రాక్షసుడు మూవీ రివ్యూ

బ్యానర్: ఏ స్టూడియో నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, శరవణన్, అమ్ము అభిరామి, తనికెళ్ళ భరణి, బేబీ దువా కౌశిక్ తదితరులు [more]

Update: 2019-08-02 08:32 GMT

బ్యానర్: ఏ స్టూడియో
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, శరవణన్, అమ్ము అభిరామి, తనికెళ్ళ భరణి, బేబీ దువా కౌశిక్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి.దిలీప్
ఎడిటింగ్: అమర్ రెడ్డి
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
దర్శకుడు: రమేష్ వర్మ

టాలీవుడ్ రిచ్ కిడ్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను అంటూ టాప్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా టాలీవుడ్ కి హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ సినిమాలో అల్లుడు శీను అంటూ అతలాకుతలం చేసిన శ్రీనివాస్, తర్వాత చిన్న సినిమానే చేసాడు. ఆ తర్వాత జయ జానకి నాయక అంటూ భారీ బడ్జెట్ తో టాప్ హీరోయిన్ రకుల్ తో కలిసి నటించాడు. ఆ సినిమా కూడా అంతంత మాత్రమే. ఇక తరవాత సాక్ష్యం, కవచం ప్లాప్ అయ్యాయి. ఇక మొన్నీమధ్యన కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో సీత సినిమాలో నటించాడు. మరదల్ని అనుక్షణం కాపాడుకుంటూ.. అమాయకమైన పాత్రలో కనిపించే కుర్రాడిగా కాజల్ డామినేషన్ ముందు తేలిపోయే పాత్రలో నటించాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్. అందుకే ఈసారి బెల్లంకొండ సేఫ్ గేమ్ ఆడాడు. అది కూడా కోలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కి సూపర్ హిట్ అయిన రచ్చసన్ మూవీని తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టాలనుకున్నాడు. ఎలాగూ రీమేక్, బడ్జెట్ అంతంత మాత్రం. అందుకే ప్లాప్ డైరెక్టర్ రమేష్ వర్మని దర్శకత్వానికి తీసుకుని ఆ సినిమాని రాక్షసుడు గా రీమేక్ చేసాడు శ్రీనివాస్. ఇక తమిళనాట సూపర్ హిట్ అవడం, ఆ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో వీక్షించిన ప్రేక్షకులు తెలుగులో బెల్లంకొండ ఎలా చేసాడో అనే ఆసక్తి క్రియేట్ కావడం, అలాగే రాక్షసుడు ట్రైలర్ కూడా సస్పెన్స్ తో అందరిలో ఇంట్రెస్ట్ కలిగించడంతో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరి కోలీవుడ్ లో వచ్చిన రచ్చసన్ సినిమాల యాజిటీజ్ గా ఈ సినిమా రీమేక్ చేసారా? లేదంటే చెడగొట్టారా? ఇక ఈ సేఫ్ గేమ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ గట్టెక్కడా? లేదా మునుపుటిలా యావరేజ్ తోనే సర్దుకుపోయాడా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ఒక ఊరిలో స్కూల్ లో చదివే తొమ్మిది, పదో తరగతి అమ్మాయిలు అదృశ్యమవడమే కాదు… వారు కొన్ని రోజుల తర్వాత భయానకమైన విగత జీవులుగా కనబడతారు. అయితే అలా అమ్మాయిల కిడ్నాప్ అవుతున్నప్పుడు వాళ్ళని పట్టుకోవాలని పోలీస్ లు కూడా సకలప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అర్జున్ కుమార్ (బెల్లంకొండ శ్రీనివాస్) సినిమాలకు దర్శకత్వం వహించాలని కలతో పత్రికల్లో వచ్చే సస్పెన్స్ మర్డర్స్ ఉన్న పేపర్ కటింగ్స్ ని గోడ మీద అతికించుకుని కథ రాసుకుని… ఆ కథ తీసుకుని హీరోల చుట్టూ తిరిగినా అతనికి ఒక్క ఛాన్స్ కూడా రాదు. ఈలోపు అక్క భర్త (రాజీవ్ కనకాల) పోలీస్ గా ట్రై చేయమంటే కుటుంబం మాట కాదనలేక హీరో పోలీస్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడం ఉద్యోగం రావడం జరుగుతాయి. అయిష్టంగానే పోలీస్ ఉద్యోగంలో చేసిన హీరో కి ఈ అమ్మయిల కిడ్నాప్ కేసు సవాల్ గా మరుతుంది. కానీ అర్జున్ సుపీరియర్ మాత్రం అతను ఆ కిడ్నాప్ కేసు శోధించే క్రమంలో… అర్జున్ మీద ఎలాంటి నమ్మకం ఉంచరు . అర్జున్ కేసుని సాల్వ్ చేసే పద్దతి ఆమెకి నచ్చదు. కానీ అర్జున్ కుమార్ ఆ హత్యల వెనక ఎవరున్నారో కనిపెట్టాలనుకుంటాడు. కృష్ణవేణి(అనుపమ పరమేశ్వరన్) టీచర్ గా పని చేసే స్కూల్ లో ఒక అమ్మాయి కూడా కూడా ఇలాగే మిస్సవుతుంది. ఆ కేసు లో భాగం గా అర్జున్ కి స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న కృష్ణవేణి పరిచయమవుతుంది. వారి పరిచయం ప్రేమగా మరే క్రమంలో అర్జున్ మేనకోడలు కూడా కిడ్నాప్ అవడమే కాదు….. రెండు రోజుల్లో శవమై వాళ్ళ కారు డిక్కిలోనే తేలుతుంది. మరి ఈ అమ్మాయిలను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? అసలీ అమ్మాయిల కిడ్నాప్ కి అసలు కారణాలేమిటి? అసలు అర్జున్, కృష్ణవేణి పెళ్లి చేసుకుంటారా? ఆ కిడ్నాప్ వ్యవహారాన్ని అర్జున్ ఎలా సాల్వ్ చేసాడు? అసలు అర్జున్ మీద అతని సుపీరియర్ కి ఎందుకంత కోపం? అనేది రాక్షసుడు మిగతా కథ.

