తెలంగాణపై రాహుల్ వ్యూహమదేనా..?

తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి గత రెండు అసెంబ్లీ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల [more]

Update: 2019-02-08 09:30 GMT

తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి గత రెండు అసెంబ్లీ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మిగతా మూడు రాష్ట్రాల్లో గెలిచినా తెలంగాణలో మాత్రం చతికిలపడింది ఆ పార్టీ. ఇక, పార్లమెంటు ఎన్నికల రూపంలో మరో పరీక్ష ఎదురుకానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణపై దృష్టి సారించారు. తెలంగాణ పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆయన వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఓటమికి కారణాలుగా డబ్బు ప్రభావం, టీడీపీతో పొత్తు, ఈవీఎంల పనితీరు, కేసీఆర్ సంక్షేమ పథకాల పట్ల సానుకూలత వంటి వివరణలను ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీకి ఇచ్చుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరి పోరు చేయాలని నేతలు రాహుల్ కు సూచించారు. దీంతో ఆయన సైతం ఈ మేరకు అంగీకరించినట్లు సమాచారం.

ఖమ్మం నుం పోటీ చేయాలని…

ఇక, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని మరో కోరిక కోరారు. ఆయనను తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా వినవించారు. దీనికి రాహుల్ నుంచి సానుకూల స్పందనే వచ్చిందట. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల సరళి చూస్తే ఖమ్మం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో మహాకూటమికి మెజారిటీ వచ్చింది. దీంతో ఖమ్మం అయితే సేఫ్ సీట్ అనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. తెలంగాణలో కనీసం ఏడెనిమిది పార్లమెంటు స్థానాలు గెలవాలని భావిస్తున్న పీసీసీ పెద్దలు… రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందని, కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇందిర బాటలో నడుస్తారా..?

రాహుల్ గాంధీ గత మూడు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన అక్కడ పోటీ చేయడం ఖాయమైంది. అయితే, అమేథీతో పాటు ఖమ్మంలోనూ పోటీ చేయాలని పీసీసీ నేతలు కోరారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే పార్టీ బలోపేతమవుతుందని భావిస్తున్నారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా పోటీ జరగడంతో తాము తీవ్రంగా నష్టపోయామని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఈసారి అటువంటి పరిస్థితి రావద్దనుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా జరిగితే కచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వస్తాయని ఆశతో ఉన్నారు. అయితే, పీసీసీ నేతల కోరిక మేరకు రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీలో ఉంటే మాత్రం పార్లమెంటు ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్న టీఆర్ఎస్ వ్యూహానికి బ్రేక్ పడే అవకాశం ఉంది. మరి రాహుల్ గాంధీ నాయినమ్మ బాటలో తెలంగాణకు వస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News