యనాంలో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయలేదు?

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణమైన కాకినాడ సమీపంలోని యానాం గురించి తెలియని తెలుగు వారు ఉండరు. పేరుకు ఇది కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పరిధిలో ఉన్నప్పటికీ [more]

Update: 2021-04-28 16:30 GMT

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణమైన కాకినాడ సమీపంలోని యానాం గురించి తెలియని తెలుగు వారు ఉండరు. పేరుకు ఇది కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పరిధిలో ఉన్నప్పటికీ తెలుగు రాష్ర్టంతో అవినాభావ సంబంధం ఉంది. యానాంలో పూర్తిగా తెలుగు సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు కనపడుతుంటాయి. తెలుగు ఇక్కడ అధికార భాష కానప్పటికీ దాదాపు ప్రతి ఒక్కరికీ తెలుగు తెలిసి ఉంటుంది. మాములు పరిస్థితుల్లో అయితే పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ యానాంలో పెద్దగా హడావిడి ఉండదు. ఎందుకంటే పుదుచ్చేరి రాజకీయాల్లో యానాం ప్రభావం పెద్దగా ఉండదు. పుదుచ్చేరిలోని నాలుగు జిల్లాల్లో యానాం ఒకటి.

రంగస్వామి పోటీ చేస్తుండటంతో….

మిగిలినవి పుదుచ్చేరి, కారైకల్, మహే. వీటిల్లో పుదుచ్చేరి, కారైకల్ పుదుచ్చేరి సమీపంలోనే ఉంటాయి. మహే కేరళ సరిహద్దుల్లో, యానాం ఏపీ సరిహద్దుల్లో ఉంటుంది. అఖిల భారత నమదు రాజ్యం కాంగ్రెస్ (ఏ ఐ ఎన్ ఆర్ సీ ) అభ్యర్థిగా రంగస్వామి పోటీచేస్తుండటంతో యానాం ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రంగస్వామి పార్టీ గెలిస్తే మళ్లీ సీఎం కావడం ఖాయం. ఈ కూటమిలో భాజపా, అన్నాడీఎంకే ప్రధాన భాగస్వాములు. మొత్తం 30 స్థానాలకుగాను రంగస్వామి పార్టీ 16, భాజపా 9, అన్నాడీఎంకే 5స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

మల్లాడి మద్దతు…..

రంగస్వామి తట్టం చావిడి నియోజకవర్గంతోపాటు యానాంలోనూ పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గం కీలకంగా మారింది. రాజకీయ నేతలు దీనిపై దృష్టి పెట్టారు. ఇప్పటివరకూ యానాం అంటే మల్లాడి క్రిష్ణారావు, మల్లాడి అంటే యానాంగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఆయన 1996, 2001, 2006, 2011, 2016ల్లో ఇక్కడినుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో 8,744 మెజార్టీతో విజయం సాధించారు. 1996,2001లో స్వతంత్ర అభ్యర్థిగా, 2006, 2011, 2016 ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. ఈ దఫా పోటీ చేయడం లేదు. రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. అంతమాత్రాన క్రియశీల రాజకీయాలకు దూరం కాలేదు. ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి రంగస్వామికి బహిరంగంగా మద్దతు ప్రకటించి ఆయన విజయానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

సర్వేలన్నీ..

ఎన్నార్ కాంగ్రెస్ కే విజయావకాశాలు ఉన్నట్లు ఇటీవల ఎన్నికలు సర్వేలు వెల్లడించాయి. అనుకున్నవి అనుకున్నట్లు జరిగి రేపటి ఎన్నికల్లో రంగస్వామి గెలిచి ముఖ్యమంత్రి అయితే యానాంలో మళ్లీ మల్లాడి క్రిష్ణారావు చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా లేకున్నా స్థానిక రాజకీయాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. రంగస్వామిని ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఢీకొంటున్నారు. వారిలో గొల్లపల్లి అశోక్ ఒకరు. 35 సంవత్సరాల వయసు గల అశోక్ తొలుత భాజపా టికెట్ ఆశించారు. అయితే పొత్తుల్లో భాగంగా భాజపా ఈ స్థానాన్ని రంగస్వామికి కేటాయించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. మరో స్వతంత్ర అభ్యర్థి పెమ్మడి దుర్గాప్రసాద్ కూడా బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో కాపులు, మత్స్యకారులు అధికసంఖ్యలో ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు ఉంటాయి.

గెలుపు గ్యారంటీ అని……

అయిదేళ్లపాటు పుదుచ్చేరిని పాలించిన హస్తం పార్టీ కనీసం ఇక్కడ తన అభ్యర్థిని పోటీకి దించలేకపోయింది. పార్టీ దుస్థితికి ఇంతకు మించి మరో నిదర్శనం అక్కరలేదు. మొత్తం 36వేలకుపైగా ఓటర్లు గల ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లదే పైచేయి. వారి సంఖ్య 17,544. పురుష ఓటర్లు 19,013 మంది ఉన్నట్లు అంచనా. రంగస్వామి గెలుపు లాంఛనమేనన్న వాదన వినపడుతోంది. ఆయన గెలుపు తన గెలుపుగా భావించి మల్లాడి పని చేస్తున్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం నియోజకవర్గంలో ప్రధాన సమస్య. దీంతో వారు ఏపీకి వలసలు వెళుతున్నారు. రంగస్వామి గెలిచి ముఖ్యమంత్రి అయితే తమ తలరాతలు మారుతాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News