నటీనటుల నటన:

బెల్లంకొండ శ్రీనివాస్ నటన పరంగా సినిమా సినిమాకి చాలా వేరియేషన్స్ చూపిస్తున్నాడు. అతనిలో ఉన్న ఒక్క మైనస్ డైలాగ్ డెలివరీ. మాస్ గా చెప్పాల్సిన పవర్ ఫుల్ డైలాగ్ బెల్లకొండ అంత పవర్ ఫుల్ గా చెప్పలేడు. అంతేకాని అతని నటన మాత్రం సినిమా సినిమాకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఈ సినిమాలో కాప్ గా పోలీస్ ఆఫీసర్ గా మంచి బాడీ తో అలరించాడు. లుక్ లో కొత్తదనం లేకపోయినా.. సైకో కిల్లర్ ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా, మేనకోడలు కోల్పోయిన మావయ్యగా బెల్లంకొండ నటన బావుంది. ఇక బావ రాజీవ్ కనకలతో తో వచ్చే కొన్ని సీన్స్ లో బెల్లంకొండ ఎమోషనల్ గా టచ్ చేసాడు. ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎప్పటిలాగే చక్కటి నటన, సింపుల్ లుక్స్ తో టీచర్ గా ఆకట్టుకుంది. రాజీవ్ కనకాల ఉన్నంతలో బాగా నటించాడు. ఇక మిగతా వారు చాలావరకు తమిళనా నటులే. వారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ:

