రాహుల్ అదే ఫార్ములాతో…!!

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో ఎత్తుకున్న నినాదం సత్ఫలితాలనివ్వడంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ నినాదంతోనే ముందుకు వెళ్లాలని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు [more]

Update: 2019-02-03 18:29 GMT

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో ఎత్తుకున్న నినాదం సత్ఫలితాలనివ్వడంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ నినాదంతోనే ముందుకు వెళ్లాలని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారు. ప్రధానంగా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను తమ పార్టీ వైపు తిప్పుకుంటే విజయం సులువవుతుందని నమ్మకంతో ఉన్నారు మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఇదే జరగడంతో అదే ఫార్ములాను వచ్చే ఎన్నికల్లో అనుసరించాలని నిర్ణయించారు. అన్నదాతలకు చేరువయితే ఓటు బ్యాంకు పెరుగుతుందన్న ధీమాతో రాహుల్ గాంధీ ఉన్నారు. రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదన్న విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు.

మూడు రాష్ట్రాల్లో గెలుపునకు….

రైతు రుణమాఫీ అంశంతోనే కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికల్లో విజయం సాధించారు. అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీని అమలు చేశారు. దీంతో రైతుల పక్షాన స్వరం మరింత పెంచాలని యువనేత రాహుల్ భావిస్తున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా వ్యవసాయ మ్యానిఫేస్టోను విడుదల చేయాలని హస్తం పార్టీ ఇప్పటికే ఒక డెసిషన్ కు వచ్చింది. అందులో భాగంగనే ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఆ పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఒక సదస్సును కూడా నిర్వహించారు.

వ్యవసాయ మ్యానిఫేస్టోను….

ఈ సదస్సులను దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించి రైతు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారాలను మ్యానిఫేస్టోలో పెట్టనున్నారు. తద్వారా కర్షకులకు దగ్గరయితే సునాయాస విజయం వరిస్తుందని హస్తం పార్టీ భావిస్తుంది. రైతు సంక్షేమమే ఎజెండాగా ముందుకు వెళ్లనుంది. కిసాన్ సెల్ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి రైతు సమస్యలపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించాలని రాహుల్ నేతలను ఆదేశించారు. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలని రాహుల్ నమ్ముతున్నారు.

పెట్టుబడి పథకమూ….

కాంగ్రెస్ ప్రకటించనున్న మ్యానిఫేస్టోలో రైతు పెట్టుబడి పథకం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ దేశంలోని పేదలను ఆదుకునేందుకు నిర్దిష్ట ఆదాయాన్ని వారికి సమకూరుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతులకు కనీస మద్దతు ధర అందకపోవడం, నకిలీ విత్తనాలను అరికట్టడంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే అన్నాదాతలు అష్టకష్టాలు పడుతున్నారన్న భావన సదస్సుల్లో వ్యక్తమవుతోంది. రైతుల కోసం ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో రాహుల్ ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పంటల బీమా పథకాన్ని వర్తింప చేయాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. ఇక రైతు సమస్యలపై స్వరం పెంచి వారిని ఆకట్టుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించనుంది. మరి ఈ ప్రయత్నంలో ఆ పార్టీ ఎంతవరకూ సఫలీకృతమవుతుందో చూడాలి.

Tags:    

Similar News