“పవర్” చూపించడానికి రెడీ అయ్యారా?

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ [more]

Update: 2019-01-13 17:30 GMT

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు సంకటంగా మారింది. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ 38, బీఎస్పీ 38 సీట్లను పంచుకుంది. అమేధీ, రాయబరేలీని మాత్రం కాంగ్రెస్ కు వదలేయాలని నిర్ణయించింది. ఎస్పీ, బీఎస్పీల నిర్ణయంతో కాంగ్రెస్ నిరాశకు గురయింది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు పెద్దగా బలం లేదని గ్రహించిన మాయావతి, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ ను దూరం పెట్టారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు డైవర్ట్ కాదని గ్రహించే వీరిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

గౌరవిస్తానని చెప్పినా…..

అయితే ఎస్పీ, బీఎస్పీల పొత్తుపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. వారి పొత్తులను గౌరవిస్తానని చెప్పడంతో పాటు, పూర్తి సామర్థ్యంతో పోరాడతామని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల విజయాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ స్పందన ఇలా ఉంటే మిగిలిన అగ్రనేతలు మాత్రం విభిన్న రీతుల్లో స్పందించారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాత్రం యూపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోట ీచేస్తుందన్నారు. ఆ శక్తి యూపీలో తమకుందని, తమకు తక్కువగా అంచనా వేస్తే వారే నష్టపోతారని పరోక్షంగా మాయావతి, అఖిలేష్ యాదవ్ లకు సంకేతాలు పంపారు.

కష్టమేనంటున్న సీనియర్లు…..

మరోసీనియర్ నేత ఆంటోని మాత్రం విభిన్నంగా స్పందించారు. భారతీయ జనతా పార్టీని, మోదీని ఒడించాలంటే ఒంటరిగా పోరు చేయడం అసాధ్యమని ఆంటోని తేల్చారు. కాంగ్రెస్ కు మోదీని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు లేవన్నారు ఆంటోని. అలా కాంగ్రెస్ పార్టీలోనే ఎస్పీ, బీఎస్పీ మాయావతిల పొత్తుపై విభిన్న స్పందనలు రావడం ఆ పార్టీ కొంత ఇబ్బంది పడుతుందన్నదని విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో రెండు స్థానాలకే పోటీ చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని కాంగ్రెస్ లో అత్యధిక మంది నేతలు భావిస్తున్నారు.

పోటీకి సిద్ధమవుతారా?

దీంతో రాహుల్ గాంధీ త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈలోపు యూపీలో కాంగ్రెస్ పరిస్థితిని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, యూపీ పీసీసీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ లు సమీక్షిస్తున్నారు. యూపీలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉండటమే కాకుండా పటిష్టమైన క్యాడర్ ఉందన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఎస్పీ, బీఎస్పీలు పోటీ చేసినా తాము కూడా గెలవగలిగిన స్థానాల్లో పోటీ చేయడం మంచిదని యూపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. లేకుంటే యూపీలో ఇక కాంగ్రెస్ నేలమట్టం అయిపోతుందన్న ఆందోళన వారిలో కనపడుతోంది. ఎన్ని సీట్లలో పోటీకి దిగుతామన్నది స్పష్టం కాకున్నా… కాంగ్రెస్ కూడా యూపీలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అయిపోతున్నట్లే కన్పిస్తోంది.

Tags:    

Similar News