తడి లేకున్నా…తపన ఎక్కువేనే?

జమ్మల మడుగులో మళ్లీ మూడు గ్రూపులు మొదలయ్యేటట్లుంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీలో హోరాహోరీగా ప్రతి ఎన్నికల్లో పోరాడతాయి. అయితే రెండు దశాబ్దాలుగా అక్కడ [more]

Update: 2019-10-26 12:30 GMT

జమ్మల మడుగులో మళ్లీ మూడు గ్రూపులు మొదలయ్యేటట్లుంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీలో హోరాహోరీగా ప్రతి ఎన్నికల్లో పోరాడతాయి. అయితే రెండు దశాబ్దాలుగా అక్కడ టీడీపీ జెండా ఎగురలేదన్నది వాస్తవం. దీన్ని బట్టి అక్కడ టీడీపీ పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు. కాకుంటే బలమైన నేత రామసుబ్బారెడ్డి ఉండటంతో కొద్దోగొప్పో ఆ నియోజకవర్గంలో టీడీపీ తన అస్తిత్వాన్ని నిలుపుకుంటోంది. జమ్మలమడుగు రాజకీయాలు 2014 నుంచి అనేక మలుపులు తిరుగుతున్నాయి.

ఐదు సార్లు మాత్రమే….

జమ్మలమడుగు నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలస్తే ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ నాలుగుసార్లు గెలిచింది. ఒకసారి పొన్నపురెడ్డి శివారెడ్డి, నాలుగు సార్లు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. అదీ రామసుబ్బారెడ్డి కుటుంబమే ఇక్కడ టీడీపీ తరుపున గెలిచింది. 1999 తర్వాత ఇక్కడ టీడీపీ విజయం నమోదు చేయలేదు. అప్పటి నుంచి కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నాయి.

మూడు వర్గాలుగా….

తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా రామసుబ్బారెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు. రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున నేతగా ఉండగా, తాజాగా మొన్నటి వరకూ మాజీ మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక వైసీపీ ఇక్కడ బలంగా ఉంది. సుధీర్ రెడ్డి డాక్టర్ కావడంతో ఆయన ప్రజల్లో దూసుకు వెళుతున్నారు. ఇప్పటికే వైసీపీ జమ్మలమడుగులో ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించింది. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి అనుచరులకు గాలం వేస్తున్నారు.

మరింత స్ట్రాంగ్ అవ్వాలని….

వచ్చే ఎన్నికల నాటికి జమ్మలమడుగులో మరింత స్ట్రాంగ్ అవ్వాలన్నది వైసీపీ లక్ష్యంగా ఉంది. రామసుబ్బారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన చంద్రబాబును కలిసి పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు త్వరలోనే కడప జిల్లా పర్యటనకు చంద్రబాబు రానున్నారు. మరోవైపు ఆదినారాయణరెడ్డి తన అనుచర వర్గాన్ని కూడా కమలం పార్టీలోకి తీసుకెళుతున్నారు. ఇలా జమ్మలమడుగు నియోజకవర్గంలో గతంలో ఉన్న రెండు గ్రూపుల స్థానంలో ఇప్పుడు మూడుగా మారాయి. మరి ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో తెలియదు కాని ప్రస్తుతానికయితే మూడు వర్గాలు కన్ఫర్మ్.

Tags:    

Similar News