అందుకే తప్పుకున్నారటగా….!!!

అక్కడ ఏమీ లేదు… అయినా ఒక నేత కావాలి. పార్టీని నడిపించే సామర్థ్యం, ఆర్థిక స్థోమత ఎవరికీ లేదు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను [more]

Update: 2019-07-07 11:00 GMT

అక్కడ ఏమీ లేదు… అయినా ఒక నేత కావాలి. పార్టీని నడిపించే సామర్థ్యం, ఆర్థిక స్థోమత ఎవరికీ లేదు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను నడిపే నాయకుడు ఎవరు? దేశవ్యాప్తంగా రాహుల్ రాజీనామాకు మద్దతుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా రాజీనామా చేశారనుకున్నారు. కానీ రఘువీరారెడ్డి రాజీనామా చేసింది ఆ కారణం కాదట. ఇక పార్టీని తాను నడపలేనన్న నిర్ణయానికి వచ్చి స్వచ్ఛందంగా ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారట.

జీరో అయిన పార్టీని…..

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జీరో అయింది. 2014 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దూరం పెట్టారు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వక పోవడంతో దాన్ని తమవైపునకు తిప్పుకుని లాభపడదామనుకుంది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకాన్ని ప్రత్యేక హోదా ఫైల్ పై చేస్తామని చెప్పారు. ఏకంగా అధినేత రాహుల్ గాంధీ చేతనే చెప్పించారు. సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.

ఓటు శాతం పెరిగినా….

2019 లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే ఎదురయింది. ఒక్క సీటు కూడా దక్కలేదు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి, సీనియర్ నేతలు శైలజానాధ్ వంటి వారు కూడా ఓట్లు రాబట్టుకోలేకపోయారు. ఎన్నికలకు ముందే సీనియర్ నేతలు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, కిషోర్ చంద్రదేవ్ వంటి వారు వెళ్లిపోయారు. అయితే కొద్దిలో గొప్ప సంతోషించే విషయమేంటంటే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో మూడు శాతం ఓట్లు రావడమే.

ఆర్థికంగా ఆదుకునేవారేరీ?

అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కొనసాగమని కోరినా ఆయన ఆ పనిచేసే అవకాశాలు లేవు. గత ఐదేళ్ల నుంచి ఆర్థికంగా నష్టపోయాయని రఘువీరారెడ్డి ఇప్పటికే సన్నిహితుల వద్ద వాపోతున్నారట. గతంలో కాంగ్రెస్ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా లబ్దిపొందిన నేతలు ఇప్పుడు ముఖం చాటేయడంతో ఏపీ పార్టీని నిధుల కొరత పీడిస్తుంది. మరో ఐదేళ్ల పాటు పార్టీని ఏపీలో నడపడమంటే ఖర్చుతో కూడుకున్నదే. అందుకే రఘువీరారెడ్డి పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారంటున్నారు. మరి కొత్త నేత ఎవరు ముందుకొస్తారనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News