సైకిల్ అచ్చిరాలేదనేనా?

రజనీకాంత్ కొత్తగా తమిళనాడులో రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు. ఈ నెల 31వ తేదీన ఆయన పార్టీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ గుర్తులపై అనేక ఊహాగానాలు [more]

Update: 2020-12-23 16:30 GMT

రజనీకాంత్ కొత్తగా తమిళనాడులో రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు. ఈ నెల 31వ తేదీన ఆయన పార్టీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ గుర్తులపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రధానంగా యోగా ముద్ర గుర్తును ఎంచుకుంటారని తొలుత రజనీకాంత్ అభిమానులు విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆ గుర్తు ఎన్నికల కమిషన్ వద్ద లేకపోవడంతో సైకిల్ గుర్తును రజనీకాంత్ ఎంచుకుంటారని విపరీతంగా ప్రచారం జరిగింది.

సైకిల్ గుర్తు అనుకున్నా……

రజనీకాంత్ అన్నామలై చిత్రంలో నటించిన చిత్రాన్ని కూడా పెద్ద యెత్తున వైరల్ చేశార. ఆ చిత్రంలో రజనీకాంత్ సైకిల్ పై పాల క్యాన్ తో వస్తున్న చిత్రంతో తమిళనాడులో పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే సైకిల్ గుర్తు ఉన్న పార్టీ పెద్దగా సక్సెస్ కాలేకపోవడం, సెంటిమెంట్ గా కూడా తనకు అచ్చిరాదని రజనీకాంత్ భావించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో అనేక సార్లు సైకిల్ గుర్తు ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.

వ్యవస్థాపకులకు ఇబ్బందే……

అయితే ఎన్టీరామారావును పదవి నుంచి తప్పించి టీడీపీని చంద్రబాబు స్వాధీనం చేసుకున్నారు. 2004 నుంచి పదేళ్ల పాటు సైకిల్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. 2014లో అధికారంలోకి వచ్చినా తిరిగి 2019లో అధికారాన్ని కోల్పోయింది. అలాగే సైకిల్ గుర్తు ఉన్న మరో పార్టీ సమాజ్ వాదీ పార్టీ. ఇక్కడ కూడా ములాయం సింగ్ యాదవ్ చేతుల్లో నుంచి అఖిలేష్ యాదవ్ పార్టీని లాగేసుకున్నారు. విజయానికి దూరమయింది. ఈ సెంటిమెంట్ నేపథ్యంలో రజనీకాంత్ సైకిల్ గుర్తును నిరాకరించినట్లు చెబుతున్నారు.

ఆటో గుర్తు….

అందుకే రజనీకాంత్ ఆటో గుర్తును ఎంచుకున్నారని తెలుస్తోంది. ఆటో గుర్తు అయితే సామాన్యుడికి దగ్గరగా ఉంటుందని, ప్రజలు కూడా సులువుగా గుర్తును గుర్తుపడతారని రజనీ భావించారు. అందుకే ఆయన ఎన్నికల కమిషన్ కు తమ పార్టీకి ఆటో గుర్తు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారంటున్నారు. ఈ నెల 31న దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే సైకిల్ గుర్తుకు మాత్రం రజనీకాంత్ ససేమిరా అనడానికి సెంటిమెంట్ కారణమని అంటున్నారు.

Tags:    

Similar News