జ‌గ‌న్ కు దగ్గరగా మాజీ ఐఏఎస్‌.. త్వర‌లో వైసీపీ గూటికి..?

మాజీ ఐఏఎస్ అధికారి రామాంజ‌నేయుల‌ది, దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డిది అవినాభావ సంబంధం. వైఎస్ ప్రభుత్వంలో ఆయ‌న ఓ కీల‌క అధికారిగా ప్రభుత్వంలో చ‌క్రం తిప్పేవారు. [more]

Update: 2021-03-03 13:30 GMT

మాజీ ఐఏఎస్ అధికారి రామాంజ‌నేయుల‌ది, దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డిది అవినాభావ సంబంధం. వైఎస్ ప్రభుత్వంలో ఆయ‌న ఓ కీల‌క అధికారిగా ప్రభుత్వంలో చ‌క్రం తిప్పేవారు. ఆ మాట‌కు వస్తే క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన ఆయన ఏ ముఖ్యమంత్రి ద‌గ్గర ప‌నిచేసినా కూడా చాక‌చ‌క్యంగా వ్యవ‌హ‌రిస్తూ వారితో క‌లిసి పోయేవారు. రాజ‌కీయంగా అటు వైఎస్ ఫ్యామిలీతోనూ.. ఇటు చంద్రబాబుతోనూ క‌లిసి ప‌నిచేసిన నేర్పరి ఆయ‌న‌. 2009లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీల‌క అధికారిగా ఉంటూనే త‌న అల్లుడికి డీ. శ్రీనివాస్ ద్వారా చ‌క్రం తిప్పి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌లపూడి సీటు ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో రాజేష్ చిన్న వ‌య‌స్సులోనే ఎమ్మెల్యే అయ్యారు.

చంద్రబాబు వద్ద కూడా….

త‌ర్వాత రాజేష్ జ‌గ‌న్‌కు ద‌గ్గరై 2014 ఎన్నిక‌ల్లో త‌న భార్య మ‌ద్దాల దేవీప్రియ‌కు వైసీపీ టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఈ రెండు సార్లు కూడా రామాంజ‌నేయులు అల్లుడు, కుమార్తెకు కాంగ్రెస్‌, వైసీపీ టిక్కెట్లు రావ‌డం వెన‌క ఆయ‌నే చ‌క్రం తిప్పార‌ని చెప్పక త‌ప్పదు. అలా వైఎస్ ఫ్యామిలీతో ఎంతో అనుబంధం పెన‌వేసుకున్న ఆయ‌న ఇటు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా కీల‌క అధికారిగా వ్యవ‌హారాలు చ‌క్కపెట్టారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరిన ఆయ‌న్ను చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేయించాల‌ని నిర్ణయం తీసుకున్నారు.

కోడుమూరు సీటు ఇచ్చినా…

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, ప్రకాశం జిల్లా సంత‌నూత‌ల‌పాడు ప‌లు పేర్లు ప‌రిశీలించి.. చివ‌రకు రామాంజ‌నేయులు సొంత జిల్లా క‌డ‌ప‌లోని కోడుమూరు సీటు ఇచ్చారు. వైసీపీ ప్రభంజ‌నంలో రామాంజ‌నేయులు అక్కడ డాక్టర్ సుధాక‌ర్ చేతిలో ఘోరంగా ఓడిపోవాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని… ఇటు పార్టీని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. అప్పుడ‌ప్పుడు టీవీ చ‌ర్చల్లో మాత్రం చంద్రబాబుకు బాస‌ట‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. అయితే రాజ‌కీయంగా రాణించాల‌న్న ఆస‌క్తితో ఉన్న ఆయ‌న ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల నాటికి….

ఆయ‌న కుమారుడు, కుమార్తె వైసీపీలో ఉన్నా యాక్టివ్‌గా లేర‌న్న కార‌ణంతోనే జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడి సీటు ఇవ్వలేదు. తాజా అప్‌డేట్ ప్రకారం రామాంజ‌నేయులు ప్రస్తుతం జ‌గ‌న్ కు దగ్గరగా ఉన్నట్టు తెలుస్తోంది. త్వర‌లోనే ఆయ‌న వైసీపీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ నుంచే పోటీ చేస్తార‌ని టాక్ ? క‌ర్నూలు జిల్లాలో ఉన్న రెండు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఆర్థర్‌, డాక్టర్ సుధాక‌ర్ ఇద్దరూ వ‌ర్గపోరుతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. వీరి ప‌ట్ల స్థానిక నేత‌లు.. అటు పార్టీ కూడా సంతృప్తిగా లేదు.

వైసీపీ నేతలకు టచ్ లో….

వీరికంటే కూడా ఉన్నత విద్యావంతుడు, ఐఏఎస్ ఆఫీస‌ర్ అయిన ఆయ‌న చ‌ట్టస‌భ‌ల్లో ఉంటే.. అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ప్లస్ అవుతుంద‌నే జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. అందుకే జ‌గ‌న్ సూచ‌న‌ల మేర‌కు నేరుగానే పార్టీ పెద్దలు ఆయ‌న‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలిసింది. ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకునే రోజు… క‌ర్నూలు రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యే రోజు ద‌గ్గర్లోనే ఉందంటున్నారు. టీడీపీలో ప్లాప్ అయిన ఆయ‌న పొలిటిక‌ల్ షో వైసీపీలో ఎలా ? ఉంటుందో ? చూడాలి.

Tags:    

Similar News