బాబా అయితేనే బెటర్....!

Update: 2018-08-06 15:30 GMT

రాజకీయమంటేనే విచిత్రం. స్నేహితులు, శత్రువులు కలిసే ఉంటారు. సందర్భాన్ని బట్టి పాత్రోచితంగా బయటపడుతూ ఉంటారు. గోడమీద పిల్లివాటంగా లౌక్యం ప్రదర్శించేవారికీ కొదవ ఉండదు. అటుఇటు దూకేవారు, కోవర్టులు కోకొల్లలు. తాజా జాతీయ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ తొంగి చూస్తోంది. రాహుల్ గాంధీని ప్రొజెక్టు చేయడంపై కాంగ్రెసు పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. అది ఆ పార్టీకి తక్షణ అవసరం. రాహుల్ నాయకత్వ సామర్ధ్యంతో పార్టీ పునరుజ్జీవం పొందాలనే భావనలో ఉన్నారు కాంగ్రెసు నాయకులు. పార్టీ భుజస్కంధాలపై వారసుడిని కూర్చోబెట్టారు. యువనేత ఆశలు, ఆశయాలు మంచిగానే ఉన్నప్పటికీ జనాకర్షణ విషయంలో ఇంకా పుంజుకోలేకపోతున్నారు. ఇందిర, నెహ్రూ స్థాయి ఆదరణ పొందగలిగితే మాత్రమే బీజేపీకి పోటీ ఇవ్వగలరు. బీజేపీ గతంలో మాదిరిగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పార్టీ కాదు. మూలమూలలకు విస్తరించిన మహావృక్షం. ప్రధానిగా మోడీ వంటి నేత నాయకత్వం ఆపార్టీలో పోటీ తత్వం తెచ్చిపెట్టింది. అమిత్ షా వంటి దీక్షాదక్షుడు అసెట్ గానిలుస్తున్నాడు. కాంగ్రెసులో ఈ లక్షణాలు లోపించాయి. దీనిని అధిగమించడంపై గ్రాండ్ఓల్డ్ పార్టీ దృష్టి పెట్టాల్సి ఉంది.

రాహుల్ బాబా.. రా..రా ...

కమలం పార్టీలో ఇంకా కొన్ని అనుమానాలున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెసు, ఇతర పార్టీలు ఏకతాటిపైకి వస్తే బీజేపీకి ఇబ్బంది ఎదురవుతుందేమోననే సందేహాలున్నాయి. మోడీ,అమిత్ షా వైఖరి కారణంగా పార్టీలోనూ కొంత అసంతృప్తి నెలకొంది. ప్రాంతీయ పార్టీల అధినేతలు, కాంగ్రెసు,వామపక్షాల సంగతి చెప్పనక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019లో బీజేపీని నిరోధించాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికోసం రాజకీయంగా రాజీ పడేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ప్రాంతీయ పార్టీల్లో బలమైన నాయకులు చాలామంది ఉన్నారు. దేశవ్యాప్తంగా వారికి ఇమేజ్ ఉంది. వారిలో ఒకరిని మోడీకి ప్రత్యామ్నాయంగా బరిలో నిలిపి ఎన్నికలకు వెళితే గట్టిపోటీ ఎదురవుతుంది. బీజేపీ గెలుపు నల్లేరుపై బండి నడక మాదిరిగా ఉండదు. కేంద్రం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు చర్చకు వస్తాయి. సమర్థనాయకత్వంతో ఐక్య కూటమిగా విపక్షాలు పోటీకి తలపడితే కమలానికి కష్టాలు తప్పవు. అందువల్లనే రాహుల్ గాంధీ నాయకత్వంతో కాంగ్రెసుతో ముఖాముఖి పోటీ అయితే బాగుంటుందనే భావన బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. నాయకత్వ సామర్ధ్యం విషయంలో మోడీ, రాహుల్ ను పోల్చి చూసినప్పుడు కచ్చితంగా ప్రధాని పైచేయి సాధిస్తారు. అందువల్ల రాహుల్ బాబా తోనే తమకు పోటీ అనే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు కమలం పార్టీ నాయకులు.

