మూడు రాష్ట్రాల్లో "మూడ్" ఇదే....!

Update: 2018-10-21 17:30 GMT

రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ప్రాంతీయ పార్టీలకు తావులేకుండా ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో చక్రం తిప్పుతున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రెండూ చిన్న రాష్ట్రాలైనప్పటికీ రాజకీయంగా కీలక రాష్ట్రాలు కావడం గమనార్హం. ఈశాన్య భారతంలో అత్యంత చిన్న రాష్ట్రమైన మిజోరాం కూడా మారిన పరిస్థితుల్లో కీలకమే. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో అధికారం నిలబెట్టుకోవడం అధికార భారతీయ జనతా పార్టీకి అత్యంత ముఖ్యమైన విషయం. అదే సమయంలో మిజోరాం అధికారాన్ని కాపాడుకోవడం హస్తం పార్టీకి అత్యవసరం. పంజాబ్ తర్వాత హస్తం పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే కావడం గమనార్హం.

ఆ ఒక్క ఆశమాత్రమే......

200 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్ లో అధికార పార్టీని ఓడించి విపక్షాన్ని గద్దెనెక్కించడం గత కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి. దీంతో హస్తం పార్టీలో ఒకింత ఉత్సాహం కనపడతోంది. సర్వేలను తోసి పుచ్చినప్పటికీ కమలం పార్టీలో కొంత కంగారు కనపడుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా ముఖ్యమంత్రి వసుంధర రాజే వ్యక్తిగత వ్యవహారశైలి, ఇటీవలి లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ పరాజయం, రిజర్వేషన్ల కోసం గుజ్జర్ల ఉద్యమం నేపథ్యంలో కమలం పార్టీకి ఈసారి కోత పడుతుందని వినిపిస్తున్న వ్యాఖ్యానాలను తోసి పుచ్చలేం. జాతీయ స్థాయిలో తగ్గుతున్న ప్రధాని మోదీ ప్రభ, జీఎస్టీ, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, రాఫెల్ కుంభకోణాలు మధ్యతరగతి ప్రజల్లో ఎంతో కొంత ప్రభావం చూపక తప్పదని కమలనాధులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతే తప్ప కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవు. రాష్ట్ర రాజకీయం అంతా పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్, మాజీ ముఖ్యమంత్రి, ఓబీసీ నాయకుడైన అశోక్ గెహ్లెట్ చూట్టూ తిరుగుతోంది. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం వీరు పోటీ పడటం ఖాయం. జాట్లు, గుజ్జర్లు, రాజ్ పుత్ లు, బ్రాహ్మణులతో పాటు ఓబీసీకి చెందిన ఇతర 82 కులాలు రాజకీయాన్ని ప్రభావితం చేయనున్నాయి. ఎన్నికల గండం గట్టెక్కేందుకు ముఖ్యమంత్రి రాజే ఎన్నికల ప్రకటనకు ముందు కొద్ది గంటల్లో అజ్మీర్ సభలో రైతులకు ఉచిత విద్యుత్తు హామీని ఘనంగా ప్రకటించారు. " రాజస్థాన్ గౌరవ్ యాత్ర" పేరుతో నిర్వహించిన సభల్లో ప్రధాని మోదీ సయితం పాల్గొన్నారు. మొత్తం 200 స్థానాల్లో 34 ఎస్సీలకు, 25 ఎస్టీలకు రిజర్వు చేశారు.

కర్ణాటక తరహా వ్యూహం.....

90 స్థానాలుగల ఛత్తీస్ ఘడ్ 2000 సంవత్సరంలో ఆవిర్భవించింది. మధ్యప్రదేశ్ ను విభజించి నాటి ప్రధాని వాజ్ పేయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో అజిత్ జోగి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొద్దికాలం పనిచేసినప్పటికీ 2003లలో జరిగిన ఎన్నికల్లో రమణ్ సింగ్ సారథ్యంలో బీజేపీ విజయదుందుభి మోగించింది. అప్పటి నుంచి మూడు దఫాలుగా ఆయనే సీఎంగా చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ బీజేపీ గెలిచినా, ఓడిపోయినా రమణ్ సింగ్ దే బాధ్యతగా చెప్పవచ్చు. బీజేపీలో ఇంత సుదీర్ఘకాలం (15 సంవత్సరాలు) సీఎంగా పనిచేసింది రమణ్ సింగ్ కావడం విశేషం. గత ఎన్నికల్లో 49 స్థానాలు సాధించింది. విపక్ష కాంగ్రెస్ కు రాష్ట్రంలో సరైన నాయకుడు లేరు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ దయాళ్ ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకోవడం హస్తం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. ఈయనకు గిరిజన వర్గాల్లో మంచి పట్టుంది. మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ అధినేత అజిత్ జోగి ఎవరి ఓట్లకు గండి కొడతారో తెలియక కాంగ్రెస్, బీజేపీ తలపట్టుకుంటున్నాయి. గిరిజన నాయకుడైన జోగీ కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చారు. బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయన రంగంలోకి దిగారు. ఎన్నికల అనంతరం హంగ్ అసెంబ్లీ ఏర్పడితే అవసరమైతే జోగీకి ముఖ్యమంత్రి పీఠం అప్పగించడానికి సయితం కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. కర్ణాటకలో కుమారస్వామికి పీఠం అప్పగించి బీజేపీని దెబ్బతీశామని, ఛత్తీస్ ఘడ్ లో కూడా అదే వ్యూహం అవలంబిస్తామని కాంగ్రెస్ పరోక్షంగా చెబుతోంది.

మిజోరాంలో కాంగ్రెస్ ను సాగనంపాలని.....

ఈశాన్య భారతంలోని చిన్న రాష్ట్రం మిజోరాంలో అధికారం నిలబెట్టుకోవడం హస్తం పార్టీకి అగ్ని పరీక్ష. పంజాబ్ తర్వాత అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమిదే. ఈ చిన్న రాష్ట్రాన్ని కూడా కాపాడుకోలేకపోతే దాని ప్రభావం జాతీయ రాజకీయాలపై పడుతుందన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో కనపడుతోంది. ముఖ్యమంత్రి లాల్ తన్ వాలా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కన్నాడ్ సంగ్మా మిజోరాంపై దృష్టిపెట్టారు. ఆరు పార్టీలు ఆయన నేతృత్వంలోని కూటమిలో ఉన్నాయి. పదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ను దెబ్బతీయాలన్నది సంగ్మా ఆలోచన. రాష‌్ట్రంలో బీజేపీకి పునాదులు లేనప్పటికీ సంగ్మాతో కలసి పనిచేయాలన్నది ఆ పార్టీ ఆలోచన. మరో ప్రధాన పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ కూడా రంగంలో ఉన్నాయి. 40 స్థానాల్లో 39 రిజ్వర్వ్ స్థానాలే కావడం గమనార్హం. ఈసారి కాంగ్రెస్ ను సాగనంపాలన్న పట్టుదల ప్రాంతీయ పార్టీల్లో బలంగా ఉంది. ఇందుకు బీజేపీ తనవంతుగా సహకరించనుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News