తలైవా తగ్గినట్లేనా..? ఇక సమయం కూడా లేదే?

తమిళనాడు ఎన్నికలకు ఇంకా నెలల సమయమే ఉంది. అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. పొత్తులపై [more]

Update: 2020-08-18 18:29 GMT

తమిళనాడు ఎన్నికలకు ఇంకా నెలల సమయమే ఉంది. అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. పొత్తులపై చర్చలు జరుపుతున్నాయి. వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా అన్ని పార్టీలూ కసరత్తులు ప్రారంభించాయి. కానీ రజనీకాంత్ మాత్రం ఇప్పటి వరకూ తన మనసులో మాటను బయటపెట్టలేదు. 2021లో జరిగే ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానని రజనీకాంత్ గతంలో ప్రకటించారు.

పార్టీ ప్రకటించకుండా…

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అయితే ఆయన గతంలో సమర్ధుడైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని రజనీకాంత్ ప్రకటించి అభిమానుల్లోె నిరాశ కనపర్చారు. తనకు ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని లేదని ఆయన స్పష్టంగా చెప్పడంతోనే పార్టీ ప్రకటించక ముందే క్యాడర్ డీలా పడేలా చేశారు. అయితే గత కొన్నేళ్లుగా మక్కల్ మండ్రం ను స్థాపించి సభ్యత్వాలను చేస్తున్నారు.

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా……

కానీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో రజనీకాంత్ నుంచి పార్టీ ప్రకటన రాకపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ శూన్యత ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేల ప్రభుత్వాల పనితీరును దశాబ్దాల నుంచి చూసిన ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. తలైవా వస్తే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారని భావించారు. కానీ తమిళనాడు రాజకీయ నేతల ఆడిన మైండ్ గేమ్ కు రజనీకాంత్ పార్టీ ప్రకటన చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానికేతరుడున్న వాదనతో…..

రజనీకాంత్ స్థానికేతరుడన్న వాదనను బలంగా తీసుకురావడంతో ఆయన కొంత వెనక్కు తగ్గారంటున్నారు. ఒంటరిగా పోటీ చేయాల్సి ఉంటుంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా తగిన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. సొంతంగా బరిలోకి దిగే అంత సమయం ఇప్పుడు తలైవాకు లేవు. రజనీకాంత్ పార్టీని ఇప్పటి వరకూ ప్రకటించకపోవడంతో ఇక ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమన్న వ్యాఖ్యలు విన్పిస్తన్నాయి. దీంతో డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నాయి. మరి రజనీకాంత్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేక వెనక్కు తగ్గుతారా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.

Tags:    

Similar News