రాహుల్ గేమ్ ప్లాన్ ఏంటో?

కాంగ్రెస్ పార్టీ దాదాపు కుదేలయ్యే పరిస్థతి నెలకొంది. సోనియా గాంధీ అనారోగ్యంతో ఉండటం, రాహుల్ గాంధీ యాక్టివ్ గా లేకపోవడంతో కాంగ్రెస్ రానున్న ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందన్న [more]

Update: 2020-02-25 16:30 GMT

కాంగ్రెస్ పార్టీ దాదాపు కుదేలయ్యే పరిస్థతి నెలకొంది. సోనియా గాంధీ అనారోగ్యంతో ఉండటం, రాహుల్ గాంధీ యాక్టివ్ గా లేకపోవడంతో కాంగ్రెస్ రానున్న ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. రాహుల్ గాంధీని తిరిగి పార్టీ అధ్యక్ష పీఠం పై కూర్చోపెట్టాలన్న వత్తిడి పెరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

సీనియర్లతోనే నడిపించి….

తర్వాత తాత్కాలికంగా పార్టీ అధ్యక్ష్య బాధ్యతలను చేపట్టిన సోనియా గాంధీ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనలేక పోతున్నారు. టెన్ జన్ పథ్ ను దాటి బయటకు రాలేకపోతున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనలేదు. రాహుల్ గాంధీ కూడా ఈ ఎన్నికల్లో పెద్ద యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేదు. అభ్యర్థుల ఎంపిక, గ్రూపు తగాదాలను పరిష్కరించే బాధ్యతలను సోనియా గాంధీ సీనియర్లక అప్పగించి మమ అనిపించేశారు.

బీహార్ లో మాత్రం…..

ఇక త్వరలో పశ్చిమ బెంగాల్, బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ ను పక్కన పెడితే బీహార్ లో కాంగ్రెస్ కు కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ లు కలసి కష్టపడితే విజయం సాధించే అవకాశాలు కూడా లేకపోలేదు. లాలూ యాదవ్ ను జైల్లో ఉంచడం, పౌరసత్వ చట్ట సవరణ, నితీష్ కుమార్ పాలనపై అసంతృప్తి వెరసి కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి గెలుపు సాధ్యమవుతుందన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.

చేపట్టాల్సిందేనా?

పశ్చిమ బెంగాల్ లో గెలవకపోయినా కనీస స్థానాలు సాధించాలన్నా, అక్కడ నాయకులను, క్యాడర్ ను నిలుపుకోవాలన్నా రాహుల్ గాంధీ రంగంలోకి దిగాల్సి ఉందంటున్నారు. అందుకోసమే రాహుల్ ను తిరిగి అధ్యక్ష పదవి చేపట్టాలని పార్టీ సీనియర్ నేతలు కోరుతున్నారు. అధ్యక్ష బాధ్యతలతో సోనియా ఆరోగ్యం మరింత దిగజారడంతో రాహుల్ గాంధీ తప్పనిసరిగా బాధ్యతలను చేపడతారని సీనియర్లు భావిస్తున్నారు. రాహుల్ రాక కోసం ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News