సింగ్ కింగ్ కాలేరా....??

Update: 2018-11-24 16:30 GMT

ఛత్తీస్ ఘడ్ ఎన్నికల సమరం ముగిసింది. రాష్ట్ర భావి ముఖ్యమంత్రి ఎవరో ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. వచ్చే నెల 11న వారి నిర్ణయం వెలుగులోకి రానుంది. ఈనెల 12న మొదటిదశలో భాగంగా 18 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా, మలిదశలో భాగంగా ఈనెల 20న మిగిలిన 72 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మావోయిస్టుల ప్రాబల్యం తీవ్రంగా గల రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడం, పెద్దయెత్తున ఓటర్లు ఓటు హక్కును (72 శాతం) వినియోగించుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ప్రధాన పోటీ జరిగినప్పటికీ మధ్యలో అజిత్ జోగి పార్టీ ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని తక్కువగా అంచనా వేయలేం.

ప్రజా సమస్యలపై స్పష్టంగా.....

అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని బీజేపీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ధీమా వ్యక్తం చేస్తుండగా, పదిహేనేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతతో లబ్దిపొందగలమని హస్తం పార్టీ ఆశిస్తోంది. హంగ్ అసెంబ్లీపై అజిగ్ జోగి ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కాకుండా పైపై అంశాలపై ప్రచారం జరగడం ఆవేదన కల్గించే విషయం. ఛత్తీస్ ఘడ్ మామూలుగానే పేద, వెనుకబడిన రాష్ట్రం. ఇప్పటికీ నిరుద్యోగం, పేదరికం, మావోయిస్టుల హింస, మౌలిక వసతుల లేమి తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాన పార్టీల అధినేతలైన మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ ఈ సమస్యలపై ప్రచారంలో ప్రస్తావించనే లేదు. అంబికాపూర్ బొగ్గుగనుల బాధితులకు పునరావాసం, ఉద్యోగాల కల్పన, "సర్గూజా" అటవీ ప్రాంతాల నుంచి వచ్చే ఏనుగుల విధ్వంసం నుంచి రక్షణ కోసం "ఏనుగుల కారిడార్" వంటి అంశాలు వెలుగులోకి రానేలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజాసమస్యలపై నిర్దిష్ట పరిష్కారాన్ని ఏ పార్టీ చెప్పలేకపోయింది.

ఎవరిని దెబ్బతీస్తారో......

90 అసెంబ్లీ స్థానాలుగల రాష్ట్రంలో బిలాస్ పూర్, దుర్గ్, బస్తర్, రాయ్ పూర్, సర్గూజా ప్రధాన ప్రాంతాలు. మొత్తం 90 స్థానాల్లో మూడో వంతు అంటే 29 రిజర్వ్ డ్ స్థానాలే కావడం విశేషం. 2000 నవంబరులో రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన కాంగ్రెస్ నేత అజిత్ జోగీ గత రెండేళ్లుగా పార్టీకి దూరమయ్యారు. 2003 నుంచి వరుసగా పదిహేనేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి, ఆయుర్వేద వైద్యుడైన డాక్టర్ రమణ్ సింగ్ అదృష్టవంతుడనే చె్పాలి. గత మూడు దఫాలుగా అత్తెసరు మెజారిటీతోనే ఆయన ఓట్ల గండాన్ని గట్టెక్కారు. ఈసారి కూడా అదే ధీమాతో ఉన్నారు. అజిత్ జోగి కాంగ్రెస్ ఓట్లను చీల్చడం వల్ల లబ్ది పొందగలమని ఆశిస్తున్నారు. నూతన రాజధాని నయా రాయ్ పూర్ నిర్మాణం, ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా వ్యవహరించడం, పీఎం ఆవాసయోజన, స్వచ్ఛ్ భారత్, ఉజ్వల యోజన పతకాలు తమకు మేలు చేస్తాయని రమణ్ సింగ్ భావిస్తున్నారు. జోగీ పార్టీ అయిన జనతా ఛత్తీస్ ఘడ్ కాంగ్రెస్ (జేసీసీ), బీఎస్పీ పొత్తు తమను దెబ్బతీయవచ్చన్న ఆందోళన కమలనాధుల్లో లేకపోలేదు. ముఖ్యంగా గిరిజనులు, దళితులు జోగీవైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న అనుమానం కూడా ఉంది. మొత్తం 29 రిజర్వ్ డ్ స్థానాలకు గాను 2013లో కాంగ్రెస్ 18 గెలుచుకోగా, కమలం పార్టీ 11 స్థానాలకే పరిమితమయింది. బస్తర్ ప్రాంతంలోని 12 ఎస్సీ స్థానాల్లో 11 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం మీద పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కమలనాధుల్లో లోలోన ఆందోళన లేకపోలేదు. దీనికి తోడు సహజంగా ఉండే హిందుత్వ వ్యతిరేకత, జాతీయ స్థాయిలో మసకబారుతున్న మోదీ ప్రభ ప్రమాదకర సూచనలని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

