ఆయన పక్కన పెట్టారు… ఈయన సైడ్ చేసేశారు

రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే. అయితే ఆయన జనసేనను పట్టించుకోవడం లేదు. జనసేన కూడా ఆయనను రికార్డుల నుంచి తొలగించినట్లే కనపడుతుంది. జనసేన పార్టీ [more]

Update: 2020-06-20 15:30 GMT

రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే. అయితే ఆయన జనసేనను పట్టించుకోవడం లేదు. జనసేన కూడా ఆయనను రికార్డుల నుంచి తొలగించినట్లే కనపడుతుంది. జనసేన పార్టీ నుంచి గెలచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచారు. పవన్ కల్యాణ్ కూడా ఓటమి పాలయి ఆయన గెలవడంతో రాపాక వరప్రసాద్ పేరు రాష్ట్రమంతటా మారుమోగిపోయింది. జనసేన కార్యకర్తలు సయితం ఆయనకు ప్రత్యేక స్థానం ఇచ్చారు.

కొద్ది నెలలుగా పార్టీకి….

అయితే గత కొన్ని నెలలుగా రాపాక వరప్రసాద్ జనసేనకు దూరంగా ఉంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే జనసేన పార్టీలో రాపాక వరప్రసాద్ లేనట్లే. ప్రభుత్వంలో ఉన్న వైసీపీకి రాపాక వరప్రసాద్ అండగా ఉంటున్నారు. వైసీపీికి ఈయన అవసరం లేకపోయినా తన మద్దతును ప్రకటిస్తూ రాపాక వరప్రసాద్ లైన్ తప్పుతున్నారు. ఇది జనసేనలో కొన్నాళ్లుగా జరుగుతున్న తంతు. పవన్ కల్యాణ‌్ సయితం రాపాక వరప్రసాద్ ను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు.

పార్టీ విధానాలపై…..

జనసేన పార్టీకి కొన్ని విధానాలున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో పోరాడాలనుకుంటుంది. ఇందుకోసం బీజేపీతో పొత్తు కూడా పెట్టుకుంది. అయితే మూడు రాజధానుల విషయంలో పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తే రాపాక వరప్రసాద్ సమర్థించారు. ఇక ఇంగ్లీష్ మీడియం విషయంలోనూ పార్టీ లైన్ కు భిన్నంగా ప్రభుత్వాన్ని రాపాక వరప్రసాద్ వెనకేసుకొచ్చారు. అన్ని విషయాల్లోనూ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు రాపాక వరప్రసాద్.

తాజా ఎన్నికల్లోనూ…..

ఇక తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు రాపాక వరప్రసాద్ ఓటు వేశారు. తాను జనసేన ఎమ్మెల్యే అయినా పార్టీ తనకు ఎలాంటి విప్ జారీ చేయలేదని రాపాక అంటున్నారు. జనసేన కూడా రాపాక వరప్రసాద్ ను లైట్ గానే తీసుకుంటుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కాని, దాదాపు పార్టీ నుంచి ఆయనకు మంగళం పాడినట్లే. మొత్తం మీద రాపాక వరప్రసాద్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టగా.. పవన్ కల్యాణ‌్ రాపాకను సైడ్ చేశారు.

Tags:    

Similar News