అమ్మ చెప్పింది....అంతే...!!!

Update: 2018-12-15 15:30 GMT

మరోసారి అధికారం కోసం తాపత్రయ పడుతున్న కాంగ్రెసు పార్టీని అంతర్గత వైరుద్ధ్యాలు వెన్నాడుతున్నాయి. జనరేషన్ గ్యాప్ పార్టీ నిర్ణయాలకు ప్రధాన అవరోధంగా మారుతోంది. అధ్యక్షునిపైనా అధినేత్రి నిర్ణయమనేది పార్టీలో నిర్ణయాల వేగాన్ని కుదిస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దడంలో కొంతమేరకు అవరోధంగా మారుతోంది. ఈ భిన్న ధోరణులను పార్టీని రాష్ట్రస్థాయిలో శాసించే నాయకులు, వర్గ నాయకులు అలుసుగా తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన పార్టీలో పవర్ హంగ్రీ మొదలైంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ లో రాష్ట్రాల గాడ్ ఫాదర్లు తమ పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడం సమస్యాత్మకంగా పరిణమిస్తోంది. రాహుల్ గాంధీ అనేక విధాలుగా పార్టీలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని యత్నిస్తున్నప్పటికీ అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అధినేత్రి సోనియా గాంధీ జోక్యం చేసుకొంటూ ఉండటంతో పార్టీపై సంపూర్ణ అధికారం రాహుల్ కు ఇంకా చిక్కలేదనే చెప్పుకోవాలి. దీంతో కాంగ్రెసు ప్రస్థానం కూడలిలో నిలిచినట్లుగా కనిపిస్తోంది.

తరాల అంతరం...

పార్టీలో తరాల అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. పాతకాపులు పార్టీ లో ఇంకా తమ మాటే నెగ్గాలని పట్టుబడుతున్నారు. పార్టీని మొత్తం రీవ్యాంప్ చేసి నూతన దిశానిర్దేశం చేయాలనే దిశలో రాహుల్ యోచన చేస్తున్నారు. ఈవిషయంలో భారతీయ జనతాపార్టీని ఆదర్శంగా తీసుకోవాలనేది రాహుల్ భావన. అద్వానీ వంటి అగ్రనాయకులను సైతం మార్గదర్శకమండలి పేరిట మోడీ, అమిత్ షాల బృందం పక్కనపెట్టేసింది. పార్టీలో విధాన పరమైన నిర్ణయాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో వారి జోక్యం నామమాత్రం . కేవలం సలహాలు, సూచనలకే పరిమితం. అందులోనూ మోడీ, షాలు తీసుకున్న నిర్ణయాలకు తల ఊపడం మినహా పెద్దగా వారు సమావేశాల్లో చెప్పేది కూడా పెద్దగా ఏమీ ఉండదని పార్టీ వర్గాలే అంగీకరిస్తాయి. వ్యతిరేకత వ్యక్తం చేసినా తమ మాట ఎలాగూ చెల్లుబాటు కాదు కాబట్టి సాధ్యమైనంత వరకూ పెద్దలు మౌనం వహించడం బీజేపీలో అలవాటై పోయింది. కాంగ్రెసులో సైతం సోనియా అధ్యక్షస్థానం నుంచి తప్పుకున్న తర్వాత రాహుల్ జనరేషన్ నాయకత్వం పూర్తిగా పార్టీని నియంత్రిస్తుందని అందరూ భావించారు. దానికనుగుణంగానే రాహుల్ సైతం రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు యువతరానికి అప్పగించారు. కానీ చట్టసభల పదవులు, విజయాలు వచ్చినప్పుడు పెద్దతరం ఎంటరైపోతోంది. తమ వాటా కోసం డిమాండ్ చేస్తోంది. సోనియా గాంధీ సైతం వారి తరఫునే దౌత్యం చేస్తూ పెద్దలను విస్మరించకూడదంటూ ఫైనల్ వర్డ్ గా తాను తీర్పు చెప్పేస్తున్నారు.

ప్రజాస్వామ్య విఫలయత్నం...

