ఉందిలే ‘రాహు’కాలం...!

Update: 2018-07-29 16:30 GMT

రాహుల్ రాటుదేలుతున్నారు. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సంపూర్ణ అధికారాలను అతనికి ఖాయం చేసింది. ప్రాంతీయపార్టీలతో పొత్తులు, రాష్ట్రాల వారీ వ్యూహాలు, అభ్యర్థుల ఖరారు సహా ఇక అతనిష్టమే. అటు మోడీ, అమిత్ షాలు బీజేపీని దున్నేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా రాహుల్ కు సైతం కాంగ్రెసు పార్టీలో తిరుగులేని పెత్తనం కట్టబెట్టారు. పార్లమెంటులో వాగ్ధాటితో తను కొంతమేరకు సత్తా చూపగలిగారు. క్యాడర్ లోనూ కాన్ఫిడెన్సు నింపగలిగారు. దీంతో సాఫీగా అధికారమార్పిడికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సోనియా చేసేశారు. పార్టీ అధ్యక్షునిగా గత నవంబరులోనే పగ్గాలు చేపట్టినప్పటికీ ఇటీవలి వర్కింగ్ కమిటీ సమావేశంలోనే ఆ పదవికి సర్వసత్తాక ప్రతిపత్తి లభించినట్లయింది. గుజరాత్ , కర్ణాటక ఎన్నికల్లో మెరుగైన పనితీరునే కనబరిచారు. మోడీ, అమిత్ షాల జోడీకి దీటైన వ్యూహాలనే అమలు పరిచారు. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు బలమైన జాతీయ ఫ్రంట్ ను నిర్మించి , రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెసును తీర్చిదిద్దడం ఒక పరీక్ష. అత్యాశతో కూడిన ప్రాంతీయ పార్టీలు, పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లు ప్రవర్తించే వామపక్షాలు, తగిన గుర్తింపు లభించడం లేదనుకుంటున్న నాయకుల అసంత్రుప్తి అడుగడుగునా సవాల్ విసురుతున్నాయి.

ప్రాంతీయ ‘పట్టు’...

కాంగ్రెసు పార్టీకి ఒక అద్భుతమైన అవకాశం ఎదురుచూస్తోంది. మధ్యప్రదేశ్; రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ఎన్నికలు పార్టీకి వరం లాంటివి. కాంగ్రెసు ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ముఖాముఖి ఎదుర్కోబోతోంది. కమలంతో విసిగిపోయిన ఆయా రాష్ట్రాల ఓటర్లు కాంగ్రెసుకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ఇది వామప్ వంటిది. ఇక్కడే కాంగ్రెసుకు గండం ఎదురవుతోంది. జాతీయంగా కూటమి కట్టాలని చూస్తున్న కాంగ్రెసును లొంగదీసేందుకు బహుజనసమాజ్, సమాజ్ వాదీ, నేషనలిస్టు కాంగ్రెసు వంటి పార్టీలు పట్టు బిగిస్తున్నాయి. తమకు ఏదో నామమాత్రంగా బలం ఉన్నరాష్ట్రాల్లో సీట్లు కావాలంటూ డిమాండు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రధానమైన రాష్ట్రాలను ఎరగా చూపుతూ తమకు పెద్దగా బలం లేని చోట్ల కాంగ్రెసు కిట్టీ నుంచి సీట్లు కొట్టేయాలని చూస్తున్నాయి. యూపీలో తమతో పొత్తు ఉండాలంటే ముందుగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ లలో తమకు కొన్ని సీట్లు కేటాయించాలని బహుజనసమాజ్ పార్టీ కోరుతోంది. సమాజ్ వాదీ పార్టీది ఇదే తరహా డిమాండు. 80 స్థానాలున్న యూపీలో కాంగ్రెసు బలం అంతంత మాత్రమే. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ లలో బీఎస్పీతో కలవకపోయినా కాంగ్రెసు గెలుస్తుంది. యూపీలో పొత్తు లేకపోతే కుదరదు. మహారాష్ట్రకు పొరుగు రాష్ట్రమైన గుజరాత్ లో తమకు సీట్లు కావాలంటోంది ఎన్సీపీ . కొన్ని త్యాగాలకు సిద్ధమైతే తప్ప కాంగ్రెసు కూటమి కార్యరూపం దాల్చే సూచనలు కనిపించడం లేదు.

