ఢిల్లీకి వచ్చారో..... రాహుల్ క్లాస్...!

Update: 2018-08-14 15:30 GMT

అఖిలభారత కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన విజయవంతమైందా? వైఫల్యం చెందిందా? ప్రజల్లో ఉత్సుకత రేపిందా? కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందా? ఇదంతా ఒక పార్శ్వం. రాజకీయంతోపాటు పార్టీ సంస్థాగత పటిష్టత, భవిష్యత్తు నాయకత్వ నిర్మాణమూ అంతర్గత లక్ష్యాలుగా ఈ పర్యటన సాగిందనేది సమాచారం. తెలంగాణ పర్యటన నిమిత్తం ఆయన రెండు రోజులపాటు కేటాయించారు. తొలిరోజు ఎక్కువగా కేంద్రప్రభుత్వ విధానాలపై దృష్టి సారించారు. ఒక జాతీయపార్టీ అధ్యక్షునిగా అది సముచితమే. అయితే పెద్దగా ఉత్సాహాన్ని నింపలేదు. ప్రధానంగా తెలంగాణలో బీజేపీ ప్రభావం చూపగల పార్టీ కాకపోవడం వల్ల ప్రజల్లోనూ చర్చ రేకెత్తించలేకపోయారు. రెండోరోజు కేసీఆర్ , తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మొత్తమ్మీద పర్యటన కు పార్టీలోని అన్నివర్గాలు గట్టిగానే కష్టపడ్డాయి. కానీ కాంగ్రెసు సహజ సంస్కృతి ప్రకారం విభేదాలూ తొంగిచూశాయి. అసంతృప్తులు, అలకలూ మొలకలెత్తాయి. వారందరికీ సున్నితంగానే అయినా స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారంటున్నారు. భవిష్యత్తులో ఈ పోకడలను సహించేది లేదని తేల్చి చెప్పేశారు రాహుల్.

అప్పోజిషన్ అసెట్...

మొత్తం రాహుల్ పర్యటనను చిన్నచూపు చూస్తున్నట్లుగా గేలిచేయాలనే ఎత్తుగడతో కేసీఆర్ చేసిన పదప్రయోగం వైరల్ అయ్యింది. రాహుల్ పరిపక్వత, పరిణతి లేని నాయకుడంటూ ఆయన అప్పోజిషన్ కు అసెట్ అన్నారు. ప్రత్యర్థి పార్టీలకు దొరికిపోతారు. వారికి ఆయుధంగా ఉపయోగపడతారంటూ ఎద్దేవా చేశారు. బలంగా పెరిగిన బీజేపీ ఉద్ధృతి ముందు తట్టుకోవడం రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెసుకు దేశంలో కష్టంగానే మారింది. అయితే తెలంగాణలో పరిస్థితి భిన్నం. ఇక్కడ కాంగ్రెసు, టీఆర్ఎస్ లు ముఖాముఖి తలపడుతున్నట్లుగానే భావించాలి. మిగిలిన పార్టీల పోటీ నామమాత్రమే. తొంభై పైచిలుకు స్థానాల్లో ఈరెండు పార్టీలే ప్రధానప్రత్యర్థులుగా నిలుస్తాయి. అందుకే కాంగ్రెసును టీఆర్ఎస్ తోసిపుచ్చలేని స్థితి. అలాగని ఆ పార్టీ బలాన్ని బహిరంగంగా ఒప్పుకోవడమూ రాజకీయంగా సాధ్యం కాదు. దాంతో కాంగ్రెసును దాంతోపాటు రాహుల్ ను ఉతికి ఆరేసే క్రమంలో కేసీఆర్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు.

పదే పదే అదే గొడవ..

కాంగ్రెసు అంటేనే అసమ్మతి, అసంత్రుప్తి, వర్గ విభేదాలు సహజం. రాహుల్ పర్యటన సందర్భంగానూ అదే తీరు కొట్టవచ్చినట్లు కనిపించింది. రాహుల్ పర్యటనలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ సీనియర్లు అలకబూనారు. ఆయన సమావేశాలను బహిష్కరించేందుకూ సిద్దమయ్యారు. జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలి, సునీతా లక్ష్మారెడ్డి వంటి వారే నిరసనలు వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల సమన్వయం గాలికొదిలేశారు. పార్టీలో పదవులు, టిక్కెట్ల కేటాయింపు అన్నిటా వర్గ విభేదాలే కనిపిస్తుంటాయి. అధికారంలోకి వస్తుందా? లేదా? అన్న అంశంతో నిమిత్తం లేకుండా కొట్లాటలు, కుమ్ములాటలకు మాత్రం కొదవ లేదు. టిక్కెట్ల కేటాయింపులపై కూడా రాహుల్ వద్ద ప్రస్తావన తెచ్చే ప్రయత్నం కొందరు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే విభేదాలను రాహుల్ ఇప్పటికే సీరియస్ గా పరిగణిస్తున్నట్లుగా కాంగ్రెసు ఢిల్లీ నేతలు తేల్చి చెప్పారు. దాంతో తమలో తాము ఈపర్యటన వరకూ కొంత సర్దుబాటు ధోరణి కనబరిచారు.

సొంత సర్వేలపైనే...

ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం కాంగ్రెసు సంస్కృతి. అదే బలంగా ప్రదర్శిస్తుంటారు. నాయకత్వ లక్షణమని భావిస్తుంటారు. ప్రతినియోజకవర్గంలోనూ రెండు మూడు కుంపట్లు కనిపిస్తాయి. రాష్ట్రస్థాయిలో చెప్పలేనన్ని ముఠాలు. గతంలో మంత్రి స్థాయిలో , ఎంపీ స్థాయిలో పనిచేసిన ప్రతిఒక్కరూ తాము ముఖ్యమంత్రి పదవికి అర్హులమని భావిస్తూ ఉండటం తెలంగాణ కాంగ్రెసులో కనిపించే దుష్పరిణామం. ఒకవైపు కేసీఆర్ తమ పార్టీకి వంద సీట్లు వస్తాయని ఢంకా బజాయిస్తున్నారు. తటస్థ సర్వేలూ టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. లోపాలను అధిగమించి ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత కాంగ్రెసుపై పడింది. బలహీనతలు తెలుసుకొని వాటిని సరిదిద్దుకున్నప్పుడే సమర్థమైన పార్టీగా మారుతుంది. తెలిసీ లోపాలను పెంచుకోవడమే ఇక్కడి నాయకత్వ లోపం. దీనిని అధిష్ఠానం ఇప్పటికే గుర్తించింది. 2019లో గట్టిపోటీ ఇవ్వాలనుకుంటున్నప్పటికీ అధికారం పై హస్తినకు కూడా నమ్మకం లేదని అంతర్గత అంచనా. ఈ విడతలో ముఠానాయకత్వ లక్షణాలను వదిలించుకుని భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనేది రాహుల్ నిర్ణయం. అందుకనుగుణంగా ప్రాథమిక కసరత్తును తెలంగాణలో ప్రారంభించారని చెబుతున్నారు. నూతన నాయకత్వాన్ని గుర్తించడంపైనా ఆయన రెండు రోజుల పర్యటనలో దృష్టి పెట్టి వారితో కీలక విషయాలు మాట్లాడినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హస్తిన చుట్టూ తిరిగితే టిక్కెట్లు రావు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పలితం ఉంటుంది. గ్రూపులు ఇచ్చే నివేదికలపై కాకుండా తాను సొంత సర్వేలపై ఆధారపడతానని కూడా రాహుల్ చెప్పేయడమే కొసమెరుపు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News