పార్టీలో ప్రజాస్వామ్యం నెలకొల్పాలనేది రాహుల్ గాంధీ ఆశయం. పార్టీలో ఎన్ఎస్ యూఐ, యువజన కాంగ్రెసు వ్యవహారాలకు తాను ఇన్ ఛార్జిగా ఉన్నప్పుడు ఆయా విభాగాల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొంతమేరకు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపు, ముఖ్యమంత్రుల ఎంపిక వంటి విషయాల్లోనూ ఈ సంప్రదాయాన్నే నెలకొల్పాలనేది ఆయన ఆలోచన. దీనివల్ల దీర్ఘకాలంలో పార్టీకి మేలు చేకూరుతుంది. పార్టీకి ఆయువు పట్టు కార్యకర్తలు. వారి అభిప్రాయాలు సేకరించి కీలక నిర్ణయాలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ఆశించినట్లుగా అన్నీ సాగడం లేదు. కాంగ్రెసు పేరు చెబితే సీల్డు కవర్ సీఎంలకు పెట్టింది పేరు. అధిష్టానం మనసులో ఎవరుంటే వారే ముఖ్యమంత్రి. ప్రజాదరణతో సంబంధం లేదు. కోటరీలో ఉండేవారు, విధేయులు, పైరవీ కారులను సీఎంలుగా అధిష్టానం నిర్ణయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజల్లో వారికి ఆదరణ లేకపోవడంతో తొందరలోనే పేడవుట్ అయిపోయేవారు. అయితే అధిష్టానం కనుసన్నల్లోనే ఉండేవారు. అవసరమైనప్పుడు ఎటువంటి తిరుగుబాటు లేకుండానే మార్చేసేందుకు వీలుండేది. ఈ పద్ధతిలో మార్పు తేవాలనేది రాహుల్ కృతనిశ్చయం. కానీ సిండికేట్ నాయకులు పడనివ్వడంలేదు. తాజాగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో ఆయన మాట చెల్లుబాటు కాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియా జోక్యంతో మళ్లీ పాతపెద్దలకే పగ్గాలు ఇవ్వాల్సి వచ్చింది. కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలవంటివన్నీ అటకెక్కేశాయి.

కాంగ్రెసు త్రికోణం...

కాంగ్రెసులో ఇప్పుడు భిన్నాభిప్రాయాలతో అంతర్గత త్రిముఖ పోరు సాగుతోంది. కార్యకర్తల మనోభావాలకే పెద్దపీట వేయాలని రాహుల్ యోచిస్తున్నారు. ఇంతకాలం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ల తర్వాతే యువతరానికి ప్రాధాన్యం ఇవ్వాలని సోనియా పట్టుబడుతున్నారు. చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధుల ఆలోచన మరో విధంగా ఉంది. పార్టీలో అధిష్ఠానానికి ప్రధాన పదవుల ఎంపిక బాధ్యతను అప్పగిస్తూ తీర్మానం చేసే సంప్రదాయం ఉంది. దీనికి తిలోదకాలిచ్చి షీల్డు కవర్ కు స్వస్తి చెప్పి తమ మాటకే అగ్రతాంబూలమివ్వాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికకు సైతం కార్యకర్తల వాయిస్ రెస్పాన్స్ సిస్టం ను వినియోగించుకుంటోంది కాంగ్రెసు. అలాగే ముఖ్యమంత్రుల విషయంలోనూ కార్యకర్తల స్పందన తెలుసుకొనే విధంగా సాంకేతిక పరిజ్ణానాన్ని వినియోగించుకోవాలని రాహుల్ నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. దీనివల్ల జనాదరణ కలిగిన నాయకులు పుట్టుకు వస్తారు. దీర్ఘకాలంలో పార్టీకి మంచి జరుగుతుంది. దీనికి కోటరీ నాయకులు, ఎమ్మెల్యేలు సైతం అంగీకరించడం లేదు. ఇది భవిష్యత్తులో రాహుల్ కు పెద్ద పరీక్షగా మారవచ్చు. అయితే వరస విజయాలు సాధించుకుంటూ పోతే మాత్రం అధినేత పట్టు స్థిరపడిపోతుంది. అప్పుడు కార్యకర్తల అభిప్రాయాలతో పాటు తన మాటే చెల్లుబాటు అవుతుంది. అందుకే హస్తం పార్టీ భవిష్యత్తు, యువనాయకత్వానికి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతల వంటివి రాహుల్ సాధించే విజయాలపైనే ఆధారపడి ఉంటాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News