టీడీపీ తుర‌ుపుముక్కకు జ‌గ‌న్ క్యాస్ట్ మార్క్ చెక్ ?

ఏపీలో గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్రభంజ‌నాన్ని త‌ట్టుకుని టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు విజయం సాధించారు. ఈ సంక్లిష్ట ప‌రిస్థితుల్లో కూడా ముగ్గురు ఎంపీలు వైసీపీకి [more]

Update: 2021-06-10 00:30 GMT

ఏపీలో గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్రభంజ‌నాన్ని త‌ట్టుకుని టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు విజయం సాధించారు. ఈ సంక్లిష్ట ప‌రిస్థితుల్లో కూడా ముగ్గురు ఎంపీలు వైసీపీకి ఉన్న 30 మంది ఎంపీల‌ను త‌ట్టుకుని త‌మ వంతు పోరాటం చేస్తున్నారు. టీడీపీ కంచుకోట‌లు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు, ఆ పార్టీ కీల‌క నేత‌ల ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని ఒక్కో కొమ్మ న‌రుక్కుంటూ వ‌స్తోన్న సీఎం జ‌గ‌న్ శ్రీకాకుళంలో టీడీపీ యువ‌కెర‌టం, ఆ పార్టీ త‌ర‌పుముక్క కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడుకు కూడా చెక్ పెట్టే ప‌ని ప్రారంభించిన‌ట్టే తెలుస్తోంది.

పార్టీల కతీతంగా..?

రామ్మోహ‌న్ నాయుడు టీడీపీ ఎంపీ అయినా పార్టీల‌కు అతీతంగా, ప్రాంతాల‌కు అతీతంగా క్రేజ్ ఉంది. తండ్రి దివంగ‌త మాజీ కేంద్ర మంత్రి కింజార‌పు ఎర్ర‌న్నాయుడు రాజ‌కీయ వార‌సుడిగా వ‌చ్చిన ఆయ‌న చిన్న వ‌య‌స్సులోనే రెండు సార్లు ఎంపీగా విజ‌యం సాధించారు. పార్టీ పునాదులు కూక‌టివేళ్ల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చినా గ‌త ఎన్నిక‌ల్లో ఆ ఫ్యామిలీ నుంచి ముగ్గురు విజ‌యం సాధించ‌డం రికార్డే. ముఖ్యంగా పార్లమెంటులోనూ, బ‌య‌టా రామ్మోహ‌న్ నాయుడు ప‌దునైన పంచ్‌లు, బ‌ల‌గ‌మైన వాగ్దాటితో వైసీపీపై చేసే విమ‌ర్శ‌ల‌కు సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి కూడా అదిరిపోయే రెస్సాన్స్ ఉంటుంది.

సరైన నేత కోసం….?

బ‌య‌ట ప‌డ‌రు కాని.. టీడీపీలో మిగిలిన వారి కంటే రామ్మోహ‌న్ నాయుడును అభిమానించే వైసీపీ నేత‌లు కూడా ఎక్కువ మందే ఉంటారు. జ‌గ‌న్ ముఖ్యమంత్రి అయిన‌ప్పటి నుంచి ఇక్కడ స‌రైన నేత కోసం వేట ప్రారంభించారు. వాస్తవంగా చూస్తే జిల్లాలో కాళింగ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌. ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్‌కు గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీ సీటు ఇవ్వగా ఆయ‌న ఓడిపోయారు. అయితే అచ్చెన్న దూకుడుకు చెక్ పెట్టేందుకు దువ్వాడ‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మ‌రీ టెక్కలి బాధ్య‌త‌లు ఇచ్చారు. కాళింగ సామాజిక వ‌ర్గంలో యువ‌తలో దువ్వాడ అంటే క్రేజ్ ఉంది.

రెండు సార్లు ఓడిన…

2014 ఎన్నికల్లో దువ్వాడ టెక్కలిలో పోటీ చేసి అచ్చెన్నాయుడు మీద ఓడిపోయారు. 2019లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో రామ్మోహన్ నాయుడు మీద ఓడిపోయారు. బాబాయ్‌, అబ్బాయ్ మీద రెండు సార్లు ఓడిన దువ్వాడ‌ను జ‌గ‌న్ కేవ‌లం టెక్క‌లి మీదే కాన్‌సంట్రేష‌న్ చేయ‌మ‌ని సీరియ‌స్‌గా ఆదేశాలు ఇచ్చేశారు. ఇక ఇప్పుడురామ్మోహ‌న్ నాయుడును ఢీకొట్టేందుకు అదే కాళింగ వ‌ర్గం నుంచి స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం త‌న‌యుడు చిరంజీవి నాగ్‌ను బాగా ఎంక‌రేజ్ చేస్తోన్న ప‌రిస్థితి.

దూకుడు పెంచి…?

గ‌త యేడాదే నాగ్‌కు రామ్మోహ‌న్ నాయుడిలా చురుకుగా ఉండ‌డంతో పాటు ప్రజ‌ల్లో ఉండాల‌ని సూచ‌న‌లు చేయ‌గా.. నాగ్ ఎక్కువుగా ఆముదాల‌వ‌ల‌స మీదే దృష్టి పెడుతూ వ‌చ్చారు. ఇక ఇప్పుడు శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గంతో పాటు పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌పై కూడా దృష్టి పెడుతున్నారు. పార్టీ అధిష్టానం సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీగా ఉండాల‌ని నాగ్‌కే సంకేతాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా నాగ్ రామ్మోహ‌న్ నాయుడుపై తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు. క‌రోనా వేళ ప్రభుత్వం ప్రజ‌ల కోసం ఎన్నో కార్యక్ర‌మాలు చేస్తుంటే.. ఎక్కడో కూర్చొని మాట్లాడ‌డం కాద‌ని.. శ్రీకాకుళం రావాల‌ని రాముకు స‌వాల్ విసిరారు. క్రమ‌క్రమంగా నాగ్ దూకుడు పెంచుతున్నారు. మ‌రి జ‌గ‌న్ రామూను ఓడించేందుకు న‌మ్ముకున్న కాళింగ అస్త్రం మ‌రోసారి ఫెయిల్ అవుతుందా ? లేదా ఈ సారి స‌క్సెస్ అవుతుందా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News