రాహుల్ ఊపిరి పోస్తారా?

Update: 2018-08-07 15:30 GMT

దక్షిణాదిన కాంగ్రెసు పార్టీ ఆశలు పెట్టుకున్న రాష్ట్రం తెలంగాణ. రాజకీయంగా రిస్కు చేసినా అధికారం నిలబెట్టుకోలేకపోయింది. బొటాబొటి ఆధిక్యతతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏకుమేకై పోయారు. బలోపేతమైన శక్తిగా రూపుదాల్చారు. తెలంగాణలో తనకు తిరుగులేదన్న స్థాయి సంతరించుకోగలిగారు. తటస్థ రాజకీయ పరిశీలకులు,విశ్లేషకులు టీఆర్ఎస్ బలం బాగా పెరిగిందనే అంచనా వేస్తున్నారు. 2014 కంటే పార్టీ ప్రస్తుత స్థితి మెరుగ్గా ఉందంటున్నారు. అదే సమయంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా చూస్తే అధికార పార్టీ నాయకుల కంటే కాంగ్రెసు నాయకులే ప్రజాదరణలో పట్టు కలిగి ఉన్నారు. టీఆర్ఎస్ స్థానిక నేతల బలం అంతంతమాత్రమే. కానీ కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్ స్థానిక నేతల బలహీనతను మరుగునపడేలా చేస్తోంది. ఆయన ఎవరిని ఎంపిక చేసినా ఎమ్మెల్యే,ఎంపీగా ఎన్నికయిపోతారనే ధీమా పార్టీలో ఏర్పడింది. పైపెచ్చు కాంగ్రెసు నాయకుల్లో ఉన్న కుమ్ములాటలు, గ్రూపు తగాదాలు ఎటూ చెరుపు తెచ్చిపెడతాయి. దాంతో అధికారపార్టీ కంటే కాంగ్రెసు నియోజకవర్గాల్లో బలహీనంగా కనిపిస్తోంది. దీనిని అధిగమించి పాలకపక్షానికి దీటైన పోటీనిచ్చే ప్రతిపక్షంగా, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కాంగ్రెసును నిలిపేందుకు రాహుల్ గాంధీ పర్యటనను ప్లాన్ చేశారు.

ఆంధ్రాసెటిలర్ల పై ఆశలు...

వచ్చేవారం గ్రేటర్ హైదరాబాదులో రాహుల్ గాంధీ తలపెట్టిన రెండు రోజుల సుడిగాలి పర్యటన రాజకీయ దుమారం రేపబోతోంది. యువత, మహిళలు, అర్బన్ ఓటర్లు, ఆంధ్రా సెటిలర్లను లక్ష్యంగా పెట్టుకుంటూ ఈపర్యటనకు రూపకల్పన చేశారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని 24 సీట్లకు గాను పాతబస్తీని మినహాయిస్తే 15 సీట్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన ఓటర్ల ప్రభావం ఉంటుంది. 2014 లో ఈ ఓట్ల ప్రభావంతోనే టీడీపీ, బీజేపీ విజయఢంకా మోగించాయి. గ్రేటర్ పరిధిలోని ఎంఐఎం ప్రాబల్య స్థానాలు ఆపార్టీకే దక్కాయి. మిగిలిన చోట్ల అధికస్థానాల్లో ఈ కూటమి జయపతాక ఎగరవేసింది. టీఆర్ఎస్, కాంగ్రెసులు నామమాత్రంగా మిగిలిపోయాయి. ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెసు స్పష్టమైన వైఖరి తీసుకుంది. బీజేపీ, టీడీపీ పొత్తు విచ్ఛిన్నమైపోయింది. సెటిలర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపడంతో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారపార్టీ అప్రతిహతమైన విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికలు దీనికి భిన్నంగా సాగాలంటే సెటిలర్లను కాంగ్రెసు ఆకట్టుకోవాలి. ఈ ఉద్దేశంతోనే రాహుల్ పర్యటనను జంటనగరాలు, గ్రేటర్ పరిధిలో పక్కాగా ప్లాన్ చేశారు. అన్నివర్గాలను అడ్రస్ చేసేలా చూస్తున్నారు. ఇది కాంగ్రెసుకు కలిసివస్తుందనే భావనలో ఉన్నారు. పాత జిల్లాల పరిధిని ద్రుష్టిలో పెట్టుకుని చూస్తే రాష్ట్రంలో మూడు జిల్లాల్లో కాంగ్రెసు బలంగా ఉంది. అయిదు జిల్లాల్లో టీఆర్ఎస్ బలంగా ఉంది. గ్రేటర్ హైదరాబాదు నిర్ణయాత్మకం కాబోతోందని కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. అందువల్ల దీనిపైన ఎక్కువ ద్రుష్టి పెడుతున్నారు.

