ఫీడ్ బ్యాక్ ఇస్తుంది వారేనా?

దేశంలో సీబీఐ ఉంది. రాష్ట్రాలలో పోలీస్ యంత్రాంగం ఉంది. అంతే కాకుండా సీఐడీ విభాగం కూడా ఉంది. ఇలా అనేక దర్యాప్తు ఏజెన్సీలు ఉండగా బాధిత జనం [more]

Update: 2021-09-06 06:30 GMT

దేశంలో సీబీఐ ఉంది. రాష్ట్రాలలో పోలీస్ యంత్రాంగం ఉంది. అంతే కాకుండా సీఐడీ విభాగం కూడా ఉంది. ఇలా అనేక దర్యాప్తు ఏజెన్సీలు ఉండగా బాధిత జనం వేటికీ తమ గోడు చెప్పుకోకుండా నేరుగా ఒక ఎంపీకి ఫిర్యాదులు చేస్తున్నారు అంటే అది ఆశ్చర్యమే. దానికి మించి ఆయన ఒక్కరే పవర్ ఫుల్ అని భావిస్తున్నారా అన్న డౌట్లూ వస్తాయి. ఆయన ఎవరో కాదు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఆయన తాజాగా మాట్లాడుతూ విశాఖకు సంబంధించిన అన్ని విషయాలూ తనకు తెలుసు అన్నారు. అంతవరకూ బాగానే ఉంది. అక్కడ జరుగుతున్న భూ కబ్జాలు, అవినీతి, అక్రమాల మీద కూడా తనకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఇక్కడే ఎవరైనా విస్తుపోవాల్సిన విషయం ఉంది.

ఎవరు చేస్తున్నారు…

రఘురామ కృష్ణరాజు అంటే జగన్ కి పక్కా యాంటీ అని అందరికీ తెలుసు. ఇక ఆయన తెల్లారిలేస్తే ఢిల్లీ నుంచి మీడియా మీటింగులు పెట్టి మరీ వైసీపీ సర్కార్ ని, జగన్ ని బాగా విమర్శిస్తారని కూడా తెలుసు. అందుకేనా ఆయన ద్వారా ఇలాంటి ఆరోపణలు చేయించాలని ఫిర్యాదులు చేస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. మరి తమ చేతికి మట్టి అంటకుండా వైసీపీ నుంచే నెగ్గిన ఎంపీ రఘురామ కృష్ణరాజు ద్వారా ఆరోపణలు చేయిస్తే బలం చేకూరుతుందని ఏ రాజకీయం చెప్పిందో కానీ ఆ రాజకీయ నేతలే రఘురామకు ఫిర్యాదులు చేస్తున్నారు అనుకోవాలి. లేకపోతే ఎక్కడో ఢిల్లీలో ఉన్న రఘురామ కృష్ణరాజుకు విశాఖ గల్లీ విషయాలు ఎలా తెలుస్తాయి అన్నదే కదా చర్చ.

అందరూ మిత్రులే …

ఇక్కడ మరో విషయం కూడా వుంది. రఘురామ కృష్ణరాజుకు అందరూ మిత్రులే అన్నట్లుగా పరిస్థితి ఉంది. వైసీపీలో కూడా విజయసాయిరెడ్డి అంటే పడని వారు కూడా ఆయనకు ఫిర్యాదు చేసినా చేస్తారు అంటున్నారు. ఇక తెలుగుదేశం అయితే సరేసరి. రఘురాముణ్ణి భుజానా మోస్తోందని ప్రచారం ఉంది. ఇతర ప్రతిపక్షాలు కూడా రఘురామ కృష్ణరాజుని విషయంలో సాఫ్ట్ గానే ఉంటున్నాయి. కాబట్టి తాము గల్లీలో ఎంత అరచి గీ పెట్టినా ఫోకస్ కానీ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రఘురామ కృష్ణరాజు నోటి ద్వారా ఒకటికి పదిసార్లు చెప్పిస్తున్నారు అంటున్నారు. దాంతోనే తనకు విశాఖ మీద ప్రతీ రోజూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని రఘురామ కృష్ణరాజు చెప్పగలుగుతున్నారు.

అలా వాడుకుంటున్నారా…?

రఘురామ కృష్ణరాజు ప్రతీ రోజూ ప్రెస్ మీట్ పెట్టి జగన్ సర్కార్ మీద బండలు వేస్తూంటారు. ఆయనకు ఎక్కడ నుంచి సమాచారం వస్తోంది అన్నది కూడా ఆలోచించాల్సిందే. అయితే ఏపీలో వైసీపీని గట్టిగా ఢీ కొడుతున్న విపక్షాలే ఉప్పు అందిస్తున్నాయని చెబుతున్నారు. ఇక విజయసాయిరెడ్డి విశాఖలో వేలాది ఎకరాలను చెరపట్టారని రఘురామ కృష్ణరాజు ఆరోపిస్తున్నారు అంటే అందులో నింద ఎంత ఉందో నిజం ఎంత ఉందో ప్రభుత్వం కూడా చెక్ చేసుకోవాలి. అలాగే దాని మీద బాధ్యత కలిగిన వైసీపీ నేతలు ఖండించాలి కూడా. లేకపోతే అదే నిజం అని జనం అనుకునే ప్రమాదం కూడా ఉంది. మొత్తానికి ఢిల్లీలో ఉన్న రఘురామ కృష్ణరాజు సీబీఐ ని కూడా మించేసే లెవెల్ లో తయారయ్యారా, తయారు చేశారా అన్నది ప్రజల మాట.

Tags:    

Similar News