లీడర్ ఎవరైనా టీం మాత్రం…?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీ భవిష్యత్ లో బలోపేతం కావాలన్నా, అధికారంలోకి రావాలన్నా సమూల ప్రక్షాళన చేయాలని. అయితే రాహుల్ గాంధీ [more]

Update: 2021-01-31 17:30 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీ భవిష్యత్ లో బలోపేతం కావాలన్నా, అధికారంలోకి రావాలన్నా సమూల ప్రక్షాళన చేయాలని. అయితే రాహుల్ గాంధీ నేరుగా అధ్యక్ష పదవి చేపట్టకపోయినా ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా ఆయన సూచనల మేరకే టీం ఉందంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీలో ఎక్కువ మంది రాహుల్ గాంధీ అనుకున్న నేతలే సభ్యులుగా మారనున్నారు.

తాను అధ్యక్షుడిగా….

ఇప్పటికే ఈ మేరకు సీనియర్ నేతలకు ఉప్పందినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ సీనియర్ నేతలే కాంగ్రెస్ ను శాసిస్తున్నారు. మొన్నటి వరకూ సోనియా గాంధీ నేతృత్వం వహించడంతో ఆమెకు అండగా ఉంటూనే పార్టీని వారి డైరెక్షన్ లోనే నడిపించారు. దీనివల్ల కొన్ని చోట్ల లబ్ది చేకూరినా, ఎక్కువ చోట్ల నష్టపోయిందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నష్టపోవడానికి కారణం సీనియర్ నేతల సలహాలేనని రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి వచ్చారు.

సంస్థాగత ఎన్నికలకు….

త్వరలోనే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలను జరుపుకుంటుంది. ఈ ఎన్నికల ద్వారానే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. రాహుల్ గాంధీ అంగీకరిస్తారా? లేదా? అన్నది ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. రాహుల్ గాంధీ అంగీకరించకపోతే సీనియర్ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశముంది. అది కూడా రాహుల్ కు అనుకూలంగా ఉండే నేతనే అధ్యక్షుడిగా నియమిస్తారు. ఇటీవల పార్టీకి శాశ్వత అధ్యక్షుడు కావాలంటూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో అనేక మందిని పార్టీ పదవుల నుంచి తప్పిస్తారన్న ప్రచారం జరుగుతుంది.

ఏ పదవిలోనూ….

వీరికి పార్టీలో కీలకమైన ఏ పదవి అప్పగించరట. కొత్త టీంను తయారు చేసుకుంటారట. ఇందుకోసం ఇప్పటికే కొందరు యువ నేతల అభిప్రాయాలను రాహుల్ గాంధీ స్వయంగా సేకరిస్తున్నారని చెబుతున్నారు. సచిన్ పైలట్, ప్రియాంక గాంధీ వంటి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొత్త టీం ఎంపికకు కసరత్తు ప్రారంభమయిందట. ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే…పార్టీ అధ్యక్షుడు ఎవరైనా టీంలో మాత్రం రాహుల్ గాంధీ మద్దతుదారులే ఉంటారు. సీనియర్ నేతలు ఇక పక్కకు తప్పుకోవాల్సిందే.

Tags:    

Similar News