ఊరిస్తూనే ఉన్నారు గాని?

తమిళనాట కొత్త పార్టీ వస్తుందని గత కొన్ని నెలలుగా, కాదు కాదు కొన్నేళ్లుగా ఎదురు చూపులే మిగిలాయి. కానీ ఇంతవరకూ ప్రకటన రాలేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. [more]

Update: 2020-02-15 18:29 GMT

తమిళనాట కొత్త పార్టీ వస్తుందని గత కొన్ని నెలలుగా, కాదు కాదు కొన్నేళ్లుగా ఎదురు చూపులే మిగిలాయి. కానీ ఇంతవరకూ ప్రకటన రాలేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఆయన పార్టీ ప్రకటన ఇంతవరకూ చేయలేదు. ఆయనే రజనీకాంత్. రజనీకాంత్ తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు 2017లో ప్రకటించారు. దీంతో రజనీ అభిమానులు ఫిదా అయ్యారు.

రెండేళ్లు గడుస్తున్నా…..

కానీ దాదాపు రెండేళ్లు గడిచిపోతున్నప్పటికీ రజనీకాంత్ పార్టీ ప్రకటన చేయలేదు. తమిళనాడు రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఉంది. ముఖ్యంగా కరుణానిధి, జయలలిత మరణం తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేలకు నాయకత్వ సమస్య ఉంది. దీంతో తమిళనాడులో కొత్త పార్టీకి అవకాశముందని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. దీంతోనే రజనీకాంత్ పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలతో కూడా విడతలవారీగా రజనీకాంత్ సమావేశమయ్యారు.

సభ్యత్వ నమోదులో….

అంతేకాదు పార్టీ పేరును ప్రకటించక పోయినప్పటికీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు కోటికి పైగా సభ్యత్వ నమోదు అయినట్లు కూడా చెబుతున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో రజనీ కాంత్ పార్టీని ప్రకటించక పోవడంపై అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇతర పార్టీల నేతలు కూడా రజనీ పార్టీ ప్రకటన కోసం ఆశగా చూస్తున్నారు. డీఎంకే, ఏఐడీఎంకేల నుంచి పెద్దయెత్తున రజనీకాంత్ పార్టీలో చేరేందుకు సిద్ధమయినప్పటికీ ఆయన పార్టీని ఇప్పటి వరకూ ప్రకటించలేదు.

ఏప్రిల్ నెలలో….

అయితే రజనీకాంత్ సినిమాల్లో బిజీగా ఉన్నారని, అవి పూర్తయ్యాక పూర్తి సమయం పాలిటిక్స్ కు కేటాయిస్తారని చెబుుతన్నారు. మరోవైపు రజనీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన కొన్ని వర్గాలకు విరోధిగా మారుతున్నారు. సీఏఏకు మద్దతుపలకడం, పెరియార్ గురించి చేసిన వ్యాఖ్యలతో రజనీకాంత్ పై విపక్షాలు సయితం విరుచుకుపడుతున్నారు. అయితే రజనీకాంత్ ఏప్రిల్ లో పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు. అది కూడా కష్టమేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. రజనీకాంత్ స్వతహాగా భయస్థుడని, ఆయన అన్ని అంచనాలు వేసుకున్న తర్వాతనే పార్టీని పెట్టవచ్చు లేదా పెట్టకపోవచ్చని కూడా కొందరు అంటున్నారు. మొత్తం మీద రజనీకాంత్ పార్టీ ప్రకటన ఇంకా ఊరిస్తూనే ఉంది.

Tags:    

Similar News