అదే పనిలో రామ్ మాధవ్....!

Update: 2018-07-09 18:29 GMT

సున్నితమైన సరిహద్దు రాష్ట్రం జమ్మూకాశ్మీర్ లో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. సాధ్యమైనంత త్వరగా శ్రీనగర్ అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, పకడ్బందీ వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతోంది. తెర వెనక మంత్రాంగంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి, తెలుగువాడైన రామ్ మాధవ్ అదే పనిలో ఉన్నారు. 25 మంది ఎమ్మెల్యేలతో ద్వితీయ స్థానంలో ఉండటం, కేంద్రంలో అధికారంలో ఉండటం, విపక్షాల్లో చీలికలు, అన్నింటికీ మించి గవర్నర్ ఎన్.ఎన్ వోహ్రా తన మనిషి కావడంతో అధికారంపై కమలం పార్టీ ఆశావహంగా ఉంది.

సంఖ్యాపరంగా చూస్తే.....

అసెంబ్లీలో సంఖ్యాపరంగా చూస్తే అధికార సాధన సంక్లిష్టమే అయినప్పటికీ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా కమలం పార్టీ వ్యూహరచన చేస్తోంది. 87 మంది సభ్యులు గల అసెంబ్లీలో 28 స్థానాలతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అతి పెద్ద పార్టీగా ఉంది. 25 స్థానాలతో కమలనాధులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. 13 స్థానాలతో నేషనల్ కాన్ఫరెన్స్, 12 స్థానాలతో కాంగ్రెస్ ప్రభావ శూన్యంగా ఉన్నాయి. ప్రభుత్వ స్థాపనకు కనీసం 44 మంది సభ్యులు అవసరం. కమలనాధులకు ఉన్నది కేవలం 25 మంది మాత్రమే. ఇంకా కనీసం 19 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ ప్రాతిపదికన చూస్తే మద్దతు కూడగట్టడం కష్టం. కానీ పార్టీలో చీలికలను ప్రోత్సహించడం ద్వారా బలాన్ని సాధిస్తామని కమలనాధులు ధీమాగా ఉన్నారు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అమరనాధ్ యాత్ర ముగిసే సమయానికి అంటే ఆగస్టు ఆఖరు లేదా సెప్టంబరు ప్రారంభంలో శ్రీనగర్ లో కొత్త సర్కార్ కొలువు దీరడం ఖాయమన్న ధీమాను కాషాయపార్టీ వ్యక్తం చేస్తోంది.

చీలిక తేవడం ద్వారా....

ప్రస్తుతం పీడీపీలోని లుకలుకలను సద్వినియోగం చేసుకుని ఆ పార్టీని చీల్చాలని చూస్తోంది. పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన సోదరుడి రాజకీయ ఎదుగుదలపై దృష్టి సారించిందని, ఇందులో భాగంగా సీనియర్లను అణిచివేస్తున్నారన్న భావన పార్టీలో ఉంది. పార్టీలోని ఒక వర్గం చీలిపోయి బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ 2016 జనవరిలో మరణించారు. అప్పట్లోనే బయటకు రావాలని భావించినప్పటికీ మరీ తొందరపాటు అవుతుందని భావించి తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గత నెల 19వ తేదీన మద్దతు ఉపసంహరించిన అనంతరం పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జి రామ్ మాధవ్ కశ్మీర్ నేత సజ్జత్ లోన్ తో సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. పీపుల్స్ కాన్పరెన్స్ కు చెందిన సజ్జత్ లోన్ తొలినుంచి బీజేపీకి అనుకూలుడు. కశ్మీర్ తలరాతను మార్చే శక్తి ఒక్క మోదీకే ఉందని తరచూ చెప్పేవారు. ఆయన పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో లోన్ ను తెరపైకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చేయాలని కమలం పార్టీ తలపోస్తోంది. నేరుగా అధికారం చేపట్టకుండా కీలుబొమ్మ ముఖ్యమంత్రిని అడ్డంపెట్టుకుని పెత్తనం చెలాయించాలని చూస్తోంది. ఇక కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లోని అసంతృప్తివాదులకు వల వేయాలని చూస్తోంది. సహజంగా అధికారం వైపునకు రావడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. రాష్ట్ర శాసనసభ పదవీకాలం మరో మూడేళ్లు ఉంది. ఇంత కాలాన్ని వదులుకుని కేవలం ఎమ్మెల్యేలుగా ఉండటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఏదో ఒక ప్రభుత్వం ఏర్పడితే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చన్నది సగటు ఎమ్మెల్యేల అభిప్రాయం.

గవర్నర్ ను మార్చేసి....

అధికార సాధనలో భాగంగా గవర్నర్ ను కూడా మార్చాలని కమలనాధులు తలపోస్తున్నారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్ ఎన్.ఎన్ వోహ్రాకు తటస్థుడిగా పేరుంది. 2008 నుంచి పదేళ్లుగా ‘‘రాజ్యపాల్’’ గా ఉంటున్నప్పటికీ ఆయనపై ఎటువంటి పార్టీ ముద్రలేదు. బీజేపీకి అనుకూలుడన్న పేరు లేదు. అందువల్ల వోహ్రా స్థానంలో కరడు గట్టిన ఆర్ఎస్ఎస్ వాదని శ్రీనగర్ రాజ్ భవన్ అధిపతిగా నియమిస్తే తమ పని సులువవుతుందన్నది కమలనాధుల ఆలోచన. మాజీ ఐఏఎస్ అధికారి అయిన వోహ్రా స్థానంలో ఫక్తు రాజకీయ నాయకుడిని గవర్నర్ గా నియమించడానికి మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అమరనాధ్ యాత్ర అనంతరం ఈ ప్రయత్నాలు కొలిక్కి రాగలవని చెబుతున్నారు.

లోయలో బలపడాలని.....

రాష్ట్ర రాజకీయాల్లో పీడీపీ అతివాద పార్టీగా, నేషనల్ కాన్ఫరెన్స్ కు మితవాద పార్టీగా పేరుంది. దక్షిణ కశ్మీర్ తో పోలిస్తే అతివాదం కాస్త తక్కువగా ఉండే ఉత్తర కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కు బలం ఎక్కువ. ముస్లింలు ఎక్కువగా ఉండే కశ్మీర్ లోని స్థానాలను పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పంచుకుంటాయి. అదే విధంగా హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూ ప్రాంతంలో, బౌద్ధులు అధికంగా ఉండే లడఖ్ ప్రాంతంలో సీట్లను బీజేపీ, కాంగ్రెస్ లు దక్కించుకుంటాయి. ప్రస్తుతానికి జమ్మూలో పూర్తిగా ఆధిపత్యాన్ని సాధించిన బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి కశ్మీర్ లోయలో కూడా బలపడాలని భావిస్తోంది. అధికారంలో ఉంటేనే ఇది సాధ్యపడుతుందని భావిస్తోంది. ముస్లింలలో చీలిక ద్వారా కశ్మీర్ లోయలో పాగా వేయాలని చూస్తోంది. ఇందుకు నాందిగా శ్రీనగర్ అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో విజయవంతమవుతామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News