మమత..మాధుర్యం...

మమతా బెనర్జీకి వాస్తవపరిస్థితులు ఒక్కటొక్కటిగా అర్థమవుతున్నాయి. ముస్లిం ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టి హిందు ఓట్లను నిర్లక్ష్యం చేసింది. ఇది వచ్చే ఎన్నికల్లో తృణమూల్ ను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. గతంలో వామపక్షాలు ముస్లింలకు పెద్దపీట వేయడంతో వారి ఓటు బ్యాంకుకు మమత సక్సెస్ పుల్ గా చిల్లు పెట్టగలిగారు. పశ్చిమబంగలో 27 శాతంపైగా ముస్లింలు ఉన్నారు. ఆ ఓట్లు పక్కనపెట్టి మెజార్టీ హిందువులను ఆకట్టుకునే పనిలో పడింది కమలం పార్టీ. తృణమూల్ తర్వాత జనాదరణలో ద్వితీయస్థానానికి చేరిపోయింది. వామపక్షాలు, కాంగ్రెసు పూర్తిగా బలహీనపడిపోయాయి. హిందూ ఓటు పోలరైజ్ అయితే టీఎంసీ కి చిక్కులు తప్పవు. నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ వంటి ప్రయత్నాల ద్వారా బీజేపీ బలపడే యత్నాలు చేస్తోంది. భావోద్వేగంతో ముడిపడిన ఈ అంశం ఓట్లు కురిపించే అవకాశాలున్నాయి. దీంతో కమలం పార్టీయే తనకు ప్రథమశత్రువు అన్న విషయాన్ని జీర్ణించుకోకతప్పనిస్థితి ఏర్పడింది. నిన్నామొన్నటివరకూ రాహుల్ గాంధీ పెత్తనాన్ని సహించడానికి ఇష్టపడని మమత బెనర్జీ తనంతట తాను సోనియా ,రాహుల్ తో భేటీ అయ్యారు. ప్రధాని పదవి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందుగా కలిసిపనిచేద్దామని ప్రతిపాదించారు. ఇది గత వైఖరికి భిన్నం. రాజీధోరణిలోకి వచ్చేసినట్లే. ప్రతిపక్షాలకు ఇది ప్లస్ పాయింట్.

బాబు చేతిలో చక్రం...?

మమత,మాయావతి, అఖిలేష్, రాహుల్ వంటి వారితో పోలిస్తే చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయవేత్త. ఇప్పడు ఎన్డీఏ గూటిలో ఉన్న నితీశ్ తో పోల్చినా రాజకీయానుభవం విషయంలో చంద్రబాబుదే పైచేయి. అందులోనూ దక్షిణాది నాయకుడన్న అడ్వాంటేజీ ఉంది. జాతీయంగా గతంలో కీలకపాత్రధారిగా వ్యవహరించారు. చంద్రబాబును ప్రత్యామ్నాయ నేతగా, మధ్యేవాద నాయకునిగా ప్రొజెక్టు చేయగలిగితే జాతీయంగా ప్రభావం ఉంటుందనే అంచనా ఉంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ రొట్టి విరిగి నేతిలో పడ్డట్టే. తామంతా కలహించుకోవడం కంటే రాజకీయ చాణక్యం తెలిసిన బాబును ముందుకు తీసుకురావడమే మేలు. మమత, మాయావతి ఇప్పటికే ఈవిషయంలో ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. మోడీని ఎదుర్కోవడానికి అనుభవజ్ణుడైన వ్యక్తే అవసరమని కాంగ్రెసు కూడా భావిస్తోంది. అయితే రాహుల్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా మధ్యేమార్గంలో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే బాధ్యతను మమతాబెనర్జీ కే అప్పగించినట్లు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. ముందుగా మోడీ గెలుపు పరంపరను నిరోధించకపోతే 2019 తర్వాత ప్రతిపక్షాల జాడ లేకుండా పోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని అందరూ గ్రహించారు. అందుకే కొంత రాజీకి, సర్దుబాట్లకు సిద్దమవుతున్నారు. రానున్న రెండు మూడు నెలలు రాజకీయ విన్యాసాలు వేగంగా మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News