వేలు పెడితే ఊరుకుంటామా?

ఆ మంత్రికి దూకుడు ఎక్కువ అంటున్నారు వైసీపీలోని నాయ‌కులే. నిజానికి దూకుడు ఉండాల్సిందే. అయితే, త‌న‌కు సంబంధించిన నియోజ‌క‌వ‌ర్గమో? లేదా మ‌రే విష‌యంలోనైనా దూకుడు ఉండాల్సిందే. కానీ, [more]

Update: 2020-02-19 06:30 GMT

ఆ మంత్రికి దూకుడు ఎక్కువ అంటున్నారు వైసీపీలోని నాయ‌కులే. నిజానికి దూకుడు ఉండాల్సిందే. అయితే, త‌న‌కు సంబంధించిన నియోజ‌క‌వ‌ర్గమో? లేదా మ‌రే విష‌యంలోనైనా దూకుడు ఉండాల్సిందే. కానీ, ఆ మంత్రి త‌న‌కు సంబంధం లేని నియోజ‌క‌వ‌ర్గంలో, ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయ‌కుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో దూకుడు రాజ‌కీయాలు చేస్తున్నందున ఇప్పుడు ఆ మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నుంచి గెలిచిన శ్రీరంగ‌నాథ‌రాజుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. నిజానికి కేబినెట్‌లో ర్యాంకును రాజుగారు ఊహించ‌లేదు.

సొంత పార్టీలోనే కాకుండా…..

కానీ, జ‌గ‌న్ మాత్రం ఆయ‌న అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకుని రంగ‌నాథ‌రాజుకు పెద్దపీట వేశారు. అయితే, ఆయ‌న త‌న ప‌రిధులు తెలుసుకోకుండా వ్యవ‌హ‌రిస్తున్నార‌నేది ఆయ‌న పై వ‌స్తున్న పెద్ద అప‌వాదు. ఇటు సొంత పార్టీలోను, అటు విప‌క్షం విష‌యంలోనూ రాజుగారు త‌న మాటే నెగ్గాల‌నే పంతంతో ముందుకు సాగుతున్నార‌ని విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. సొంత పార్టీలో నేత‌ల మాట‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా పైచేయి సాధించాల‌ని ప్రయ‌త్నిస్తున్నారు. ఇదే వివాదానికి దారి తీస్తుంటే ఇప్పుడు మ‌రో కొత్త వివాదం తెర‌మీదికి వ‌చ్చింది.

ఉండిలో వేలు పెట్టి….

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌క‌వర్గంలో తొలిసారి గెలిచిన మంతెన రామ‌రాజును మంత్రి ఘోరంగా అవ‌మానిస్తున్నార‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ హోరా హోరీ పోరాడినా టీడీపీ విజ‌యం సాధించింది. అయితే ఇక్కడ కూడా త‌న హ‌వా ప్రద‌ర్శించాల‌ని భావిస్తున్న మంత్రి రంగ‌నాథ‌రాజు త‌న సామాజిక వ‌ర్గమే అయిన‌ప్పటికీ రామ‌రాజుపై పైచేయి సాధించాల‌ని భావిస్తున్నారు. ఈ క్రమంలో అవ‌కాశం వ‌చ్చిన‌ప్పడల్లా ఆ నియోజక‌వ‌ర్గంలో వేలు పెడుతున్నార‌న్న టాక్ వ‌స్తోంది.

సమావేశానికి ఆహ్వానించకుండా…

ఇటీవ‌ల నియోక‌జ‌క‌వ‌ర్గంలో అభివృద్ది కార్యక్రమాల‌పై మంత్రి హ‌యాంలో స‌మీక్ష నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రామ‌రాజును ఆహ్వానించ‌లేదు. ఇది ఉద్దేశ పూర్వకంగానే చేశార‌ని, త‌న‌ను అవ‌మానించార‌ని రామ‌రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లి బైఠాయించి నిర‌స‌న తెలిపారు. దీంతో ఈ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చకు వ‌చ్చింది. దీనిపై స్పీక‌ర్‌కు కూడా రామ‌రాజు ఫిర్యాదు చేయాల‌ని నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ విష‌యానికి సంబంధించి అన్ని వేళ్లూ రంగ‌నాథ‌రాజు వైపే చూపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

సొంత నేతను కూడా…..

ఉండి నియోజ‌క‌వ‌ర్గం రంగ‌నాథ‌రాజుకు సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఈ క్రమంలోనే ఇక్కడ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీవీఎల్‌.న‌ర‌సింహారాజును సైతం ప‌క్కన పెట్టేసి గెలిచిన ఎమ్మెల్యేను ప‌ట్టించుకోకుండా రంగ‌నాథరాజు రాజ‌కీయాలు చేస్తున్నట్టే తెలుస్తోంది. ఈయ‌న తీరుపై అటు సొంత పార్టీ నేత‌ల‌తో పాటు ఇటు టీడీపీ వాళ్లు సైతం గుర్రుగా ఉన్నారు.

Tags:    

Similar News