‘ఐ’క్యతకు అగ్ని పరీక్ష

Update: 2018-07-05 15:30 GMT

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక రానున్న రాజకీయ సమీకరణలకు నాందిగా నిలుస్తోంది. 26 సంవత్సరాలుగా ఏకగ్రీవం ఆనవాయితీగా మారిన పదవికి అత్యంత ఉత్కంఠభరిత సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. బలాబలాలు సమకూర్చుకుని అమీతుమీ తేల్చుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. విపక్ష కూటమి ఐక్యతకు, ఎన్డీఏ ఆధిక్యానికి అగ్నిపరీక్ష పెడుతోంది ఈ ఎన్నిక. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్, వైసీపీలకు ఎటూపాలుపోని రాజకీయ సంకటస్థితికి దారితీస్తోంది. ఏకగ్రీవం చేయడం ద్వారా ఈ తంతు ముగించేయాలనేది అధికార బీజేపీ వ్యూహం. తమకు బలమున్నచోట పరాభవించడం ద్వారా భవిష్యత్తుకు సవాలు విసరాలనేది విపక్షాల యత్నం. ఫలితం ఎలా ఉన్నప్పటికీ సార్వత్రిక చాలెంజ్ గా మారింది. మరో 15 రోజుల్లో వర్షాకాల సమావేశాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. ఈలోపు సమీకరణలు, చర్చలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.

ఎన్నికల ముందు ఏకతా రాగం...

నరేంద్రమోడీ నేత్రుత్వంలోని బీజేపీని ఓడించాలంటే అన్ని పార్టీలు ఒకేతాటిపైకి రావాలనేది స్థూలంగా వచ్చిన అవగాహన. కలివిడిగా అయితేనే పోరాడగలం. విడివిడిగా అయితే ఓటమి ఖాయం అనేది అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఆ కలయికలో అభిజాత్యాలు, ఆధిపత్య ధోరణులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ విషయమే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో విపక్షాల బలాన్ని తక్కువ చేస్తోంది. ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు త్రుణమూల్ కాంగ్రెసు, బిజూ జనతాదళ్ రెండూ డిప్యూటీ ఛైర్మన్ పదవి తమకే కావాలనే పట్టుదలలో ఉన్నాయి. టీఎంసీ తరఫున సుఖేందు శేఖర్రాయ్, బీజేడీ తరఫున ప్రసన్నాచార్య బరిలోకి దిగాలని ఆశిస్తున్నట్లుగా ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఎంసీ తరఫున మమతా బెనర్జీ దాదాపు విపక్షాల్లోని అన్నిపార్టీల మద్దతు కూడగట్టగలిగారు. కాంగ్రెసు,ఎన్సీపీ వంటి పార్టీలూ ఆమె మాటను తోసిపుచ్చలేని పరిస్థితి. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేసిన టీడీపీ అధినేతతోనూ మమతకు మంచి సంబంధాలే ఉన్నాయి. వామపక్షాలు మమత ధోరణిపట్ల వైముఖ్యంతో ఈ ఐక్యతకు గండి కొట్టవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు. బొటాబొటి బలమున్న స్థితిలో వామపక్షాలు కలిసిరాకపోతే మమత అభ్యర్థి గట్టెక్కడం కష్టం. లేకపోతే బిజూజనతాదళ్ కు అది అడ్వాంటేజీగా మారే సూచనలున్నాయి. కాంగ్రెసు, బీజేపీలకు సమ దూరం పాటిస్తున్న బిజూ జనతాదళ్ విపక్ష ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.

కాంగ్రెసు కదనకుతూహలం..

