ట్రాప్ లో పడరట

తమిళనాడులో ఇప్పుడు చర్చంతా సూపర్ స్టార్ రజనీకాంత్ దే. ఆయన రాజకీయ పార్టీపైనే అందరి దృష్టి ఉంది. జాతీయ స్థాయిలో కూడా ప్రధాన పార్టీలన్నీ రజనీకాంత్ ప్రకటన [more]

Update: 2019-09-08 18:29 GMT

తమిళనాడులో ఇప్పుడు చర్చంతా సూపర్ స్టార్ రజనీకాంత్ దే. ఆయన రాజకీయ పార్టీపైనే అందరి దృష్టి ఉంది. జాతీయ స్థాయిలో కూడా ప్రధాన పార్టీలన్నీ రజనీకాంత్ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. అయితే రజనీకాంత్ వచ్చే సంక్రాంతికి తన పార్టీపై స్పష్టత ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే జనవరి నాటికి రజనీకాంత్ సినిమాలు పూర్తి కావస్తుండటంతో ఆయన ఇక పూర్తి సమయాన్ని రాజకీయాలకే వెచ్చించనున్నారని కూడా చెబుతున్నారు. సంక్రాంతికి రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన ఉండే అవకాశముంది.

అన్నీఅనుకూలంగానే…

తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు రజనీకాంత్ కు అనుకూలంగానే ఉన్నాయని చెప్పాలి. అధికార అన్నాడీఎంకే పదేళ్ల పాటు పవర్ లో ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నిలదొక్కు కోవడం కష్టమే. దీనికి తోడు నాయకత్వ సమస్య కూడా దానిని వెంటాడుతోంది. బలమైన ఓటు బ్యాంకు క్యాడర్ ఉన్నప్పటికీ నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీకి అవకాశాలు లేవనే చెప్పాలి. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే స్టాలిన్ నాయకత్వంలో కొంత ఊపుగా కన్పిస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం విజయావకాశాలున్నాయన్నది చెప్పడం కష్టమే.

బీజేపీ ప్రయత్నించినా….

తమిళనాడులో కొత్తగా వచ్చిన కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ, దినకరన్ అమ్మామక్కల్ మున్నేట్ర కళగం పార్టీల పరిస్థితి లోక్ సభ ఎన్నికలతోనే తేలిపోయింది. కమల్ హాసన్ ఇంకా రాజకీయంగా నిలదొక్కులేదంటారు. దీంతో రజనీకాంత్ పార్టీకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చెప్పాలి. రజనీకాంత్ పార్టీ పెట్టకుండా తమ పార్టీలోకి ఆహ్వానించాలని భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళ సై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్ గా వెళ్లడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని రజనీకి బీజేపీ ఆఫర్ ఇచ్చిందన్న వార్తలూ చక్కర్లు కొట్టాయి.

సొంతంగానే బరిలోకి….

కానీ బీజేపీ ఆఫర్ ను రజనీకాంత్ సున్నితంగా తిరస్కరించారంటున్నారు. రజనీకాంత్ 2017లో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటన చేశారు. మక్కల్ మండ్రం సంస్థను ఏర్పాటు చేసి సభ్యత్వాలను కూడా జోరుగా చేర్పించారు. దాదాపు ఇప్పటికే 60 లక్షల మంది సభ్యులు ఇందులో చేరినట్లు తెలుస్తోంది. కోటికి పైగా సభ్యులను చేర్పించాలన్నది రజనీకాంత్ లక్ష్యం. 2012లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ ఒంటరిగానే బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బూత్ లెవెల్ కమిటీలను కూడా ఇప్పటికే నియమిస్తున్నరజనీకాంత్ బీజేపీ ట్రాప్ లో పడరన్నది ఆయన సన్నిహితుల వాదన. అయితే రజనీకాంత్ మనసులో ఏముందో వచ్చే సంక్రాంతి నాటికి గాని తెలియదు.

Tags:    

Similar News