ఇద్దరూ మళ్ళీ ఒకేచోట… వైసీపీలో మొదలయిందే?

రెండు కత్తులు ఒకే ఒరలో దూరవు. అసలు సరిపడదు కూడా. రాజకీయాల్లోనూ అంతే. ఎందుకంటే అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే పార్టీలో బలమైనా, బలహీనమైనా ఒక్కరే ఉండాలని కోరుకుంటారు. [more]

Update: 2020-03-31 02:00 GMT

రెండు కత్తులు ఒకే ఒరలో దూరవు. అసలు సరిపడదు కూడా. రాజకీయాల్లోనూ అంతే. ఎందుకంటే అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే పార్టీలో బలమైనా, బలహీనమైనా ఒక్కరే ఉండాలని కోరుకుంటారు. విశాఖ అర్బన్ జిల్లా రాజకీయాల్లో ఆ ఇద్దరూ మైనారిటీ నాయకులకు ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇద్దరూ వృత్తి రిత్యా డాక్టర్లు. సామాజిక వైద్యం చేద్దామని అనుకుని ఇద్దరూ మొదట టీడీపీ ద్వారానే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వారే మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ రహమాన్. టీడీపీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ జహీర్ అహ్మద్. ఈ ఇద్దరూ టీడీపీలో ఉన్నపుడు పదవులో కోసం పోటీ పడ్డారు. విశాఖ సౌత్ నుంచి టికెట్ కోసం రేసులో చివరి దాకా ఉంటూ కత్తులు దూసుకున్నారు.

అక్కడ కూడా….

ఇక రహమాన్ ని టీడీపీ అర్బన్ ప్రెసిడెంట్ కుర్చీ దింపించి తాను ఎక్కారు జహీర్ అహ్మద్. ఆ తరువాత 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు అయింది. రహమాన్ ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. ఆయన వెంటే జహీర్ కూడా టీడీపీ వదిలేసి జై చిరంజీవ అనేశారు. ఇలా ఇద్దరూ అక్కడ కూడా పోటీ పడితే రహమాన్ సతీమణికి మాత్రం ప్రజారాజ్యం టికెట్ దక్కింది. సరే ప్రజారాజ్యం తరఫున ఆమె ఓడారు. ఆ తరువాత ఆ పార్టీ కూడా ఓడి కాంగ్రెస్ లో కలిసింది. ఇక అక్కడ నుంచి రహమాన్ టీడీపీలోకి మళ్ళీ ప్రవేశం చేశారు.

అలా కలిశారు….

ఇవన్నీ ఇలా ఉంటే 2014 ఎన్నికలకు ముందు జహీర్ అహ్మద్ వైసీపీలో చేరి విశాఖ సౌత్ కోసం గట్టిగానే ట్రై చేశారు. అయితే ఆయన్ని కాదని వేరే వారికి టికెట్ ఇవ్వడంతో ఆయన అక్కడ ఉండలేక టీడీపీలోకి వచ్చేశారు. ఇక నాటి నుంచి ఇద్దరూ అధికార టీడీపీలోనే అవకాశాల కోసం పోటీ పడుతూ వచ్చారు. అయితే టీడీపీ జమానా ముగియడం, దారుణంగా ఓడిపోవడంతో రహమాన్ ఈ మధ్యనే తప్పుకుని వైసీపీ నీడకు చేరుకున్నారు. సమయం చూసుకుని జహీర్ కూడా మరో మారు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఇపుడు వైసీపీకి ఈ ఇద్దరు మైనారిటీ నాయకులు రావడంతో సౌత్, నార్త్ అసెంబ్లీ సీట్లలో కొంత బలం వచ్చింది.

ఎవరికి చాన్స్…?

అయితే ఈ ఇద్దరూ నేతలూ పదవుల కోసం పోటీ పడుతున్నారు. నామినేటెడ్ పదవుల వద్దకు వచ్చేసరికి ఈ సీనియర్ నేతలిద్దరూ రేసులో ఉంటున్నారు. దాంతో ఎవరికి ఇస్తారో, ఎవరిని బుజ్జగిస్తారో చూడాలి. మొత్తానికి రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో పోటీ పడిన ప్రతీ సారి రహమానే లబ్దిదారు అవుతున్నారు. అందువల్ల తనను ఈసారి గుర్తించాలని డాక్టర్ జహీర్ కోరుతున్నారు. మరి ఇద్దరినీ న్యాయం చేసేలా వైసీపీ అధినాయకత్వం పదవుల పంపిణీ చేస్తుందా. అలా చేస్తే పార్టీలో మొదటి నుంచి ఉన్న వారి సంగతేంటి అన్నది కూడా పెద్ద చర్చగా ఉంటుంది మరి.

Tags:    

Similar News