ప్రస్తుతం 243 మంది సభ్యులతో ఉన్న రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ ను నెగ్గించుకోవాలంటే 122 మంది మద్దతు అవసరం. అధికార ఎన్డీఏ కు ఏఐఏడీఎంకేకు చెందిన 14 మంది సభ్యులతో కలిపి 104 మంది మద్దతు ఉంది. రాజ్యసభలో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే మరో 18 స్థానాలు అవసరం. ఈ మద్దతు విపక్షాల నుంచే కూడగట్టాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అదంత సులభసాధ్యంగా కనిపించడం లేదు. సీట్ల పరంగా బీజేపీ 67, కాంగ్రెసు 51 స్థానాలతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఏఐఏడీఎంకే, త్రుణమూల్, సమాజ్ వాదీ 14, 13,13 సీట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీజేడీ 9 స్థానాలు కలిగి ఉంది. టీఆర్ఎస్, టీడీపీకి ఆరేసి సీట్లున్నాయి. వైసీపీకి రెండు సీట్లున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక వంటి సందర్బాల్లో దెబ్బతిన్న కాంగ్రెసు ఈసారి వ్యూహాత్మకంగా తన అభ్యర్థిని పోటీకి పెట్టదలచుకోలేదు. ఎన్డీఏ అభ్యర్థిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వకూడదనే కృతనిశ్చయంతో ఉంది. అందుకోసమే తాను త్యాగానికి సిద్దపడుతోంది. ఎన్డీయేతర పార్టీలను ఒకే ప్లాట్ ఫారం మీదకు తేగలిగితే 2019 సార్వత్రిక ఎన్నికలకు ఐక్య కూటమికి రంగం సిద్దం చేసినట్లవుతుందనే భావనలో ఉంది.

కమలానికి ‘కీ’లకం...

ఏడాది కాల వ్యవధిలో ఎన్నికలు జరగబోతున్నాయి. కీలకమైన బిల్లుల విషయంలో రాజ్యసభ పాత్ర చాలా ముఖ్యమైనది. ఎప్పుడూ అధికారపార్టీ వారే డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికవుతూ వస్తున్నారు. 11 మంది రాజ్యసభ డిప్యూటీ చైర్మన్లలో తొమ్మిది మంది కాంగ్రెసుకు చెందినవారే గతంలో ఎన్నికయ్యారు. అందుకే మెజారిటీకి కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ తమ అభ్యర్థిని నెగ్గించుకోవాలనే తపనలో ఉంది బీజేపీ. తమ మిత్రపక్షమైన అకాలీదళ్ కు చెందిన నరేశ్ గుజ్రాల్ ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే యోచనలో ఉంది. అతని అభ్యర్థిత్వం పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్న ఇతర పక్షాలు సహకరిస్తాయనే అంచనాలో ఉంది. బీజేడీ, టీఆర్ఎస్, వైసీపీ సహకరిస్తే 17 సీట్ల అదనపు బలం చేకూరుతుంది. తాము ప్రతిపాదించిన అభ్యర్థిని గెలిపించుకోవచ్చు. అందువల్ల ఆ దిశలో పావులు కదుపుతోంది. ఒకవేళ తమ ప్రయత్నాలు ఫలించకపోతే టీఎంసీ కంటే బీజేడీనే బెటర్ అనే భావన కమలనాథుల్లో ఉంది. అయితే 2019లో ఒడిసా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీజేడీలు ముఖాముఖి తలపడాల్సి ఉంది. ఇప్పుడు సర్దుబాటు చేసుకుంటే భవిష్యత్తులో కొంత రాజకీయ ఇబ్బంది తలెత్తవచ్చు. లేకపోతే ప్రతిపక్షాలను చీల్చడం ద్వారా అయినా గట్టెక్కాలనే యత్నాలు సాగుతున్నాయి. వామపక్షాలు, టీఆర్ఎస్, వైసీపీ వంటి పార్టీలు వాకౌట్ చేస్తే బీజేపీ అవకాశాలు మెరుగుపడతాయి. ఆ దిశలోనూ సంప్రతింపులకు అధికారపార్టీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

- ఎడిటోరియల్ డెస్క్

Similar News