రైటో… ‘‘రాంగో’’ వర్మ …!!

ఏం చేసినా రచ్చే. కంటెంట్ కంటే కాంట్రవర్సీ తో నే ఎక్కువ ప్రచారం. వివాదం ముందు పుట్టి రాంగోపాల్ వర్మ తర్వాత పుట్టాడనుకోవచ్చు. పదేళ్లుగా పెద్ద హిట్ [more]

Update: 2019-04-29 15:30 GMT

ఏం చేసినా రచ్చే. కంటెంట్ కంటే కాంట్రవర్సీ తో నే ఎక్కువ ప్రచారం. వివాదం ముందు పుట్టి రాంగోపాల్ వర్మ తర్వాత పుట్టాడనుకోవచ్చు. పదేళ్లుగా పెద్ద హిట్ లేని దర్శకుడు ఇంతగా లైమ్ లైట్ లో ఉండటానికి కారణం ఆయన సృష్టించే వివాదాలే. తాజాగా విజయవాడలో ప్రవేశించడానికి ప్రయత్నించి మరోసారి వివాదానికి తెర తీశారు. ప్రభుత్వానికి, పోలీసులకు పరీక్ష పెట్టారు.. నిజానికి ఆయనకు ఇది కొత్తకాదు. ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని తీసుకుని దానికి మసాలా జోడించడం ఆయనకు పెట్టిన విద్య. దానిపై బాధిత వర్గాలు, లేదా సమాజ సేవకులు, స్వచ్ఛందసంస్థలు రోడ్డెక్కుతాయి. వర్మకు కావాల్సింది అదే. అయిదుపైసలు ఖర్చు లేకుండా కోట్లాదిరూపాయల ప్రచారం . మీడియా మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. ఆయన తీసే సినిమాపైనే రోజుల తరబడి చర్చలు నడుస్తాయి. పాజిటివ్, నెగటివ్ అన్న తేడా లేదు. తనకు కావాల్సింది పబ్లిసిటీ. మీడియాకు కావాల్సింది టెలివిజన్ రేటింగు పాయింట్లు. వారికి కావాల్సినది ఆయన సమకూర్చిపెడతారు. ఆయనకు రావాల్సిన అయాచిత ప్రచారం వచ్చిపడుతుంది. ఇదే సూత్రంతో గత కొంతకాలంగా సినిమా బిజినెస్సును సక్సెస్ పుల్ గా నడపగలుగుతున్నారు రాంగోపాల్ వర్మ. ఈ క్రమంలో ఆయన దిగజారిపోయారని, విషయం లేకపోవడం వల్లనే విలువలు వదిలేస్తున్నారని సవాలక్ష విమర్శలు వస్తుంటాయి. వాటిలో దేనినీ ఆయన లెక్కపెట్టరు. ఆ ధిక్కార తత్వంతోనే నెగ్గుకుని వస్తున్నారు.

పబ్లిసిటీకి పరాకాష్ఠ…

ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన సినిమా లక్ష్మీస్ ఎన్టీయార్. విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఇంకా విడుదల కాని చిత్రం. ఈమధ్య కాలంలో ఈ సినిమాకు లభించినంత ప్రచారం మరే సినిమాకు దక్కలేదు. ఇందుకు ప్రధాన కారణం ఈ సినిమాను సానుకూలంగా వైఎస్సార్ కాంగ్రెసుపార్టీ, ప్రతికూలంగా తెలుగుదేశం పార్టీ భుజాన వేసుకుని మోశాయి. రిలీజ్ అయితే తమ అధినేత వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుందని టీడీపీ , విడుదలతో తమ పార్టీకి ఎంతో కొంత రాజకీయ ప్రయోజనం సమకూరుతుందని వైసీపీ భావించాయి. దాంతో లక్షలాది కార్యకర్తలు, కోట్లలో సానుభూతిపరులు ఉన్న ప్రధాన పార్టీల చేతుల్లో ముడిసరుకుగా మారింది రాంగోపాల్ వర్మ సినిమా. ఆయనకు కావాల్సింది అదే. ఎన్నికల సమయంలో సినిమాను విడుదల చేయాలనుకోవడంలోనే కిటుకు దాగి ఉంది. పార్టీలు ఓన్ చేసుకుని సక్సెస్ బాధ్యతను తీసుకుంటాయని ఆశించారు. అయితే సాంకేతికంగా ఎన్నికలసంఘం, న్యాయస్థానం అడ్డుపడటంతో ఏపీలో విడుదలకు బ్రేకులు పడ్డాయి. అప్పటికే ప్రచారం పీక్ కు చేరుకుంది. దీని ప్రభావంతో తెలంగాణలో సినిమాకు ఆర్థికంగా ప్రయోజనం సమకూరింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ టీడీపీపై విమర్శలు చేయడానికి సినిమా నిలుపుదలను సైతం అస్త్రంగా చేసుకుంది. ఎన్నికలు ముగిసిపోవడంతోనే వివాదానికి తెరపడిపోయింది. ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా తగ్గిపోయింది. మళ్లీ క్యూరియాసిటి పుట్టిస్తేనే సినిమా పట్ల క్రేజ్ పెరుగుతుంది. లేకపోతే అంతే సంగతులు. దానిని గమనించే రాంగోపాల్ వర్మ తెలివిగా అడుగులు వేశారు.