‘ఓయూ’ ఓ ఉప్పెన...

ఉద్యమం అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఈ ఉన్నతవిద్యాసంస్థ నిర్వహించిన పాత్ర ఎనలేనిది. 1969లో తొలిసారి సాగిన ఉద్యమంలోనే విద్యార్థులు అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. మలిదశ ఉద్యమంలోనూ బలమైన ఆందోళనలకు వేదికగా నిలిచింది. ప్రభుత్వాలను గడగడలాడించింది. ఉద్యమ సమయంలో ఆందోళనలను కట్టడి చేయడానికి ప్రత్యేక పోలీసు పికెట్లు పెట్టాల్సి వచ్చింది. నెలలతరబడి సాయుధరిజర్వు బలగాలను కాపలా ఉంచాల్సి వచ్చింది. ఉద్యమానికి ఊపు, ఉత్సాహం యూనివర్శిటీ నుంచే లభించింది. యూనివర్శిటీ విద్యార్థుల పిలుపు యువతను కదిలించింది. రాష్ట్ర విభజన తర్వాత తమకు తగిన న్యాయం జరగలేదనే భావనలో ఉన్నారు ఉస్మానియా విద్యార్థులు. ఉద్యోగ కల్పన విషయంలో యువతకు నిరాశ మిగిలిందని ఆందోళనలు నిర్వహించారు. అయితే ప్రభుత్వం నుంచి తగినంత స్పందన కరవైంది. శతవార్షికోత్సవ వేడుకలో విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మాట్లాడటానికే సాహసించలేదు. అంతటి తీవ్రమైన భావోద్వేగంతో కూడిన విశ్వవిద్యాలయాన్ని సందర్శించాలని రాహుల్ భావిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ ఉద్దేశం. ఉద్యమసమయం నాటి స్ఫూర్తిని ప్రేరేపించడమే దీని లక్ష్యం. అధికారపార్టీకి వ్యతిరేకంగా యువతలో వేడి పుట్టించి కాంగ్రెసుకు చేరువ చేయడానికి అధినేత పర్యటన దోహదం చేస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఉస్మానియా ప్రజా వెల్లువకు దారితీస్తుందని ధీమాగా చెబుతున్నారు కాంగ్రెసు నాయకులు.

కేసీఆర్ ని ‘ఢీ’ కొట్టాలనే....

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢీకొట్టగల దీటైన నాయకుడు కాంగ్రెసులో కరవు అయ్యారు. ఒకరంటే ఒకరికి పడని తత్వంతో బలహీనపడిపోయారు. నిజానికి జానారెడ్డి, జైపాల్ రెడ్డి వంటి నేతలు కేసీఆర్ కంటే చాలా సీనియర్లు. ఘటనాఘటన సమర్థులు. కానీ పార్టీలో ఇతర నాయకులు వీరికి సహకరించడం లేదు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పనితీరు తేలిపోతోంది. ఆయనకు పార్టీలోని మిగిలిన నాయకులకు ఆయనపై చిన్నచూపు . హస్తం పార్టీ అసంత్రుప్తి జ్వాలల్లో అగ్గిబుగ్గైపోతోంది. రాహుల్ పర్యటనతో ఈ పరిస్థితులు ఒక కొలిక్కి వస్తాయని నాయకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ను దీటుగా ఎదుర్కోగల సమన్వయం సాధించగలమని నమ్ముతున్నారు. రాహుల్ చేసే విమర్శలు, చూపే పంథా తెలంగాణ కాంగ్రెసుకు ఊపిరిపోస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెసు వర్సస్ టీఆర్ఎస్ అన్న ద్విముఖ పోరుకు రాహుల్ బాటలు వేసే చాన్సులు కనిపిస్తున్నాయి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News