తమిళంలో మంచి హిట్ కొట్టిన రచ్చసన్ సినిమాని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు అంటే… అమెజాన్ ప్రైమ్ లో తమిళ వెర్షన్ ని చూసేసిన ప్రేక్షకులు తెలుగులో ఎలా తీస్తారో? మాతృకాని చెడగొడతారో? ఆ తమిళ ఫీల్ తెలుగుకి వస్తుందో రాదో ? అని అనేక సందేహాలు అందరిలో తలెత్తాయి. కానీ దర్శకుడు రమేష్ వర్మ మాత్రం తమిళ మాతృకని యాజిటీజ్ గా తెలుగులో కాపీ పేస్ట్ చేసాడు. తమిళ వెర్షన్ ని ఎక్కడా చెడగొట్టలేదు. ఫ్రేమ్ టు ఫ్రేమ్.. షాట్ టు షాట్.. రాక్షసన్ ని తెలుగు రాక్షసుడు ఫాలో అయిపోయాడు. అంతే కాదు తమిళ రచ్చసన్ లోని కొన్ని సీన్లను యథాతథంగా తెలుగు రాక్షసుడు కి వాడేసుకున్నారు కూడా. ట్విస్ట్ లకు ట్విస్ట్ లు క్రైం కి క్రైం అన్ని మెప్పించేవిలా వున్నాయి. అసలు తమిళ రచ్చసన్ ని పక్కన పెట్టి గనక చూస్తే రాక్షసుడు మాత్రం ఓ వెర్షన్ ప్రేక్షకులను మాత్రం బాగా మెప్పించే సినిమా. అమ్మాయిల కిడ్నప్, వారి హత్యలు ఇవన్నీ ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరనే విషయాన్ని విషయాన్ని రివీల్ చేయడానికి ముందు వచ్చే మలుపులు మాత్రం తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తాయి. తర్వాత ఏమవుతుంది అనుకుంటూ కుర్చిలకు ఆతుక్కుపోయి మరీ ఈ సినిమాలో ప్రేక్షకుడు లీనమయ్యేలా ఉంటుంది కథ. నిజంగా బెల్లంకొండ చెప్పినట్టుగా ఈ సినిమాకి హీరో కథే. కథ, కథనాలు బలం. ఇక ఈ సినిమాకి మెయిన్ బలం స్క్రీన్ ప్లే. గ్రేసీ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఉత్కంఠకి గురి చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా అమ్మాయిలు కిడ్నప్ హత్యలు చుట్టూ తిరిగితే… సెకండ్ హాఫ్ అంతా ఆ అమ్మాయిల కిడ్నప్ కి కారణం, సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక తమిళ వెర్షన్ చూడని ప్రేక్షకులకు ఈ రాక్షసుడు ఆకట్టుకోవడం మాత్రం పక్కా. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారి ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టినట్లే కనబడుతుంది.

సాంకేతికంగా…..

సాంకేతికంగా ఈ సినిమాకి మెయిన్ హైలెట్ జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అమ్మాయిల కిడ్నాప్ సీన్స్ లో జిబ్రాన్ నేపధ్య సంగీతమే బలం. ఇలాంటి హర్రర్, క్రైం థ్రిల్లర్ సినిమాలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పొయ్యాలి. ఇక్కడ రాక్షసుడు సినిమాకి అంతే జరిగింది. చాలా సీన్స్ లో జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకే మెయిన్ హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం స్క్రీన్‌ప్లే. రేసీ స్క్రీన్‌ప్లే‌తో ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పొందేలా చేశారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ స్క్రీన్ ప్లే కు తగ్గట్టుగా సహజంగా బాగుంటుంది. స్కూల్ సీన్స్ ని అందంగా చూపెట్టారు.

ప్లస్ పాయింట్స్: కథ, స్క్రీన్ ప్లే, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, బలమైన పాత్రలు

నెగెటివ్ పాయింట్స్: కమర్షిల్ ఎలెమెంట్స్ లేకపోవడం, నిడివి

రేటింగ్: 2.75/5

Tags:    

Similar News