ఇక అంతా రాహుల్ మయమే.. అందుతున్న సంకేతాలు

పేరుకే సోనియా గాంధీ. ఇక నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీవే. పార్టీలో జరిగిన ప్రక్షాళన దీనికి నిదర్శనమంటున్నారు. సోనియా కూడా ఇక రాహుల్ నిర్ణయాలకే పూర్తిగా వదిలేశారు. సోనియా [more]

Update: 2020-09-12 17:30 GMT

పేరుకే సోనియా గాంధీ. ఇక నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీవే. పార్టీలో జరిగిన ప్రక్షాళన దీనికి నిదర్శనమంటున్నారు. సోనియా కూడా ఇక రాహుల్ నిర్ణయాలకే పూర్తిగా వదిలేశారు. సోనియా పేరిట ఆదేశాలు వెలువడుతున్నా అవి పూర్తిగా రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే తయారయినవని అంటున్నారు. ఇటీవల సీనియర్ నేతలు పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పడంపై సోనియా సయితం సీరియస్ గానే ఉన్నారట.

రాహుల్ నిర్ణయాలే ఫైనల్…..

అందుకోసమే రాహుల్ నిర్ణయాలే పార్టీలో ఫైనల్ అని సంకేతాలు నేతలకు పంపుతున్నారు. నిజానికి సోనియా గాంధీ ఇక పార్టీని నడపలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా ఎన్నికల సమయంలోనూ ప్రచారానికి తిరగలేరు. మొన్నటి ఎన్నికల్లోనే సోనియా ప్రచారానికి దూరంగా ఉన్నారు. అంతా రాహుల్ గాంధీయే చూసుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి పార్లమెంటు ఎన్నికల వరకూ రాహుల్ గాంధీయే ప్రచార బాధ్యతలను తీసుకున్నారు.

కష్టం అంతా….

కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో కాంగ్రెస్ గెలిచిన వెంటనే సీనియర్లు సోనియా వద్ద వాలిపోయారు. ముఖ్యమంత్రి పదవులను దక్కించుకున్నారు. కష్టం రాహుల్ ది.. ఫలితం సీనియర్లది అన్నట్లుగా ఉంది. అయినా తల్లి మాట కాదనలేక అంగీకరించిన రాహుల్ కు ఇది సరైన సమయం అని భావిస్తున్నారు. సీనియర్లను పక్కన పెట్టేందుకు నిర్ణయించకున్నారు. అందుకే మొన్న గళం విప్పిన నేతలను ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వకూడదని రాహుల్ నిర్ణయించుకున్నారు.

వీర విధేయులకే….

అందువల్లనే పార్టీలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను సీడబ్ల్యూసీ లో పక్కన పెట్టారు. పార్టీకి వీర విధేయులకే సీడబ్ల్యూసీలో స్థానం కల్పించారు. ఎంపిక మొత్తం రాహుల్ గాంధీయే చూశారంటున్నారు. సోనియా కేవలం ఆమోద ముద్ర మాత్రమే వేశారంటున్నారు. అధ్యక్ష్య పదవిలో లేకున్నా అంతా రాహుల్ గాంధీ చెప్పినట్లే పార్టీలో నడుస్తుందని చెప్పడానికి ఈ ప్రక్షాళన అని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ లో ఎటూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టక తప్పదు. అందుకే రాహుల్ ఇష్టానుసారమే ఇక సోనియా వ్యవహరించనున్నారు.

Tags:    

Similar News