సీఎం...కుర్చీ కోసం గేమ్ స్టార్ట్.....!!

Update: 2018-10-23 16:30 GMT

ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండేంత పోటీ మరే పార్టీలోనూ ఉండదు. వందేళ్ల కు పైగా చరిత్ర కలిగిన ఈ పార్టీలో ప్రతి ఒక్కరూ పోటీదారే. నాలుగైదు సార్లు ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యే నుంచి మొదటి సారి ఎన్నికయిన వారు సయితం ఆశావహులే.అసలు ఎమ్మెల్యేనే కాని వారు కూడా పోటీ పడుతుంటారు. పార్లమెంటులో సభ్యుడో, శాసనమండలి సభ్యుడో, అసలే చట్టసభలోనూ సభ్యుడు కాని వారు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు.ప్రజా క్షేత్రంలో పలుకుబడి, శాసనసభ పక్షంలో బలంలేని వారు సయితం కూడా సై అంటారు. ఢిల్లీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండటమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. హై కమాండ్ ఆశీస్సులుంటే అధికారం అందుకోవడం హస్తం పార్టీలో అత్యంత సులభం. కాంగ్రెస్ , నేడు ప్రస్తుతం ఢిల్లీలో చక్రం తిప్పుతున్న భారతీయ జనతా పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాంగ్రెస్ సంస్కృతి ఇటీవల కాలంలో కమలం పార్టీలో కూడా మొదలయింది. సాధారణంగా అధికారంలో ఉంటే మళ్లీ ముఖ్యమంత్రి కావడం సంప్రదాయం. విపక్షంలో ఉంటే పీసీసీ అధ్యక్షుడో, శాసనసభ పక్ష నాయకుడో పదవిని ఆశించడం సహజం.

వారిద్దరిదే సీఎం పదవి......

ప్రస్తుత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల హస్తం పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉన్నట్లు వస్తున్న సర్వేల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే కొందరు నాయకులు పావులు కదుపుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ వీటిల్లో ముఖ్యమైనవి. దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ, ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత సవ్యంగా లేదు. మిగిలిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజస్థాన్ లో హస్తం పార్టీ ఘంటాపథంగా ఘనవిజయం సాధిస్తుందన్న సర్వేల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి తీవ్ర పోటీ నెలకొంది. సర్వే విషయాలను పక్కన పెడితే అధికార పార్టీని ఓడించి విపక్షాన్ని గద్దెనెక్కించే సంప్రదాయాన్ని గత మూడు దశాబ్దాలుగా పాటిస్తున్న పశ్చిమ రాష్ట్రం రాజస్థాన్ లో కాంగ్రెస్ నాయకులు సీఎం పదవిపై కన్నేశారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్, పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇద్దరిలో ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఓబీసీ నాయకుడైన అశోక్ గెహ్లెట్ గతంలో రెండు సార్లు సీఎంగా పనిచేశారు. 1998-2003, 2008-2013 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా గెహ్లెట్ పనిచేశారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా ఢిల్లీలో అధిష్టానానికి దగ్గరగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్నారు. సామాజిక వర్గం, విధేయత, అనుభవం ప్రాతిపదికగా సీఎం పదవి కోసం ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మాజీ కేంద్రమంత్రి దివంగత నాయకుడు రాజేష్ పైలట్ కుమారుడైన సచిన్ పైలట్ యువనాయకుడు. ప్రజల్లో మంచి పట్టుంది. పీసీసీ చీఫ్ గా రాష్ట్రంలో పార్టీని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇటీవల లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఆయన సామర్థ్యానికి నిదర్శనం. అన్నింటికీ మించి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఇద్దరూ సమకాలికులు కావడం విశేషం. ఈ నేపథ్యంలో అధికార పీఠంపై గట్టి ఆశలే పెట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభిచారు.

ఇద్దరి మధ్యనే......

మధ్యప్రదేశ్ లో సర్వే ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ హస్తం పార్టీ నాయకులు విజయంపై విశ్వాసంతో ఉన్నారు. 2003 నుంచి పదిహేనేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈ దఫా ధీమాగా ఉన్నారు. పీసీసీ చీఫ్ కమల్ నాథ్, రాజ కుటుంబీకుడు జ్యోతిరాదిత్య సింథియా సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన కమల్ నాథ్ సీనియర్ నాయకుడు. కమల్ నాథ్ మాదిరిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన యువనాయకుడు జ్యోతిరాదిత్య సింధియాకు ప్రజల్లో పట్టుంది. మాజీ కేంద్ర మంత్రి, దివంగత నాయకుడు మాధవరావు సింధియా కుమారుడైన జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం గుణ పార్లమెంటు నియోజవర్గం ఎంపీగా ఉన్నారు. రాహుల్ బృందంలోని ముఖ్యుల్లో ఒకరు. గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన సింధియా రాహుల్ సమకాలీకుడు. బింద్వారా ఎంపీ అయిన కమల్ నాధ్ అనేక డక్కామొక్కీలు తిన్న సీనియర్ నాయకుడు. ఢిల్లీ నేతలతో సత్సంబంధాలున్నాయి. ఇద్దరూ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.

ఉట్టి కొడతామని.....

గత పదిహేనేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఛత్తీస్ ఘడ్ పై హస్తం పార్టీ ఈసారి ఆశలు పెట్టుకుంది. సహజ సంపద రాష్ట్రంగా పేరొందిన ఇక్కడ పార్టీలో పలువురు సీఎంగా పోటీ పడుతున్నప్పటికీ ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. పీసీసీ చీఫ్ భూపేష్ భగత్, టీ.ఎస్. డియో పోటీ పడుతున్నారు. 90 స్థానాలు గల ఛత్తీస్ ఘడ్ లో గత మూడుసార్లు తక్కువ ఓట్ల తేడాతో హస్తం పార్టీ అధికారానికి దూరంగా నిలిచిపోయింది. ఈసారి "ఉట్టి" కొడతామని నాయకులు ధీమాగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణలో కూడా తీవ్ర పోటీ నెలకొంది. పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి తో పాటు పీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు, కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క పోటీ దారులు. హనుమంతరావు (బీసీ), భట్టి విక్రమార్క(ఎస్.సి) సామాజికవర్గం కోణంలో పదవిని ఆశిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు పార్టీ విజయం సాధిస్తే పార్టీ ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి. ఏది ఏమైనప్పటికీ రెడ్డి సామాజికవర్గం నుంచే ముఖ్యమంత్రి ఉంటారని అంచనా. చిన్న రాష్ట్రమైన మిజోరాంపై పెద్దగా అంచనాలు లేవు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండో రాష్ట్రం ఇదే కావడం విశేషం. ప్రస్తుత ముఖ్యమంత్రి లాల్ తన్ వాలా పార్టీని గెలిపిస్తే ఆయనే ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఒకరిద్దరు పోటీ పడుతున్నప్పటికీ అధిష్టానం లాల్ తన్ వాలాను కాదనే పరిస్థితి లేదు. కనీసం కొన్ని రాష్ట్రాల్లో గెలిచినా మళ్లీ ఢిల్లీ నేతల హడావిడి తప్పదు.

 

 

-ఎడిలోరియల్ డెస్క్

Similar News