రాహుల్ "చేతి"లో జాతకాలు....!

Update: 2018-06-17 16:30 GMT

తెలంగాణలోని కాంగ్రెసు అగ్రనాయకులు అధిష్ఠానానికి తలనొప్పిగా మారబోతున్నారు. 2019 ఎన్నికలకు జోష్ నింపాలంటే కొత్తరక్తం ఎక్కించాలని జాతీయ పార్టీ కాంగ్రెసు ఆలోచిస్తోంది. ఈదిశలోనే రాహుల్ గాంధీ కసరత్తు మొదలు పెట్టారు. కనీసం 30 శాతం యువతకు సీట్లు కేటాయించాలని యోచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కూడా జాబితాలను ఆహ్వానిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. అర్హులైన యువనేతలను ఎంపిక చేయాలని పీసీసీ అధ్యక్షులకు సూచనలు చేస్తున్నారు. జనంలోకి దూసుకుపోయే తత్వం ఉన్న యువతీయువకులను గుర్తించి వారికి రాజకీయ శిక్షణ ఇప్పించాలని ఏఐసీసీ భావిస్తోంది. ప్రదేశ్ కాంగ్రెసు నుంచి అందుతున్న నివేదికలు, సర్వేలు రాహుల్ స్ఫూర్తిని నీరు గారుస్తున్నాయి. మూడు,నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని చవిచూసిన నాయకులు తమ నియోజకవర్గాలను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. పైపెచ్చు మరో కొత్త శిరోభారం తెచ్చిపెడుతున్నారు. అదే వారసుల ప్రతిపాదన. వారి మాటను కాదనలేని స్థితి. ఆయా నాయకులకు ప్రజలు అలవాటు పడిపోయి ఉండటం, పలుకుబడి కూడా తోడవ్వడంతో పీసీసీ, ఏఐసీసీ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మేము..మా వారసులు...

యువ కోటాను తమ వారసులతో భర్తీ చేయాలని మెజార్టీ కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. వెటరన్ నేతలను వదిలించుకోవడమెలా? అని ఆలోచిస్తున్న తరుణంలో తమ సీట్లు తమకే ఇవ్వాలని పెద్ద నాయకులు కచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తాము బరిలో లేకపోతే ప్రత్యర్థి పార్టీకి భారీ లబ్ధి చేకూరుతుందని నివేదికలు సమర్పిస్తున్నారు. గణాంకాల సహా వివరాలు చెబుతున్నారు. తమకున్న అనుచర గణం, తమ రాజకీయ జీవితాల్లో సాధించిన ఎలక్టోరల్ విజయాలను ఏకరవు పెడుతున్నారు. తాము నియోజకవర్గానికి చేసిన సేవలనూ ప్రస్తావిస్తున్నారు. తమకు ప్రజల్లో పలుకుబడి ఉందని స్పష్టం చేస్తున్నారు. టీపీసీసీ ఈ తలనొప్పిని ఎక్కువగా ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తమ పరాజయం కాదని పనిలో పనిగా చెప్పేస్తున్నారు. బలమైన సెంటిమెంటు కారణంగా టీఆర్ఎస్ గెలిచిందని అధిష్టానాన్ని నమ్మింపచేయాలనుకుంటున్నారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పై వ్యతిరేకత ప్రబలిన రీత్యా ఈ సందర్బంలో మరోసారి తమకే అవకాశం ఇస్తే నియోజకవర్గానికి అలవాటు పడిన తాము సులభంగా గెలుపు సాధించగలమని ప్రయివేటు సర్వేల సారాంశాన్ని వెల్లడిస్తున్నారు. పీసీసీ కి ఇప్పటికే ఈమేరకు 32 మంది నాయకులు తమ ఘనతను వెల్లడిస్తూ నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. వీరిలో 12 మంది నాయకులు తమకున్న పరిచయాలతో ఏఐసీసీకి కూడా అవే నివేదికలు పంపినట్లు సమాచారం.

మా హక్కు....

పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా తమ పిల్లలకు సీట్లు ఇవ్వాలనే డిమాండు పెరుగుతోంది. అదే సమయంలో తమను పక్కనపెట్టడానికి కూడా మెజార్టీ నాయకులు అంగీకరించడం లేదు. యువ నాయకుల కోటా కింద తమ వారసులకు అవకాశమివ్వాలనేది వారి కోరిక. అసలు చాలా నియోజకవర్గాల్లో వరసగా ఓటమి చవిచూస్తున్న నాయకులను మార్చేసి కళాశాలల నుంచి ఫ్రెష్ గా వచ్చే ఎన్ఎస్ యూఐ, యువజన కాంగ్రెసు విభాగాలకు చెందిన వారిని ఎన్నికల్లో ప్రోత్సహించాలనేది రాహుల్ ఆశయం. 2019లో అది చెల్లుబాటు అయ్యే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్రస్థాయి అగ్రనాయకులు గట్టిగా పట్టుపడుతుండటంతో టీ పీసీసీ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అందరు పెద్ద నాయకులు తమతోపాటు పిల్లలు, భార్యల టిక్కెట్ల విషయంలోనూ చిట్టాలను ఇప్పటికే సిద్దం చేసుకున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, పీఏసీ ఛైర్మన్, మాజీ మంత్రి గీతారెడ్డి కుమార్తె మేఘన, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదరరాజనరసింహ భార్య పద్మిని , కాంగ్రెసు శాసనసభా పక్షం నేత జానారెడ్డి కుమారుడు రఘురెడ్డి వంటివారంతా తమ అభ్యర్థిత్వాల అప్లికేషన్లతో రెడీ అయిపోతున్నారు. కొత్త నియోజకవర్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు నాయకులు మాత్రం వీలుకాకపోతే తమ నియోజకవర్గాల్లో అయినా వారసులకు అవకాశం ఇవ్వాలని మధ్యేమార్గం సూచిస్తున్నారు. కానీ దానివల్ల పార్టీ నష్టపోతుందని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. తమకూ , వారసులకూ ఏదోరకంగా సర్దుబాటు చేయాలనేదే వారి డిమాండు.

ఇతర పార్టీలకూ ఇబ్బందే...

వారసుల బెడద కేవలం కాంగ్రెసు పార్టీకే పరిమితం కాలేదు. ఇతర పార్టీల్లోనూ ఈ డిమాండు కొనసాగుతోంది. అయితే కాంగ్రెసులో ఉన్న స్థాయి ఒత్తిడి మాత్రం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీలోని పెద్ద నాయకులు సైతం తమ వారసులను అందలం ఎక్కించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఏదో సూచనప్రాయంగా చెప్పడమే తప్ప తీవ్రమైన ఒత్తిడి చేసే అవకాశం లేదు. వారసుల అదృష్టం, సీట్ల కేటాయింపు అనేవి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దయాదాక్షిణ్యాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. నాయకుల సొంతనివేదికలు, సిఫార్సులు పెద్దగా పనిచేయవు. కేసీఆర్ లెక్కలు ఆయనకు ఉంటాయి. నెగ్గే అవకాశం ఉంటే ఆయనే పిలిచి టిక్కెట్లు ఇస్తారని పార్టీ నాయకులు భావిస్తున్నారు. స్పీకర్ మధుసూదనాచారి కుమారుడు ప్రశాంత్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుమారుడు గౌతం, జూపల్లి కృష్ణారావు కుమారుడు అరుణ్ కుమార్, జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, కడియం శ్రీహరి కుమార్తె కావ్య వంటి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఈ సంఖ్య 30 వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.అదంతా అధినేత చల్లని చూపులు ప్రసరిస్తేనే సాధ్యమవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News