వామపక్షాల వాటం...

బీజేపీ పట్ల ఆగర్భ శత్రుత్వం ప్రదర్శించే వామపక్షాలు కాంగ్రెసు వైపు కాసింతకరుణ చూపుతాయేమోననే ఆశ మిణుకుమిణుకు మంటోంది. కానీ అది పూర్తిస్థాయి వెలుగుగా మారే సూచనలు కనిపించడం లేదు. కాంగ్రెసును కౌగిలించుకునే సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి వైఖరిని కేరళ కామ్రేడ్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆయన ప్రతిపాదించిన అధికారిక తీర్మానాన్నే ఓడించారు. బీజేపీ , కాంగ్రెసులకు సమ దూరం అన్న కొత్త తీర్మానానికి జై కొట్టారు. పశ్చిమబంగ లో కాంగ్రెసుతో కలిసి వెళ్లి ఖంగుతిన్నారు. మూడో స్థానానికి దిగజారారు. కేరళలో సీపీఎం కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసు పార్టీనే. మరో ప్రధాన వామపక్షమైన సీపీఐ కేరళ, పశ్చిమబంగ లో సీపీఎం ను కాదని వేరే పార్టీతో పొత్తు పెట్టుకునేంత సాహసం చేయదు. మిగిలిన ఫార్వార్డ్ బ్లాక్ వంటి పార్టీలు నామమాత్రపు శక్తులే. బీజేపీ, కాంగ్రెసుల సిద్దాంతాల్లో వైరుద్ద్యం లేదు. పాలసీలు వేర్వేరు కాదు. అందువల్ల దూరంగా ఉంటామంటున్నాయి వామపక్షాలు. మతపరమైన అజెండాను మినహాయిస్తే ఆర్థిక,విదేశాంగ విధానాల్లో రెండు జాతీయ పార్టీల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి వామపక్షాలు నిరాకరిస్తున్నాయి. అందువల్ల ఎన్నికలకు ముందు వామపక్షాలతో చేయి కలిపే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు.

అంతర్గత అసంతృప్తి...

పార్టీకి కొత్త నాయకత్వం వచ్చింది. రాజీవ్, సోనియా ల తర్వాత తరం అన్నిటా అవకాశాలను అందిపుచ్చుకుని దేశవ్యాప్తంగా నూతన కాంగ్రెసును ఆవిర్బవింపచేయాలి. అయితే రాహుల్ ను ప్రొజెక్టు చేయడంపైనే అధిష్టానం దృష్టి పెడుతోంది. మోడీ మంచి వాగ్ధాటి కలిగిన కరిష్మాటిక్ లీడర్. ఆయనతో మాటలు, విన్యాసాల్లో పోటీ పడటం కష్టం. ఆ ప్రయత్నం వృథా. కానీ కాంగ్రెసు పార్టీ మోడీకి దీటుగా రాహుల్ ను ప్రజలకు చూపించాలని తాపత్రయ పడుతోంది. దీంతో అనేక సందర్భాల్లో రాహుల్ తేలిపోతున్నారు. ఈ నిష్ఫల ప్రయాసను పక్కనపెట్టి క్యాడర్ ను పటిష్టం చేసుకుంటే బెటర్. ద్వితీయశ్రేణి నాయకత్వం, రాష్ట్రనాయకత్వాలను బలోపేతం చేయడం ద్వారా కాంగ్రెసు పునరుజ్జీవం పొందగలుగుతుంది. పార్లమెంటులోనూ, వివిధ వేదికలపైనా వారికి అవకాశం కల్పించాలి. జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ వంటి నాయకులను రాష్ట్రాల వారీగా గుర్తించి వారికి జాతీయ వేదికను కల్పించాలి. పార్టీలోనూ, పార్లమెంటులోనూ వారి వాయిస్ ప్రజల్లోకి వెళ్లేలా చూసుకోవాలి. తద్వారా రాహుల్ పై ఒత్తిడి తగ్గుతుంది. రాష్ట్రాల్లో నాయకత్వం పటిష్ఠమవుతుంది. దీనిని పట్టించుకోకపోవడం వల్ల పార్టీలో గుర్తింపు సంక్షోభం తలెత్తుతోంది. అంతర్గత అసంతృప్తి పెరుగుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News