ఆ జిల్లా ఏం పాపం చేసుకుంది… అలా వదిలేస్తారా?

తెలంగాణ రాజ‌కీయాల్లో చిత్రమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కొన్ని కొన్ని జిల్లాలు దూకుడుగా ఉంటే.. మ‌రికొన్ని జిల్లాల్లో మాత్రం ప‌రిస్థితి దారుణంగా ఉంది. మ‌రీ ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి [more]

Update: 2020-07-27 09:30 GMT

తెలంగాణ రాజ‌కీయాల్లో చిత్రమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కొన్ని కొన్ని జిల్లాలు దూకుడుగా ఉంటే.. మ‌రికొన్ని జిల్లాల్లో మాత్రం ప‌రిస్థితి దారుణంగా ఉంది. మ‌రీ ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐదుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే స‌మ‌యంలో ఒక‌ మ‌హిళా మంత్రి ఉన్నారు. ఇక‌, మూడు జిల్లా ప‌రిష‌త్‌ల‌లో విస్తరించింది. అయిన‌ప్పటికీ.. ఇక్కడి స‌మ‌స్యలు ఎక్కడివ‌క్కడే అన్న విధంగా ఉన్నాయి. ఎవ‌రూ కూడా ఇక్కడి ప్రజ‌ల‌ను, స‌మ‌స్యల‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఎవ‌రి రాజ‌కీయాలువారు చేసుకుంటున్నారే త‌ప్ప స్థానికంగా జిల్లాను అభివృద్ధి చేయ‌డంపై మాత్రం దృష్టి పెట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఇంత మంది ఉన్నా…..

విష‌యంలోకి వెళ్తే తెలంగాణ రాజ‌ధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు అతి స‌మీపంలోనే ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలిస్తే.. చేవెళ్ల నుంచి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి, మ‌ల్కాజ్ నుంచి రేవంత్‌రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గర్ ఎంపీ స్థానం నుంచి ఎం. శ్రీనివాస‌రెడ్డి, నాగ‌ర్‌క‌ర్నూల్ నుంచి పి.రాములు, భువ‌న‌గిరి నుంచి కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి విజ‌యం సాధించారు. వీరిలో ఇద్దరు రేవంత్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి మాత్రమే కాంగ్రెస్ త‌ర‌ఫున గెలుపు గుర్రాలెక్కారు. మిగిలిన వారు టీఆర్‌ఎస్ ఎంపీలే. ఇక‌, ఇక్కడ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మ‌హిళా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం ఇక్కడ నుంచే ఉంది.

ప్రజలను పట్టించుకోకుండా….

ఇంత‌మంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ.. జిల్లాపై మాత్రం ఎవ‌రూ త‌మ ముద్ర వేయ‌లేక పోతున్నారు. ఏ ఒక్కరూ జిల్లా అభివృద్ధిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ముఖ్యంగా క‌రోనానేప‌థ్యంలో ప్రజ‌లు అల్లాడిపోతున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఐదుగురు ఎంపీలు కాని.. ఎమ్మెల్యేలు కాని… జిల్లా మంత్రి కాని ఎవ్వరూ జిల్లా ప్రజ‌ల‌ను ప‌ట్టించుకోలేద‌న్న టాక్ ఉంది. అందుకే ఈ ప్రాంతంలోనే ఎక్కువుగా క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయ‌న్న విమ‌ర్శలు కూడా ఉన్నాయి.

నిధులను సయితం….

అదేస‌మ‌యంలో ఎంపీ నిధులు కూడా త‌మ‌కు అనుకూలంగా ఉన్నవారికే ఇస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక అధికార పార్టీలో కూడా ఎంపీలు త‌మ అనుచ‌రుల‌కు నిధులు ఇస్తుంటే ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎంపీల నిధుల‌తో ప‌నులు చేయించుకుంటోన్న వారు త‌మ‌ను లెక్క చేయ‌డం లేద‌ని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. పైగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా.. మంత్రిగా స‌బితా ఇంద్రారెడ్డి ఉన్నప్పటికీ ఇక్కడి స‌మ‌స్యలు ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో జిల్లా అభివృద్ధిలో తీవ్రంగా వెనుక‌బ‌డి ఉంద‌నే అభిప్రాయం స‌ర్వత్రా వినిపిస్తోంది. మ‌రి నాయ‌కులు ఎప్పటికి మార‌తారో చూడాలి.

Tags:    

Similar News