కష్టాలు తెచ్చి పెట్టావే

రాహుల్ గాంధీ నిర్ణయం కాంగ్రెస్ కు కావాల్సినన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తొలినాళ్లలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయితం దీనిని [more]

Update: 2019-07-14 17:30 GMT

రాహుల్ గాంధీ నిర్ణయం కాంగ్రెస్ కు కావాల్సినన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తొలినాళ్లలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయితం దీనిని ఒక డ్రామాగా భావించారు. లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఓటమితో రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారని, తర్వాత మెల్లగా సర్దుకుంటారని అందరూ భావించారు. కానీ రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు.

రాహుల్ రాజీనామాతో….

రాహుల్ రాజీనామా నిర్ణయంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం ఆవహించింది. రాహుల్ గాంధీకి సీనియర్లు నచ్చ చెప్పినా వినలేదు. తాను అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టే వీలులేదని రాహుల్ గాంధీ తెగేసి చెప్పారు. అంతేకాదు సీడబ్ల్యూసీకి ఏకంగా నాలుగు పేజీల లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన రాజీనామాకు పూర్తిగా కట్టుబడి ఉన్నారని కింది స్థాయి కార్యకర్త నుంచి నాయకుల వరకూ అర్థమయింది. ఇక కాంగ్రెస్ కోలుకోలేదని గుర్తించిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు.

రాష్ట్రాల్లో కల్లోలం….

దాని ఫలితమే గోవా సంక్షోభం. గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. గోవా కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యేలు పార్టీ గీతను సులువగా దాటేశారు. రాహుల్ నిర్ణయం తర్వాతనే కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో పడింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 15 మంది ఎమ్మెల్యేల వరకూ రాజీనామా చేశారు. ఇది కూడా రాహుల్ రాజీనామా చలవేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

నేతల వలస బాట….

ఇదే బాటలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అసలే కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ. దీనికి తోడు రాహుల్ గాంధీ పార్టీ బాథ్యతలను వదిలివేయడంతో కాంగ్రెస్ నేతలకు మరింత స్వేచ్ఛ లభించినట్లయింది. దీంతో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు పార్టీని వీడే అవకాశాలున్నాయి. రాహుల్ రాజీనామా ప్రభావం త్వరలో జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖంఢ్ అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశాలున్నాయి. రాహుల్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News