రాజుల కోటలో తిరుగుబాటు ?

రాష్ట్రంలో ఒక సామాజికవర్గానికి ఫలనా సీటు అని ఎన్నికల సంఘం రిజర్వ్ చేసినవి కొన్ని ఉన్నాయి. కానీ జనాలు మెచ్చి వారికే పట్టం కట్టిన సీట్లు కూడా [more]

Update: 2020-07-11 03:30 GMT

రాష్ట్రంలో ఒక సామాజికవర్గానికి ఫలనా సీటు అని ఎన్నికల సంఘం రిజర్వ్ చేసినవి కొన్ని ఉన్నాయి. కానీ జనాలు మెచ్చి వారికే పట్టం కట్టిన సీట్లు కూడా చాలానే ఉన్నాయి. అందులో నర్సాపురం ఎంపీ సీటుని చెప్పుకోవాలి. 1957 నుంచి ఇప్పటికి పదహారు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు తప్ప అన్ని సార్లూ రాజులే ఇక్కడ విజేతలు. ఇక రాజుల కోటగా నర్సాపురాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ కాపులు కూడా ఎక్కువే. అయినా సరే రాజులదే అన్ని విధాలుగా రాజకీయ ఆధిపత్యంగా ఉంది. నర్సాపురం ఎపుడూ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలకమే. ఎపుడూ హాట్ టాపిక్ గానే ఉంటూ వచ్చింది.

తిరుగుబాటు……

ఇక రెండు సార్లు నర్సాపురం జాతీయ రాజకీయాల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. అందులో మొదటిది తీసుకుంటే భూపతిరాజు విజయ కుమార్ రాజు. ఈయన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత. ఎన్టీఆర్ పార్టీ పెట్టకముందు నుంచి పాలిటిక్స్ లో ఉంటూ పలుమార్లు అసెంబ్లీకి నెగ్గిన నేత. ఆ తరువాత అన్న గారు ఆయన్ని ఏరి కోరి తెచ్చి నర్సాపురం నుంచి ఎంపీగా సీటు ఇచ్చి గెలిపించారు. అపుడు టీడీపీకి 35 ఎంపీ సీట్లు దక్కి పార్లమెంటులో అతి పెద్ద బలమైన ప్రాంతీయ పార్టీ విపక్షంగా ఉన్న సందర్భంగా చరిత్ర లిఖించింది.

యాంటీ వేవ్ లో కూడా….

ఇక 1989లో లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి రెండే సీట్లు వస్తే అందులో నర్సాపురం నుంచి విజయకుమార్ రాజు గెలిచి సత్తా చాటారు. ఆ విధంగా యాంటీ టీడీపీ వేవ్ లో కూడా గెలిచిన నేతగా రాజుగారు రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక 1991 మధ్యంతర ఎన్నికల్లో ఇదే సీటు నుంచి మూడవసారి కూడా భూపతిరాజు గెలిచారు. అయితే ఆయన అప్పటికే పార్లమెంట్ లో మంచి పరిచయాలు పెంచుకోవడంతో పాటు టీడీపీ ఓడి ఉండడంతో నాటి ప్రధాని పీవీ నరసింహారావు పిలుపు మేరకు కాంగ్రెస్ లోకి జంప్ చేసారు. ఆ విధంగా నర్సాపురం మేటి దిగ్గజ నేత ఎన్టీఆర్ కి తొలి ఝలక్ ఇచ్చింది. దానికి ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారు. ఏకంగా నర్సాపురం వెళ్ళి మరీ రాజు గురించి ఘాటైన విమర్శలు జనం మధ్యలో ఒక సభలో చేసిన సందర్భం కూడా ఉంది.

మళ్ళీ ఇలా ….

ఇక ఇపుడు చూసుకుంటే అదే నర్సాపురం, మళ్లీ అక్కడ మరో రాజు గారు ఇపుడు జగన్ని సవాల్ చేస్తున్నారు. ఇదంతా చూసుకుంటే మూడు దశాబ్దాల క్రితం అన్న గారికి, భూపతి రాజుకి మధ్య వచ్చిన రాజకీయ సమరం గుర్తుకువస్తోంది. నాడు భూపతిరాజు ఎంపీ సభ్యత్వాన్ని డిస్ క్వాలిఫై చేయమని టీడీపీ పోరాడింది. నేడు అదే నర్సాపురం నుంచి నెగ్గిన వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని జగన్ నేతృత్వంలోని వైసీపీ పోరాడుతోంది. నాడు రాజుగారి సభ్యత్వం పదిలంగా ఉంది. ఆయన తన పదవీకాలాన్ని బాగానే పూర్తి చేశారు. ఇపుడు మరి జగన్ పార్టీ పెట్టిన అనర్హత పిటిషన్ కధ ఏమవుతుందో చూడాలి. నాడు ఎన్టీఆర్ లాంటి ప్రజా నేతకు భూపతి రాజు సవాల్ విసిరితే, నేడు జగన్ లాంటి జనాదరణ కలిగిన నేతకు రఘురామక్రిష్ణంరాజు కొరకరాని కొయ్యగా మారారు. ఇక్కడ చిత్రమేంటంటే నాడు ఎన్టీఆర్, నేడు జగన్ ఇద్దరూ కూడా పార్టీ గీత దాటిన తమ ఎంపీల ముఖాలను తాము చూడకూడదు అని బలంగా అనుకోవడమే.

Tags:    

Similar News