గేరు మార్చిన అబ్బాయ్.. బాబాయ్… ?

ఎన్నికల ముందు అంటే 2019 టైమ్ లో శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబంలో కలతలు మొదలయ్యాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఎందుకంటే దిగ్గజ నేత ఎర్రన్నాయుడు అసలైన [more]

Update: 2021-10-02 06:30 GMT

ఎన్నికల ముందు అంటే 2019 టైమ్ లో శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబంలో కలతలు మొదలయ్యాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఎందుకంటే దిగ్గజ నేత ఎర్రన్నాయుడు అసలైన రాజకీయ వారసుడు రామ్మోహననాయుడు మాత్రమేనని ఆయన అభిమానులు నాడు గట్టిగా సౌండ్ చేశారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా డిమాండ్ వచ్చింది. ఇక స్వయంగా ఎర్రన్నాయుడు సతీమణి కూడా రామ్మోహననాయుడు కి అసెంబ్లీ టికెట్ ఇవ్వమని అధినాయకుడు చంద్రబాబుని కోరినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు మాత్రం అచ్చెన్నాయుడు తన పక్కన ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఆయన్ని టెక్కలి నుంచి పోటీ చేయించారు. శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహననాయుడు ని దింపారు. ఇద్దరూ గెలిచారు, కానీ టీడీపీ ఓడింది. ఈ మధ్యలో అబ్బాయ్ ఫుల్ సైలెంట్ అయ్యారు, బాబాయ్ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయినా కూడా కొన్ని రాజకీయ కారణాల వల్ల తగ్గి ఉంటున్నారు.

ఒక్కటిగా ముందుకు…

తిరుపతి బై పోల్ తరువాత లీక్ అయిన ఒక వీడియో తరువాత అచ్చెన్నాయుడు మీద హై కమాండ్ అనుమానంతో ఉందని, దాంతో ఆయన ప్రాధాన్యత తగ్గించిందని కూడా చెప్పుకున్నారు. అచ్చెన్నాయుడు కూడా ఉంటే విశాఖ, లేకుంటే నిమ్మాడ అన్నట్లుగానే ఆ మధ్య దాకా కధ నడిపారు. అదే సమయంలో అబ్బాయ్, బాబాయ్ కూడా అంత సామరస్యంగా ఉన్నట్లుగా కనిపించలేదు. దీంతో క్యాడర్ కూడా నీరసంగా ఉండిపోయింది. అయితే ఈ మధ్యన ఏం జరిగిందో తెలియదు కానీ బాబాయ్ అబ్బాయ్ ఒక్కటిగా చేతులు కదిపారు. పెట్రో ధరల పెంపుతో సహా ఈ మధ్య జరిగిన ప్రతీ ఆందోళనలో ఇద్దరూ కలసి ముందుండి క్యాడర్ కి కొత్త జోష్ తీసుకుని వచ్చారు. అంతే కాదు ఆవేశంతో అచ్చెన్న, రామ్మోహననాయుడు జగన్ సర్కార్ మీద పేల్చిన సెటైర్లు కూడా తమ్ముళ్లకు ఎక్కడ లేని హుషార్ ని తీసుకువచ్చాయి.

పంతం పట్టారుట ….

బస్తీ మే సవాల్, ఈసారి పదికి పది ఎమ్మెల్యే సీట్లు టీడీపీవే అంటున్నారు బాబాయ్, అబ్బాయ్. తాము తలచుకుంటే అది జరిగి తీరుతుందని కూడా చెబుతున్నారు. శ్రీకాకుళంలో మొత్తానికి మొత్తం సీట్లు ఊడ్చి మరీ చంద్రబాబుకు కానుకగా ఇస్తామని కూడా ఈ ఇద్దరు నేతలు చెబుతున్నారు. వైసీపీకి మళ్ళీ గెలిచే చాన్స్ ఇవ్వమని శపధం చేస్తున్నారు. ఉత్తరాంధ్రాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో పూర్వ వైభవం తీసుకువస్తామని కూడా రామ్మోహననాయుడు చెబుతున్నారు. మొత్తానికి బాబాయ్ అబ్బాయ్ గేర్ మార్చడంతో తమ్ముళ్ళతో పాటు అధినాయకత్వం కూడా సంతోషిస్తోంది. కింజరాపు ఫ్యామిలీ పట్టుపడితే టీడీపీకి గెలుపు బాటేనని కూడా అంటున్నారు.

అదే సీక్రెట్…

ఇంతకీ బాబాయ్, అబ్బాయ్ కలసి ముందుకు దూకడానికి కారణాలు ఉన్నాయట. ఈ ఇద్దరు వేరుగా ఉంటే నష్టపోవడం ఖాయం. అంతే కాదు, జిల్లా టీడీపీలో కొత్త నాయకులు కొత్త రాజకీయం కూడా కనిపిస్తోంది. కింజరాపు ఫ్యామిలీ ఐక్యంగా ఉంటేనే తమ చేతులలో పార్టీ ఉంటుంది అన్నది కూడా వారు గ్రహించారు అంటున్నారు. ఇక బాబాయ్ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. ఆయన సారధ్యంలో శ్రీకాకుళంలో పార్టీ విజయం సాధించకపోతే మొత్తం కుటుంబానికే తలవంపులు అని ఎంపీ రామ్మోహననాయుడు భావిస్తున్నారుట. అలాగే అబ్బాయ్ కి ఎంతో ఫ్యూచర్ ఉందని, ఆయనను ముందుకు నడిపించాలని కూడా బాబాయ్ పెద్దగా అనుకోవడంతోనే ఈ ఇద్దరూ చేతులు కలిపారని అంటున్నారు. మొత్తానికి కింజరాపు ఫ్యామిలీ స్ట్రాంగ్ గా మారి ముందుకు వస్తే అది వైసీపీనే కాదు, జిల్లా టీడీపీ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది అంటున్నారు. పార్టీలో ఈ ఫ్యామిలీ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా తాజా పరిణామలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Tags:    

Similar News