జోగీపైనే ఆశలు......

విపక్ష కాంగ్రెస్ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలు పెట్టుకుంది. జోగీతో ఎదురయ్యే నష్టాన్ని పూడ్చుకునేందుకు వ్యూహాలు రచించింది. జోగీ సామాజిక వర్గమైన "సత్నమీ" తెగకు చెందిన గురుబాలదాస్, కుశ్వంత్ సాహెబ్ లను పార్టీలోకి చేర్చుకుంది. వారివల్ల కొంత మేలు జరగవచ్చని భావిస్తోంది. క్షత్రియుల ఓట్లను ఆకట్టుకునేందుకు సర్గూజా రాజకుటుంబానికి చెందిన టీఎస్ సింగ్ దేవ్ ను బుజ్జగించింది. సర్గూజా ప్రాంతంలో 14 స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలోని అంబికాపూర్ స్థానాన్ని సింగ్ దేవ్ కు కేటాయించింది. అంతర్గతంగా విభేదాలు పార్టీని వీడలేదు. పీసీసీ చీఫ్ భూపేశ్ బగల్, సీఎల్పీ నాయకుడు భక్త చరణ్, సింగ్ దేవ్ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. అవసరమైతే అజిత్ జోగీ సాయంతో పీఠాన్ని ఎక్కవచ్చన్న ఆలోచన లేకపోలేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టీ అజిత్ జోగీపైనే ఉంది. ఆయన చీల్చే ఓట్లు ఎవరికి గండి కొడతాయోనన్న ఆందోళన బీజేపీ, కాంగ్రెస్ లో ఉంది. ఆయన మాయావతి పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. బీఎస్పీ 52, జోగీ పార్టీ 35, సీపీఐ మూడు స్థానాల్లో పోటీ చేశాయి. 2008, 2013 ఎన్నికలలో బీఎస్పీ వరుసగా 14.14, 8.92 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు రెండు పార్టీలు కలవడం ఎక్కువ నష్టం బీజేపీకా? లేక కాంగ్రెస్ కా? అన్నది అర్థంకాని విషయం. రాష్ట్రంలో కాంగ్రెస్ కు మొదటి నుంచి పెద్దదిక్కుగా ఉన్న తనను కాంగ్రెస్ అవమానకర రీతిలో బహిష‌్కరించదన్న ఆవేదన ఆయనలో ఉంది. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ ను పల్లెత్తు మాట అనడం లేదు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే హస్తం మద్దతుతో ముఖ్యమంత్రి కావచ్చన్నది జోగీ ఆశ. బీజేపీతో కలసే ప్రసక్తి లేదని చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్, జోగీ మధ్య రహస్య అవగాహన ఉందన్న వాదన వినపడుతోంది. ఒక విష‍యంలో మాత్రం స్పష్టమైన అవగాహన ఉంది. అది కమలం పార్టీని గద్దె దించడంలో పట్టుదలగా ఉన్నాయి. కమలాన్ని అడ్డుకోవడమే ఇద్దరి లక్ష్యం. ఇది కమలానికి జీర్ణం కావడం లేదు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News