రాహుల్ కనెక్ట్….అందుకేనా..?

రాహుల్ కు రాజకీయాలంటే ఆసక్తి లేదు. పార్టీని పట్టించుకోరనే విమర్శ ఉంది. పెద్ద వయసులోనూ సోనియా గాంధీనే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాల్సిన అనివార్యతకు రాహుల్ గాంధీ నిరాసక్తతే [more]

Update: 2021-03-24 16:30 GMT

రాహుల్ కు రాజకీయాలంటే ఆసక్తి లేదు. పార్టీని పట్టించుకోరనే విమర్శ ఉంది. పెద్ద వయసులోనూ సోనియా గాంధీనే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాల్సిన అనివార్యతకు రాహుల్ గాంధీ నిరాసక్తతే కారణమనే వాదన కూడా ఉంది. కానీ పార్టీ ఏకగ్రీవంగా కోరుకుంటున్నది అతని నాయకత్వమే. అధ్యక్ష పదవి సిద్ధం చేసి ఉంచిన కుర్చీలాంటిదే. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాను అధిష్టించడమే అని రాహుల్ కు తెలుసు. అసలు కావాల్సిన పని వేరే ఉంది. దానిని సాధించిన తర్వాతనే తాను పీఠం ఎక్కాలనుకుంటున్నారు. పార్టీ దేశ ప్రజలకు ఎందుకు దూరమైంది? నిజంగా తన నుంచి దేశం ఏమి ఆశిస్తోంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో పడ్డారు కాంగ్రెసు వారసుడు అంటున్నారు పరిశీలకులు. యువతరం కాంగ్రెసు పార్టీ విధానాల పట్ల ఆసక్తి చూపడం లేదు. మైనారిటీల పట్ల సానుకూల ద్రుక్పథం ఉంటుందనే ముద్ర పార్టీపై బలంగా పడిపోయింది. మత విశ్వాసం ఎక్కువగా ఉండే హిందువులు పార్టీకి దూరం అయ్యారు. అదే సమయంలో ఇంతవరకూ అండగా ఉన్న ముస్లింలు, దళితులు విభిన్న పార్టీలను ఎంచుకున్నారు. పలితంగా రెంటికీ చెడ్డ రేవడిగా మారింది కాంగ్రెసు. అటు మెజార్టీ హిందువుల ఓట్లను చేజార్చకుని, ఇటు ముస్లిం, దళిత్ కాంబినేషన్ కూడా ఆదరించక అన్యాయమైపోయింది. దీని నుంచి బయటపడే ప్రయత్నాల్లో భాగంగా మతాలు, కులాలకు అతీతంగా యువతతో కనెక్టు కావాలనేది రాహుల్ ప్రస్తుత ప్రయత్నమని చెబుతున్నారు కాంగ్రెసు వర్గీయులు.

అజెండా ఒకటే..

మత పరమైన అంశాలను మినహాయిస్తే పాలనపరమైన అజెండాలో బీజేపీ, కాంగ్రెసుల మధ్య పెద్ద తేడాలు లేవు. సంస్కరణలు, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ ల అంశంలో రెండూ పార్టీలది ఒకటే ధోరణి. కాంగ్రెసు కొంచెం మందకొడిగా ఆచరణలోకి తెస్తుంది. బీజేపీ వేగంగా చేస్తుంది. అదే వీటి మధ్య తేడా. కానీ కాంగ్రెసు ఒక సంస్కరణను ప్రవేశపెడితే నెగిటివ్ ప్రచారంతో దేశంలో గందరగోళం చెలరేగుతోంది. అదే బీజేపీ అమలు చేస్తే కరిష్మాటిక్ లీడర్షిప్ కారణంగా పాజిటివ్ వేవ్ తయారవుతోంది. దీనికి మతపరమైన అభిమానాలూ కారణమవుతున్నాయి. మరో విడత ఎన్నికల వరకూ బీజేపీ సంకీర్ణాన్ని కూలదోసి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. 2024లోనూ ఏదో రకంగా ఎన్డీఏ గట్టెక్కుతుందని కాంగ్రెసు నేతలు అంతర్గతంగా ఒప్పుకుంటున్నారు. ఆర్థిక వ్యవహారాలు, ప్రాంతీయ పార్టీల అనుచిత డిమాండ్ల నేపథ్యంలో దేశం క్లిష్టమైన పరిస్థితుల్లోనే ఉంది. ఈ దశలో మోడీ వంటి మొండి నాయకుడే అవసరం. తాను చేయాల్సిందంతా చేసి పారేస్తారు. ఆ క్రమంలో ప్రజావ్యతిరేకత వస్తుంది. అయినా లెక్క చేయరు. కానీ కాంగ్రెసు సున్నితమైన పార్టీ. దేశానికి అవసరమైన అజెండాను హస్తం పార్టీ అధినాయకత్వం ప్రజావ్యతిరేకంగా ఆచరణలోకి తేవడం కష్టమని సీనియర్ నేతలు చెబుతున్నారు. ఆ పనేదో మోడీనే చేస్తారనుకుంటున్నారు. తర్వాత ఒకే దేశం ఒకే విధానం అన్నరీతిలో సుక్షేత్రం తయారవుతుంది. స్వాతంత్ర్యం అనంతరం తొలినాళ్లలో కాంగ్రెసు కు లభించిన అవకాశం అదే. మళ్లీ ఆ తరహా వ్యవస్థకు అనువైన వాతావరణం మోడీ కల్పిస్తారని భావిస్తున్నారు.

