ఇలాంటి నేత ఎక్కడ?

Update: 2018-04-05 16:30 GMT

రామకృష్ణ హెగ్డే..... కర్ణాటక రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయిన నాయకుడు. నైతిక విలువలకు పట్టం కట్టిన నాయకుడు. ఎమ్మెల్యేగా, మూడు సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా సుదీర్ఘ అనుభవజ్ఞుడు. తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఒక్కలింగ, లింగాయత్ వంటి బమైన సామాజిక వర్గాలను కాదని ముఖ్యమంత్రిగా ఎన్నికైన బ్రాహ్మణ నాయకుడు. కన్నడనాడుకు సత్పరిపాలన అందించి తద్వారా ప్రజల మనసుల్లో నిలిచి పోయిన నేత. రాజకీయ నాయకుడిగా హెగ్డేలోని వివిధ కోణాలను విశ్లేషిస్తే ఆయన గొప్పదనం, నీతి, నిజాయితీ, నైతికత, సమర్థత స్పష్టంగా వెల్లడవుతాయి. కర్టాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రామకృష్ణ హెగ్డేపై ‘‘తెలుగు పోస్ట్’’ ప్రత్యేక కథనం.

ఆరు సార్లు ఎమ్మెల్యేగా.....

1926 ఆగస్టు 29న ఉత్తర కన్నడ జిల్లా సిద్ధపురలో జన్మించిన హెగ్డే వారణాసిలో ఉన్నతవిద్యను అభ్యసించారు. అనంతరం అలహాబాద్ లో న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్న అనంతరం ఆయన దృష్టి రాజకీయాల వైపునకు మళ్లింది. 1957, 1962, 1967, 1983, 1985, 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆరు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడమే ఆయనకు గల ప్రజాదరణకు నిదర్శనం. 1978-83లో, 1996-2002 మధ్య కాలంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1998-99లో వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం హెగ్డే సొంతం. అంతకు ముందు వీపీసింగ్ హయాంలో ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. తద్వారా జాతీయ రాజకీయాల్లో రాణించారు.

ఎన్నో రికార్డులు....రాజీనామాలు....

శాసనసభ్యుడిగా ప్రజాదరణ పొందిన హెగ్డే ఎస్. నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్ మంత్రి వర్గాల్లో వివిధ కీలక శాఖలను నిర్వహించారు. అనంతరం 1983లో జనతా పార్టీ తరుపున పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. నాటి ఎన్నికల్లో జనతా పార్టీ ఏకైక అతి పెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ, లెఫ్ట్, స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర సారధిగా జనరంజక పాలన అందించారు. 1984 అక్టోబరు 31న నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం అదే ఏడాది డిసెంబరులో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇందిర హత్యతో ఏర్పడిన సానుభూతి కారణంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఇందుకు కర్ణాటక కూడా మినహాయింపు కాదు. నాటి ఎన్నికల్లో మొత్తం 28 లోక్ సభ స్థానాలకు గాను జనతా పార్టీ కేవలం 4 స్థానాల్లోనే గెలిచింది. మిగిలిన వన్నీ హస్తం పార్టీ వశమయ్యాయి. దీంతో ఖిన్నుడైన రామకృష్ణ హెగ్డే పదవికి రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలను తన పాలనపై రిఫరెండంగా భావించి పదవిని వదులుకున్నారు. ఎందరు ఎంతగా వారించినా వినలేదు. మళ్లీ ప్రజల మద్దతు కోరారు. సాధారణంగా సగటు రాజకీయ నాయకులు ఇలాంటి పనులు చేయరు. కాని హెగ్డే సాహసం చేశారు. అనుకున్నట్లుగా 1985లో జరిగిన అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఈసారి సంపూర్ణ మెజారిటీతో హెగ్డే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం గమనార్హం. 1983 నుంచి 1988 వరకూ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు రామకృష్ణ హెగ్డే.

లోకాయుక్త ను తెచ్చి.....

ముఖ్యమంత్రిగా హెగ్డే అనేక ఆటు పోట్లను ఎదుర్కొన్నారు. సారా బాట్లింగ్ కుంభకోణంలో రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో 1986 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. మూడు రోజుల అనంతరం మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. చివరికి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో 1988లో రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం ముగిసింది. తన హయాంలో మెరుగైన పాలనను అందించారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ సంస్థలకు నిధులు,అధికారాలు కల్పించి వాటి బలోపేతానికి కృషి చేశారు. ప్రభుత్వ పాలనలో అవినీతిని అంతమొందించేందుకు, అధికార యంత్రాంగాన్ని ప్రజలకు జవాబుదారీగా మార్చేందుకు 1984లో కీలకమైన లోకాయుక్త చట్టాన్ని తీసుకువచ్చాడు. లోకాయుక్త పరిధిలో ముఖ్యమంత్రిని కూడా చేర్చారు. దేశంలోని లోకాయుక్త చట్టాల కన్నా కర్ణాటక లోకాయుక్త చట్టం అత్యంత కీలకమైనది. ఈ అధికారాల ఫలితంగానే 2012లో అప్పటి కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే మైనింగ్ కుంభకోణాన్ని వెలుగులోకి తేవడంతో రాష్ట్ర మంత్రిగా గాలి జనార్థన్ రెడ్డి, ముఖ్యమంత్రి యడ్యూరప్ప జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి....

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో హెగ్డే ఎంతోమందికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు. ఒకప్పటి మంత్రులు జీవరాజ్ ఆల్వా, అబ్దుల్ సమద్ సిద్ధిఖి, ఎంపీ ప్రకాశ్, పి.బి.ఆర్. సింథియా, ఆర్.యూ. దేశ్ పాండే ఆయన శిష్యులే. వీరిలో జీవరాజ్ ఆల్వా హెగ్డేకు మద్దతుగా నిలిచారు. ముఖ్యమంత్రి పదవి అనంతరం ఆయన దృష్టి కేంద్ర రాజకీయాల వైపు మళ్లింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. తర్వాత రాజకీయంగా బలహీన పడ్డారు. అనారోగ్య కారణాలుతో 2004 జనవరి 12న కన్నుమూసిన ఈ కన్నడ నాయకుడు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేశారని చెప్పకతప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News