రామసుబ్బారెడ్డి రిటర్న్ అవుతున్నారా?

జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రానున్నారా? ఆయన వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. రెండు [more]

Update: 2021-04-20 14:30 GMT

జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రానున్నారా? ఆయన వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. రెండు కుటుంబాలే జమ్మలమడుగును మొన్నటి వరకూ శాసిస్తూ వచ్చాయి. వరస ఓటములతో రామసుబ్బారెడ్డి ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. గత తెలుగుదేశంపార్టీ ప్రభుత్వ హయాంలో కొంత కూడబెట్టుకున్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

ఆర్థిక బాధలు….

అందువల్లనే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారంటున్నారు. తన చిరకాల ప్రత్యర్థి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరినా తాను వైసీపీలో చేరడానికి ముఖ్య కారణం ఈ నాలుగేళ్లు ఆర్థికంగా, క్యాడర్ పరంగా ఇబ్బంది పడకుండా ఉండటం కోసమే. అయితే తాను ఏ ఉద్దేశ్యంతో వైసీపీలో చేరారో? అది నెరవేరడం లేదు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనను కలుపుకుని పోవడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ తన వర్గానికి పదవులు లభించలేదు.

పార్టీలో చేరిన ఉద్దేశ్యం…..

దీంతో పాటు తాను ఆర్థికంగా బలపడకుండా ఉండేందుకు సుధీర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఏ కాంట్రాక్టులు కూడా తనకు దక్కనివ్వడం లేదు. అధికారులు కూడా తన మాట వినడం లేదు. ఈ విషయాన్ని రామసుబ్బారెడ్డి నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. వైసీపీలో పదవులు లభిస్తాయన్న ఆశ కూడా రామసుబ్బారెడ్డికి పోయింది. దీంతో ఆయన ఇటీవల తన ముఖ్య అనుచరులతో సమావేశమయినట్లు తెలిసింది.

ముఖ్య అనుచరులతో సమావేశం…..

ఇటీవల జగన్ తో రామసుబ్బారెడ్డి సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికలలోనూ సుధీర్ రెడ్డికే టిక్కెట్ అని చెప్పారు. కావాలంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తాం సర్దుకుపొమ్మని అధిష్టానం చెప్పడంతో రామసుబ్బారెడ్డి నిరుత్సాహ పడినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని అనుచరులతో చెప్పారు. టీడీపీలోనూ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. వైసీపీలో ఉన్నా భవిష్యత్ లేదని అనుచరులు కూడా రామసుబ్బారెడ్డిపై వత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. ఆదినారాయణ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉండటంతో ఆయనకంటే ముందుగానే టీడీపీలో చేరాలని కొందరు గట్టిగా కోరుతుండటంతో రామసుబ్బారెడ్డి ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. అతి త్వరలోనే ఆయన చంద్రబాబును కలిసే అవకాశముందని కూడా జమ్మలమడుగులో చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News