మోడీ తర్వాత…?

మోడీ తర్వాత బీజేపీకి పెద్ద నాయకులెవరూ కనిపించడం లేదు. అమిత్ షా కు ప్రజల్లో అంతటి ఆదరణ లేదు. మోడీ ఛాయగా మాత్రమే ఆయనకు ఇమేజ్ ఉంది. అందుకే పార్టీ ఆయన మాట వింటోంది. ఒక్కసారి మోడీ రంగంలోంచి తప్పుకుంటే షా నామమాత్రమైపోతారు. మోడీ సృష్టించిన నాయకత్వ శూన్యత పార్టీని ఒకటి రెండు దశాబ్దాలు వెన్నాడవచ్చు. జాతీయ పార్టీగా కాంగ్రెసుకు అది చక్కని అవకాశం. దానికి అవసరమైన సరంజామాను సిద్దం చేసుకుంటున్నారు రాహుల్. యువతరం ద్వారానే కాంగ్రెసు భవిష్యత్ కు ఊపిరి పోయాలని కలలు కంటున్నారు. కళాశాలల్లో పిల్లలతో బస్కీలు తీస్తున్నారు. కరాటే చేస్తున్నారు. సడన్ గా నీటిలోకి దూకి స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇవన్నీ గిమ్కిక్కులే. కానీ యూత్ కు కనెక్ట్ కావడానికి ప్రదర్శిస్తున్న విద్యలు. వయసులో పెద్దవాడైనా మోడీ యువతను ఆకట్టుకోగలుగుతున్నారు. రాహుల్ ఈ విషయంలో వైఫల్యం చవి చూస్తున్నారు. దానిని భర్తీ చేసుకునేందుకు యువతతో కలిసి పోయే చర్యలను ఇటీవల మరింతగా పెంచేశారు రాహుల్.

సింగిల్ చాయిస్…

అర్ధ శతాబ్దం పైగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెసు పార్టీకి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. ఇప్పటికీ బీజేపీ ఇంకా పట్టు సాధించని ప్రాంతాల్లో కూడా కాంగ్రెసుకు పునాదులున్నాయి. పార్టీకి కార్యకర్తలు, చోటా నాయకులు భారీగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం స్తబ్ధత ఆవరించింది.పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. రానున్న రెండు మూడు సంవత్సరాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా అచేతన నుంచి పార్టీని బయటపడేయాలనేది అధిష్ఠానం యోచన. ఇందుకు దేశవ్యాప్తంగా రాహుల్ సన్నాహక పర్యటనలు చేస్తారని తెలుస్తోంది. తర్వాత యువజనసమ్మేళనాలు, సాంస్కృతికోత్సవాల ద్వారా పార్టీని పునరుజ్జీవింపచేస్తూ కార్యకర్తల్లో సందడి నింపాలనేది ఆలోచన. మరో విడత మోడీ ఎన్నికైనప్పటికీ ఆ తర్వాత బీజేపీ ప్రాభవం క్షీణిస్తుందని అంచనావేస్తున్నారు. తిరిగి కాంగ్రెసు సింగిల్ చాయిస్ గా మిగులుతుందని అప్పటికి అంగబలంతో సిద్ధం కావాలనేది హస్తం పార్టీ నేతల వ్యూహం. వయసు రీత్యా రాహుల్ గాంధీకి ఇంకా చాన్సులుంటాయి కాబట్టి పార్టీ భవిష్యత్తుకు ఢోకా లేదని నాయకులు విశ్వసిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News