డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా….!!

కుటుంబ కంచుకోట అయిన అమేధీలో ఓటమిని చూసిన తర్వాత కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్న సామెత రాహుల్ గాంధీకి గుర్తుకు రాకమానదు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ [more]

Update: 2019-07-05 16:30 GMT

కుటుంబ కంచుకోట అయిన అమేధీలో ఓటమిని చూసిన తర్వాత కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్న సామెత రాహుల్ గాంధీకి గుర్తుకు రాకమానదు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ కు అండగా నిలిచింది అమేధీ. రాహుల్ బాబాయి సంజయ్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీ వంటి ఉద్దండులు గతంలో ఇక్కడి నుంచి లోక్ సభకు వెళ్లారు. మధ్యలో కెప్టెన్ సతీష్ శర్మ వంటి గాంధీ కుటుంబ సభ్యులు ఇక్కడ విజయం సాధించారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అమేధీలో కాంగ్రెస్ చెక్కు చెదరలేదు.

గతంలోనూ ఇలాగే…..

అలాంటిది ఈ దఫా రాహుల్ ఓటమి హస్తం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరిచింది. ఆందోళన కలిగించింది. ఆవేదన మిగిల్చింది. 1977లో ప్రధాని హోదాలో సొంత నియోజకవర్గం రాయబరేలీలో ఇందిరాగాంధీ ఓటమి పాలయింది. ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడి హోెదాలో రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. ఈ రెండింటిని పోల్చి చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పట్లో అనామకుడైన రాజ్ నారాయణ్ ఇందిరను ఓడించి ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా అంతగా ప్రజాబలం లేని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని ఓడించారు. ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ ముందు జాగ్రత్త చర్యగా కేరళలోని వయనాడ్ ను ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో వ్యతిరేకతను రాహుల్ గాంధీ ముందే గ్రహించి జాగ్రత్త పడ్డారన్నది అంచనా.

కారణాలివేనా….?

రాహుల్ గాంధీ ఓటమికి కారణాలు కోకొల్లలు. సరైన సంస్థాగత యంత్రాంగం లేకపోవడం, గ్రామీణ ప్రజానీకంతో పార్టీ అధినేత మమేకం కాకపోవడం, యువత బీజేపీ వైపు మొగ్గు చూపడం, గెలుపుపై పార్టీ శ్రేణులు అతి ధీమాకు పోవడం రాహుల్ గాంధీ ఓటమికి ప్రధాన కారణాలుగా పేర్కొన వచ్చు. సంస్థాగత యంత్రాంగం లేకపోవడం వల్లే నియోజకవర్గ పరిధిలోని అయిదు అసెంబ్లీ స్థానాల్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. నాటి ఎన్నికల్లో తిలోయి, గౌరీగంజ్, జగదీశ్ పూర్, అమేధీ, సలోయి స్థానాల్లో నాలుగు బీజేపీ పరమవ్వగా, ఒక్క స్థానంలో సమాజ్ వాదీ పార్టీ గెలిచింది. 2012లో జగదీశ్ పూర్ లో హస్తం పార్టీ విజయం సాధించింది. అమేధీని రాహుల్ గాంధీ సందర్శించినప్పటికీ పల్లెల వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో గ్రామాలు దూరమయ్యాయి. ప్రియాంక గాంధీ రంగ ప్రవేశం చేసినప్పటికీ ప్రభావం చూపలేక పోయింది. ఆమె ప్రజలకు అభివాదాలు చేయడం, వాహనాలతో ర్యాలీలు నిర్వహించడం తప్ప ప్రజలతో మమేకం కాలేకపోయారు. సలహాదారులు కూడా రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలున్నాయి. భారీ మెజారిటీతో విజయం తథ్యమన్న ధీమాను వారు వ్యక్తం చేసేవారు. ఢిల్లీ రాజకీయాలతో నిత్యం తలమునకలయ్యే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్దిమంది సలహాదారులు, అనుయాయులపై ఆధారపడ్డారు తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులను గుర్తించలేకపోయారు. కాంగ్రెస్ స్థానిక నాయకత్వం, రాహుల్ భద్రతాసిబ్బంది దురుసు ప్రవర్తన ప్రజలకు దూరం చేసింది.

ప్రచారంలోనే వెనుకంజ……

గతంలో నియోజకవర్గం అభివృద్ధికి, ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకూ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు వివరించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. దేశవ్యాప్తంగా ప్రచారం, వయనాడ్ పై దృష్టి పెట్టడం వల్ల అమేధీ పై పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ దృష్టి సారించలేకపోయారు. ఫలితంగా యాభై ఐదు వేల ఓట్లతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. మొత్తానికి అమేధీ చరిత్రలో కాంగ్రెసేతర అభ్యర్థి గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. విజేతగా నిలిచిన భారతీయ జనతా పార్టీ వ్యూహత్మకంగా వ్యవహరించింది. గత ఐదేళ్లుగా కేంద్రంలో, గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలసి వచ్చింది. మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ముఖ్యంగా యువత, కొత్త ఓటర్లు పార్టీ వైపు మొగ్గు చూపడంతో విజయం నల్లేరు పై నడకే అయింది. 2014లో ఓడిపోయిన స్మృతి ఇరానీ నియోజకవర్గాన్ని విస్మరించలేదు. గత అయిదేళ్లుగా ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు అందుబాటులో ఉండేవారు. మోదీ చరిష్మా కూడా ఉపయోగపడింది. ఇవన్నీ అంతిమంగా స్మృతి ఇరానీ విజయానికి దోహదపడ్డాయి. అమేధీలో ఓటమిని రాహుల్ గాంధీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం కూడా అమేధీలో ఓటమికి ఒక కారణమని చెబుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News