రాజుగారు వాళ్ల సహనాన్ని పరీక్షిస్తున్నట్లుందే…?

నిజానికి ఆయన మొన్నటి వరకూ పారిశ్రామికవేత్త. అదృష్టం బాగుండి చివరి నిమిషంలో పార్టీ మారడంతో పార్లమెంటు సభ్యుడు కాగలిగారు. అయితే పార్టీలో కుదురుగా ఉండకుండా ప్రత్యేక ఇమేజ్ [more]

Update: 2020-08-12 05:00 GMT

నిజానికి ఆయన మొన్నటి వరకూ పారిశ్రామికవేత్త. అదృష్టం బాగుండి చివరి నిమిషంలో పార్టీ మారడంతో పార్లమెంటు సభ్యుడు కాగలిగారు. అయితే పార్టీలో కుదురుగా ఉండకుండా ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకోవాలని కోరుకోవడంతోనే ఆయనను పార్టీ పక్కన పెట్టింది. ఆయనే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ నుంచి సస్పెండ్ కావాలని కోరుకున్నట్టుంది. గత పది రోజుల నుంచి ఢిల్లీ లో కూర్చుని రోజూ మీడియా సమావేశాల్లో రఘురామ కృష్ణంరాజు వైసీపీని ఏకిపారేస్తున్నారు.

అసహనం తెప్పించాలనేనా?

తనకు సంబంధం లేని విషయాలను కూడా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతున్నారు. నిజంగా ఇది వైసీపీకి మింగుడుపడని వ్యవహారమే. ఆయనను పట్టించుకోవడం మానేసినా రోజూ కెలుకుతుండటం పార్టీ అగ్రనేతలకు సయితం అసహనం తెప్పిస్తుంది. రఘురామ కృష్ణంరాజును ఉపేక్షించడం వేస్ట్ అన్న అభిప్రాయం ఇప్పటికీ చాలా మంది నేతల్లో ఉంది. ప్రతిరోజూ వైసీపీ నేతలను, ప్రభుత్వాన్ని విమర్శించడమే రఘురామ కృష్ణంరాజు పనిగా పెట్టుకున్నారు. విజయవాడ అగ్ని ప్రమాదం విషయంలోనూ పార్టీ నేతల వైఖరిని రఘురామ కృష్ణంరాజు తప్పుపట్టారు.

అనర్హత పిటీషన్….

రఘురామ కృష్ణంరాజు పై ఇప్పటికే వైసీపీ నేతలు లోక్ సభ స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇచ్చారు. ఇది ఎంత సమయం పడుతుందో తెలియదు. అప్పటి వరకూ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న విమర్శలు వినాల్సిందేనా? అన్న అభిప్రాయం మరికొందరిలో వ్యక్తమవుతోంది. కొందరు రఘురామ కృష్ణంరాజుపై ప్రతి విమర్శలు చేస్తున్నా ఆయన లెక్కపెట్టడం లేదు. ప్రధాన ప్రతిపక్షాలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన ల కంటే ఎక్కువ విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని రఘురామ కృష్ణంరాజు ఇరకాటంలో పెడుతున్నారు.

గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ…..

దీనిపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించాలని నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ఆయనను ఇలానే ఉపేక్షిస్తే మరింత రెచ్చిపోవడం ఖాయమంటున్నారు. రఘురామ కృష్ణంరాజు మాత్రం తనపై ఒక వేళ అనర్హత వేటు పడి ఉప ఎన్నిక జరిగినా అన్ని పార్టీలూ మద్దతిచ్చేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలతోనూ టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఉప ఎన్నిక జరిగితే తాను బీజేపీ నుంచి పోటీ చేసినా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించకుండా ఉండేలా రఘురామ కృష్ణంరాజు ప్లాన్ చేసుకుంటున్నారన్న టాక్ వినపడుతుంది.

Tags:    

Similar News