ఇవ్వనంటే వారికి కోపం… ఇస్తామంటే వీరికి?

మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలున్నాయి. ఈలోగా రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్న పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు ఇది కష్టంతో కూడుకున్న పనే. [more]

Update: 2020-03-03 18:29 GMT

మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలున్నాయి. ఈలోగా రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్న పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు ఇది కష్టంతో కూడుకున్న పనే. ఆశావహులు ఎక్కువగా ఉండటం, అసంతృప్తులు ఎక్కువ మంది అయితే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుందన్న భయం అన్నాడీఎంకేలో లేకపోలేదు. అందుకే ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.

రాజ్యసభ ఎన్నికల్లో….

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. తమిళనాడులో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయితే సభ్యుల సంఖ్యాబలం ప్రకారం అధికార అన్నాడీఎంకేకు మూడు, ప్రతిపక్ష డీఎంకేకు మూడు స్థానాలు లభిస్తాయి. అయితే పదవుల పంపకంలో అన్నాడీఎంకేలోనే కొంత ఇబ్బంది వాతావరణం ఉంంది. అన్నాడీఎంకేకు చెందిన కె.సెల్వరాజ్, ఎస్. ముత్తుకరుప్పన్, విజులా సత్యానంద్, శశికళ పుష్ప రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. అలాగే డీఎంకే నుంచి తిరుచ్చి శివ, టీకే రంగరాజన్ లు కూడా రిటైర్ అవుతున్నారు.

మూడు పదవుల్లో…..

మొత్తం ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో అధికార పార్టీకి మూడు మాత్రమే దక్కుతాయి. అయితే అన్నాడీఎంకేలో ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య పంపకాలు జరుగుతాయన్న చర్చ జరుగుతోంది. సీనియర్ నేతలకు అవకాశమివ్వాలని ఇద్దరూ కలసి నిర్ణయించినా మరోవైపు కూటమిలోని పార్టీలు కూడా రాజ్యసభ సీటును ఆశిస్తుండటం ఇబ్బందికరంగా మారింది.

కూటమి పార్టీలు కూడా…..

ఇప్పటికే అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో కరూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరితో పాటు మనోజ్ పాండ్యన్, కేపీ మునుస్వామి, బాలగంగా, జేసీడీ ప్రభాకర్ వంటి వారు కూడా పోటీ పడుతున్నారు. దీనికి తోడు అన్నాడీఎంకే కూటమిలో ఉన్న డీఎండీకే కూడా తమకు రాజ్యసభ స్థానం ఇవ్వాలని పట్టుబడుతోంది. దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పళనిస్వామి చెబుతున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలకు ఇబ్బంది జరగకుండా రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేయడం సవాల్ అని చెప్పక తప్పదు.

Tags:    

Similar News