే విజయమని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అయితే, పరిటాల సునీత సోదరుల పెత్తనం పెరగడం, పరిటాల కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కొంత మైనస్ గా మారింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పట్ల రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి ఉంది. ఓడినా ఆయన ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించారు. స్వంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేయడం కూడా కలిసివచ్చింది. నియోజకవర్గంలోని రాప్తాడు, రామగిరి మండలాల్లో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోంది. చెన్నేకొత్తపల్లి, ఆత్మకూరు మొండలాల్లో వైసీపీకి మెజారిటీ రావచ్చు. కనగానపల్లిలో పోటీపోటీ ఉంది. అనంతపురం రూరల్ మండలంలో ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేయనున్నాయి. ఈసారి ఇక్కడ వైసీపీకి మెజారిటీ ఓట్లు పోలయ్యాయనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే వైసీపీ స్వల్ప మెజారిటీతోనైనా విజయం సాధించే అవకాశం ఉంది.

Tags:    

Similar News