మీడియాకు ముచ్చెమటలు…

అందర్నీ తమ వార్తావస్తువులుగా వాడుకొంటుంది మీడియా. కానీ మీడియానే తనకు అవసరమైన విధంగా తన చుట్టూ తిప్పుకొంటుంటారు రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీయార్ పై ప్రచారం తగ్గింది. ఆసక్తి పోయింది. ఎలక్షన్ ముగిసింది. దాంతో మరో ఎత్తుగడ వేశారు. టైగర్ కేసీఆర్ అనే పేరిట ఒక క్లిప్ విడుదల చేశారు. దాంతో మళ్లీ రగడ మొదలైంది. ఆ తర్వాత ఎన్టీయార్ సినిమా విడుదల ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఆంధ్రాప్రజలపై విద్వేషం రగిల్చేవిధంగా ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకంపనలతో గొడవ జరుగుతుందని తెలుసు. దానిని సాకుగా చూపుతూ టీడీపీ తన పర్యటనను అడ్డుకుంటుందని తెలుసు. అదే విడుదల కాబోయే తన సినిమాకు ప్రచారమనీ తెలుసు. అందుకే విజయవాడలో విలేఖరుల సమావేశం పెట్టుకున్నారు. ఆయన ఆశించినట్లుగానే ఒత్తిడితో హోటల్ లో అనుమతించలేదు. పబ్లిక్ గా నాలుగు రోడ్ల కూడలిలో ప్రెస్ మీట్ పెడతానంటూ పేచీ పెట్టారు. పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం లేదా? నాకు, నిర్మాతకు విజయవాడలో తిరిగే స్వేచ్ఛలేదా? అంటూ వర్మ సాంకేతికంగా ప్రశ్నించారు. నిజానికి ప్రభుత్వ పాత్ర ఇక్కడ పరిమితమనే చెప్పాలి. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ పాత్ర కుదించుకుపోయింది. ఎన్నికల కమిషన్ నేత్రుత్వంలోనే యంత్రాంగం పనిచేస్తోంది. అయినా టీడీపీని నిందించడం ద్వారా సినిమా కంటెంట్ విషయంపై కొంత ఆసక్తి కలుగుతుంది. అదే విధంగా చర్చ కూడా నడుస్తుంది. ఆ విషయంలో రాంగోపాల్ వర్మ సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

సినిమాపై చిన్నచూపు…

నిజానికి దేశంలో స్రుజనాత్మక సామర్ధ్యం కలిగి చక్కని స్క్రీన్ ప్లే తో సినిమాను తెర కెక్కించగల అతి తక్కువ మంది దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. శివ మొదలు సర్కార్ వరకూ ఆయన తీసిన సినిమాలు తనలోని ప్రతిభాప్రావీణ్యాలకు అద్దం పడతాయి. విపరీతమైన సినిమా నాలెడ్జి కలిగిన వ్యక్తి. అన్ని విభాగాలపైనా అవగాహన కలిగిన టెక్నీషియన్. ప్రేక్షకుల్లో తగ్గిపోయిన రసాత్మకత కారణంగా ఎలా తీసినా చూస్తారులే అనే నిరాసక్తమైన భావనతో ఆయన శ్రద్ధ తగ్గించేశారనేది రాంగోపాల్ వర్మ సన్నిహితుల అభిప్రాయం. ఎలా తీసినా ఫర్వాలేదు. ప్రచారం బాగుంటే చాలు అనుకునే ఒక ఉదాసీనత వర్మలో చోటు చేసుకుంది. ఫలితంగా సినిమాల సంఖ్యపైనే తప్ప క్వాలిటీపై ద్రుష్టి పెట్టడం మానేశారంటారు. టెక్నీషియన్ గా ఇప్పటికీ ఆయన లో క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. కానీ సినిమాపై ఆయనకు గౌరవభావమే పెరగాలి అంటుంటారు. మంచి సినిమాలు తీయగల సామర్ధ్యం ఉన్నప్పటికీ గాడ్,సెక్స్ అండ్ ట్రూత్ వంటి సబ్జెక్టులతో సెన్నేషన్ చేయాలనుకోవడంతోనే అసలు విషయం మరుగునపడిపోతోంది. ఆయన తిరిగి రైట్ ట్రాక్ లోకి రావాలనుకునే అభిమానులకూ కొరత లేదు. వివాదాలు పక్కనపెట్టి సరైన పంథా పూనితే జాతీయ చలనచిత్ర సీమపై తెలుగు జెండా రెపరెపలాడుతుంది. లేకుంటే ‘రాంగో ’వర్మ గానే మిగిలిపోతారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News